రాజకీయాలలోకి వస్తే రజనీయే సీఎం అభ్యర్థి! | Amit Shah try for Rajanikanth | Sakshi
Sakshi News home page

రాజకీయాలలోకి వస్తే రజనీయే సీఎం అభ్యర్థి!

Oct 9 2014 7:36 PM | Updated on May 28 2018 3:58 PM

అమిత్ షా - రజనీకాంత్ - Sakshi

అమిత్ షా - రజనీకాంత్

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ను రాజకీయాలలోకి దింపే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ను రాజకీయాలలోకి దింపే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా రజనీకాంత్ను రాజకీయాలలోకి ఆహ్వానిస్తూ ఈరోజు ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. రాజకీయాలలోకి వస్తే బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అతని పేరుని ప్రకటిస్తామని అమిత్షా ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఏదో ఒక రకంగా రజనీకాంత్ను రాజకీయాలలోకి తీసుకువచ్చి, తమిళనాడులో తమ పార్టీని బలోపేతం చేయాలన్న ఆలోచనలో బిజెపి ఉంది.

అనాదిగా  తమిళ రాజకీయాలలో  సినిమా రంగానికి చెందిన  ప్రముఖులే రాణిస్తున్నారు. వారే విజయసోపానాలను అధిరోహిస్తున్నారు. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత... ఇలా అందరూ సినిమా రంగం నుంచి వచ్చినవారే.  అన్నాదురై, కరుణానిధి వెండితెర వెనుక పని చేస్తే, ఎంజీఆర్, జయలలిత వెండితెరపై ఓ వెలుగు వెలిగారు.  ప్రస్తుతం రజనీకాంత్ తిరుగులేని కథానాయకుడిగా ఓ వెలుగు వెలుగుతున్నారు.

ఈ నేపథ్యంలో బిజెపికి తమిళనాట పెద్దగా సినిమా తారల మద్దతులేదు. అందువల్ల  చాలా కాలంగా ఈ సూపర్‌స్టార్‌ను రాజకీయాలలోకి  దింపే ప్రయత్నాలు చేస్తోంది. 1996లో డీఎంకే, తమిళ మానిల పార్టీల కూటమికి రజనీ మద్దతు పలికారు. అప్పుడు ఆ పార్టీలే విజయం సాధించాయి.  2004లో బీజేపీకి మద్దతు పలికి ఓటు సైతం ఆ పార్టీకే వేసినట్లు  ప్రకటించారు. ఆ తరువాత ప్రతి ఎన్నికల్లోనూ తటస్థంగానే ఉంటున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయనని రాజకీయ రంగ ప్రవేశం చేయించేందుకు బీజేపీ చాలా విధాల ప్రయత్నించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైకి వచ్చిన నరేంద్రమోడీ రజనీకాంత్ ఇంటికి వెళ్లి మరీ కలుసుకున్నారు.
 
 అయితే ఆనాటి పరిస్థితులు వేరు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చాయి.  రజనీకాంత్ రాజకీయ ప్రవేశానికి ప్రస్తుతం అనుకూల వాతావరణం ఉందని బిజెపి భావిస్తోంది.  అందువల్లనే అమిత్షా రజనీకాంత్ తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే  రాజకీయ రంగ ప్రవేశం విషయంలో తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించే  రజనీకాంత్ ఇప్పుడు ఎలా స్పందిస్తారోనని  బిజెపితోపాటు ఆయన  అభిమానులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు.
-శిసూర్య

Advertisement
 
Advertisement
Advertisement