మేము సైతం


కిర్లంపూడిలోని ముద్రగడ స్వగృహంలో భోజనం మానేసి ఖాళీ పళ్లాలను గరిటెలతో ధ్వనింపజేస్తూ ప్రభుత్వ వైఖరికి నిరసన తెలుపుతున్న కుమార్తె క్రాంతి, కోడలు త్రినేత్రి, మనవరాలు భాగ్యశ్రీ.



ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నది నానుడి. ఒక మనిషి విజయం వెనుక ఒక కుటుంబం ఉంటుందనడానికి కిర్లంపూడి సాక్షి. ఇదే విషయాన్ని అక్కడంతా ఇప్పుడు ‘కంచం’కంఠంతో చెబుతున్నారు.

 

ఒకరు చేస్తే తపస్సు... ఇద్దరు చేస్తే దీక్ష... ఒక కుటుంబం అంతా చేస్తే అదో యజ్ఞం! అలాంటి యజ్ఞంలో తమ వంతు సామాజిక బాధ్యతను పోషిస్తున్నారు సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు. కాపులకు రిజర్వేషన్లు, సంక్షేమ నిధి తదితర డిమాండ్లతో శుక్రవారం సతీమణి సహా నిరాహార దీక్ష చేపట్టిన ముద్రగడ పట్టుదల గురించి అందరికీ తెలిసిందే. అటువంటి అకుంఠిత దీక్షాదక్షుని వెనుక ప్రజాకుటుంబమే కాదు సొంత కుటుంబం వెన్నుదన్నుగా ఉంది. వారిలో కుమార్తె క్రాంతి, కోడలు త్రినేత్రిలది కీలకపాత్ర.



దీక్ష ప్రారంభమైన ఫిబ్రవరి 5న పద్మనాభం దంపతుల దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తమ ఇంటికి తరలివచ్చిన కార్యకర్తలతో వీరిద్దరూ కలిసి వారు నినాదాలు చేశారు. ఇంటి పెద్దల దీక్షలో భాగంగా మధ్యాహ్నం భోజనం మానేసి ఖాళీ కంచాలను గరిటెలతో మోగిస్తూ వినూత్న ఉద్యమ ధ్వనికి నాంది పలికారు. ఆ సందర్భంగా ఆ ఫ్యామిలీని ‘సాక్షి ఫ్యామిలీ’ పలకరించింది.

 నాన్న ఏం చేసినా ప్రజల కోసమే ‘నాన్న ఏం చేసినా ప్రజల కోసమే. పట్టుదల చాలా ఎక్కువ.



ఏ పని తలపెట్టినా దానిని విజయవంతం చేయడానికి తీవ్రంగా శ్రమిస్తారు. నేను చిన్నప్పటి నుంచి నాన్నలో గమనించిన ముఖ్య లక్షణం ఇదే..’ అని చెప్పారు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి. ‘నాన్నకు మా నానమ్మ అంటే చాలా ఇష్టం. నా అసలు పేరు సత్యవతి నానమ్మ పేరే. నానమ్మను నాలో చూసుకుంటారు. నాకూ నాన్న అంటే అంతే ఇష్టం. రాజకీయాల్లో ఎలాంటి టెన్షన్లు ఉన్నా ఇంట్లో మాత్రం మాతో సరదాగానే ఉంటారు. పిల్లలతో హాయిగా ఆడుకుంటారు. కానీ ఉద్యమాలు వస్తే మాత్రం సీరియస్ అయిపోతూంటారు.



నేను చాలా దగ్గర్నుంచి చూస్తున్నా. గతంలో నాన్న చేపట్టిన ఐదు ఉద్యమాలూ గమనించా. కానీ నిరాహార దీక్ష అనేటప్పటికీ నా మనస్సులో ఆందోళన ఉంటుంది. నాన్నతోపాటు అమ్మ కూడా దీక్ష చేస్తుంది. గతంలోనే ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. మళ్లీ ఇప్పుడు నాన్నతోపాటు దీక్షకు కూర్చుంది. మాకు మాత్రం అమ్మానాన్న ఆరోగ్యం ఏమవుతుందోననే బెంగ ఉంది. అయినా, ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి పని కోసం వారు దీక్ష చేస్తూంటే వారి గొప్పతనం ఏమిటో మాకు అర్థమవుతోంది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా నాన్న పని చేశారు. ఏ రోజూ సొంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు.



ప్రజల కోసమే ఆలోచిస్తారు. ఆ మనోధైర్యంతోనే ఎన్ని కేసులైనా ఎదుర్కొంటారు. అనుకున్నది సాధించేవరకూ వెనక్కు తగ్గరు. కాపుల కోసం నాన్న చేసిన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరిస్తే దీక్ష విరమిస్తారు. ఆయన ఆరోగ్యం తిరిగి కోలుకొనే వరకూ కుటుంబ సభ్యులమంతా కంటికి రెప్పలా చూసుకుంటాం’ అని చెప్పారు క్రాంతి. అంతే కాదు, ‘నాన్న దీక్ష విజ యవంతమై, ఆయన ఆరోగ్యం కుదు టపడ్డాక నాన్నకు ఎంతో ఇష్టమైన బిర్యానీ, చికెన్-65 నేనే స్వయంగా చేసిపెడతా’ అని చెప్పారు క్రాంతి.

 

మాకు చాలా గర్వంగా ఉంది

నేను పుట్టి పెరిగింది తూర్పు గోదావరి జిల్లా తునిలోనే. ముద్రగడ పద్మనాభంగారి గురించి నా చిన్నప్పటి నుంచీ మా ఇంట్లో  చాలా విషయాలు మాట్లాడుకునేవారు. ఆయన ఇంటికే కోడలుగా వెళ్తానని ఊహించలేదు. నాలుగేళ్ల క్రితం కిర్లంపూడిలో అత్తారింట అడుగుపెట్టా. మా మామగారు నన్ను సొంత కూతురులా చూసుకుంటారు. చాలా గౌరవిస్తారు. ఈ విషయంలో మేమంతా చాలా అదృష్టవంతులం’ అని అన్నారు పద్మనాభం చిన్న కుమారుడు గిరి భార్య త్రినేత్రి.



‘మా మామగారు ప్రజల కోసం ఇలాంటి ఉద్యమం చేయడం చాలా గర్వంగా ఉంది. ఈ నాలుగేళ్లలో అత్తామామల దీక్ష చూడటం నాకిదే తొలిసారి. వారి ఆరోగ్యం గురించి మాకందరికీ దిగులు ఉంది. కానీ ప్రజల శ్రేయస్సు కోసం దీక్ష చేస్తున్నవారికి ఏమీ కాదనే నమ్మకం మాకందరికీ ఉంది’ అని చెప్పారు.

- అల్లు సూరిబాబు

సాక్షి ప్రతినిధి, కాకినాడ


ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి పద్మావతి. పక్కన కోడలు త్రినేత్రి, మనుమరాలు భాగ్యశ్రీ, కుమార్తె క్రాంతి.



ఊరంతా ఏకతాటిపై!

దీక్షలో ఉన్న ముద్రగడ దంపతులు అన్నం ముట్టలేదని ఊరంతా వంటావార్పు మాని సంఘీభావం తెలుపుతున్నారు. ముద్రగడ నిరసన ఏదైనా అది వారికి సమ్మతమే. అందుకే కులాలకు అతీతంగా కిర్లంపూడిలో ఆ కుటుంబానికి మద్దతు లభిస్తోంది.

 

రాజకీయంగా మహిళలకు ప్రోత్సాహం...

మహిళలను రాజకీయాల్లో పద్మనాభంగారు ప్రోత్సహిస్తారనడానికి నేనే ఉదాహరణ. ఇరవయేళ్ల క్రితమే నేను జగపతినగరం గ్రామ పంచాయతీకి సర్పంచి (1995-2000) అయ్యా. కిర్లంపూడి ఈ పంచాయతీలో భాగం. మేము బీసీల్లోని గవర కులస్థులం. కానీ గ్రామంలో పద్మనాభం గారి అభిమానులుగా అందరూ ఒకటిగా ఉంటాం. వారి కుటుంబం దీక్షలో ఉండటం వల్ల పంచాయతీలోని 16 వేల మంది ఇళ్లల్లో వంటావార్పూ మానేసి మద్దతు పలికాం.

- రాపేటి వర్ధనమ్మ, మాజీ సర్పంచి, జగపతినగరం

 

వైఎస్‌తో మాట్లాడి రుణమాఫీ చేయించారు

పద్మనాభంగారి మాటతో నా భర్త రత్నాజీ కిర్లంపూడి పీఏసీఎస్ అధ్యక్షుడిగా నాలుగు దఫాలు ఏకగ్రీవంగా పనిచేశారు. మూడుసార్లు కరువొచ్చి పీఏసీఎస్‌లో తీసుకున్న పంట రుణాలు  రైతులు చెల్లించలేకపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యాక రుణమాఫీ ప్రకటించినప్పుడు పద్మనాభంగారు మాట్లాడి మా గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేశారు. నా భర్త అనారోగ్యంతో చనిపోయిన తర్వాత నన్ను పీఏసీఎస్ అధ్యక్షురాలిగా పద్మనాభంగారే ఏకగ్రీవం చేయించారు.

- ఆడారి సూర్యకుమారి, అధ్యక్షురాలు, కిర్లంపూడి పీఏసీఎస్

 

శుభకార్యం కార్డులో పద్మనాభంగారి పేరు

మా గ్రామంలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా మేము వెళ్లేది పద్మనాభంగారి ఇంటికే. ఆయన వీలును బట్టి తేదీ నిర్ణయించుకుంటాం. పెళ్లికార్డులోనూ పద్మనాభంగారి ఆశీస్సులతో... అని పేరు వేసుకుంటాం. ఏ ఇంట్లో శుభకార్యమైనా దంపతులిద్దరూ వస్తారు. అలాంటివారు ఇప్పుడు దీక్షలో కూర్చున్నారంటే వారి ఆరోగ్యంపై మేమంతా దిగులు చెందుతున్నాం. మా గురించి ఆయన చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే మహిళలమంతా నిరసన గళమెత్తుతాం.

- చల్లా సత్యవతి, గృహిణి, కిర్లంపూడి

 

మాది ఆకలి పోరాటం

పద్మనాభంగారి దీక్ష మాలాంటి విద్యార్థుల కోసం చేస్తున్నారు.  రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఆర్థిక స్థోమత సరిపోక ఉన్నత విద్యకు, ఉపకార వేతనాలకు ఎంతోమంది దూరమవుతున్నారు. భారీగా రుసుం చెల్లించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా కటాఫ్ మార్కుల వ్యత్యాసంతో అవకాశాలు కోల్పోతున్నాం. అందుకే పద్మనాభంగారి దీక్షకు ఒక్క కిర్లంపూడిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల మద్దతు ఉంటుంది. ఎందుకంటే మాది ఆకలి పోరాటం. మాకు ఉద్యోగాలు కావాలి. ఉపాధి కావాలి.

- వింజరపు శాంతి, ఎంఎస్సీ, బీఈడీ విద్యార్థిని, కిర్లంపూడి

 

పద్మావతి గారి ఆరోగ్యంపైనే ఆందోళన

పద్మనాభంగారి భార్య పద్మావతి గారు చాన్నాళ్లుగా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆమె ఎక్కువసేపు దీక్షలో కూర్చోవడం మంచిది కాదని చెప్పాను. షుగర్ లెవెల్స్ కూడా ఆందోళనకరంగానే ఉన్నాయి. పదిహేనేళ్లుగా పద్మనాభంగారి కుటుంబంతో మాకు సాన్నిహిత్యం ఉంది. గ్రామంలో మేము ఆసుపత్రి నిర్మించాలనే మా ఆలోచన చెప్పిన వెంటనే ఆయన ఎంతగానే సంతోషించారు. ఏ అవసరం వచ్చినా తన సహాయం ఉంటుందని చెప్పడం మాకు కొండంత అండ.

- డాక్టర్ ఏబీ జ్యోతిర్మయి, గైనకాలజిస్టు, కిర్లంపూడి

 

అన్నివిధాలుగా అండదండలు

మేము ఏ పని చేసినా పద్మనాభంగారి అండదండలు ఉంటాయి. అంగన్‌వాడీ వర్కర్లకు జీతం పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇచ్చారు. ఆ జీవో విడుదల కోసమే విజయవాడ వెళ్లాం. అందుకని మా ఉద్యోగాలు తీసేస్తారని వార్తలొస్తే మేము పద్మనాభంగారి దృష్టికి తీసుకెళ్లాం. మాకు తండ్రిలా ధైర్యం చెప్పారు. మేము కనిపిస్తే చాలు... అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లల బాగోగులు, సరుకులు మంజూరు గురించి అడిగి తెలుసుకుంటారు.

- చింతపల్లి రత్నం, అంగన్‌వాడీ వర్కర్, కిర్లంపూడి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top