అయినా టీడీపీలో సంతోషం లేదు... !!!

అయినా టీడీపీలో సంతోషం లేదు... !!! - Sakshi


సాక్షి, అమరావతి : నంద్యాలు అసెంబ్లీ ఉపఎన్నికలో విజయం సాధించినప్పటికీ అధికార తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆ ఉత్సాహం కనిపించడం లేదు. కొంత మంది నేతలు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ తెలియని ఆందోళన వారిలో మొదలైంది. ఈ గెలుపు ఆనందాన్ని వారు ఎక్కువగా పంచుకోవడం లేదు. నంద్యాలలో గెలిచిన అంశంకన్నా గెలవడానికి అయిన ఖర్చుపైనే చర్చే టీడీపీలో ఎక్కువగా జరుగుతోంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉండేవో తెలియదు గానీ తమ పార్టీ ఆడిన ‘ మైండ్ గేమ్’  వల్ల ప్రతిపక్ష పార్టీ ఓడిపోయిందన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది టీడీపీ నేతలు వ్యక్తం చేశారు.



ఈ గెలుపు విషయాన్ని టీడీపీకి చెందిన ఒక సీనియర్ నేత స్పందిస్తూ, "మొత్తం రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను దాదాపు 50 నుంచి 60 నియోజకవర్గాలకు పెట్టాల్సినంత 'ఎఫర్ట్' పెడితేగానీ ఈ విజయం సాధ్యం కాలేదు. ఈ ఒక్క అసెంబ్లీ స్థానం గెలవడం కోసం ఎన్ని రకాల ప్రయోగాలు చేశామో పార్టీ నాయకులుగా మాకు తెలుసు... సాధారణ ఎన్నికల్లో ఇది సాధ్యం కాదు. ఇది గమనిస్తున్న మా పార్టీ నాయకులకు సహజంగానే భవిష్యత్తు ఎన్నికలపై ఆందోళన ఉంటుంది" అంటూ విశ్లేషించారు.



భారత దేశ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ గెలుచుకోవడం సర్వసాధారణంగా జరిగింది. దాదాపు 85 శాతం ఉపఎన్నికల్లో అధికార పార్టీయే గెలిచింది. ఆ లెక్కన నంద్యాలలో గెలవడం పెద్ద విశేషమేమీ కాకపోగా ఈ గెలుపుకోసం చేయని ప్రయత్నమంటూ లేదన్నారు. సాధారణ ఎన్నికలకు ఉపఎన్నికలకు ఎంతో తేడా ఉంటుంది. ఉపఎన్నికలు అనగానే అధికార పార్టీకి ఉండే అర్థ, అంగబలం వంటి అనుకూల వ్యవస్థలతో పాటు అడిగిన వారికి అడిగినట్టు అన్నీ సమకూర్చడం వంటి అంశాలే టీడీపీకి ఎక్కువగా కలిసొచ్చాయి.



నంద్యాల అసెంబ్లీ స్థానంలో ఓడిపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడుతుందన్న భయంతో మొదటి నుంచి హామీలు, పనులు, డబ్బు... ఇవే ప్రధాన అస్త్రాలుగా టీడీపీ రంగంలోకి దిగిన విషయం అందరికీ తెలిసిందే. నంద్యాలలో ఉపఎన్నికల్లో గెలవడం కోసం అయిదుగురు మంత్రులు, 18 మంది ఎమ్మెల్యేలు ప్రక్రియ పూర్తయ్యే వరకు నియోజకవర్గంలోనే తిష్టవేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని విపరీతంగా పనులు మంజూరు చేశారు. ఈద్గాలు, తాగునీటి బోర్లు, సిమెంట్ రోడ్లు ఒకటేమిటి అడిగిన అన్నింటికీ అక్కడికక్కడే మంజూరు చేయించారు.



పట్టణంలో మూడు కిమీ మేర రోడ్డు విస్తరణ కోసం ఇళ్ళు, షాపులు తొలగించారు. వారికి ఇప్పటివరకు ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదు. టీడీపీ ఓడితే ఆ పరిహారం అందదంటూ టీడీపీ నేతలు చేసిన ప్రచారం నిర్వాసితుల్లో ఆందోళన కలిగించింది. తద్వారా ఓట్లూ అనివార్యంగా అధికార పార్టీ కి పడేలా "మైండ్ గేమ్" ఆడినట్టు తెలుస్తోంది. మూడేళ్లలో నంద్యాల వైపు చూడని అధికార పార్టీ ఉపఎన్నికలు వస్తున్నాయనగానే నగరంలో రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపట్టింది. ఓడిపోతే ఆ కార్యక్రమం నిలిచిపోతుందన్న అంతర్గత ప్రచారం చేయించడం ద్వారా ఓటర్లపై తీవ్ర ప్రభావం పడేలా చేసింది.



ప్రతి 14 పోలింగ్ బూత్ లకు ఒక ఎమ్మెల్యేను ఇంచార్జి గా నియమించడమంటే ఏ స్థాయిలో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించారో తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక ఉపఎన్నికలో ఇంత డబ్బు ఖర్చు చేసిన దాఖలాలు లేవని సీనియర్ నేతలు స్వీయఅనుభవంతో చెబుతున్నారు. ఈ వార్డులో ఇంతమందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇంత మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేశారు. అవన్నీ అగిపోవద్దు కదా... ఈ వార్డులో ఇన్ని రేషన్ కార్డులున్నాయి. ఇంత రేషన్ తీసుకుంటున్నారు.


అవన్నీ నిలిచిపోకుండా చూసుకోండి... ఈ వార్డులో ఇన్ని ఇళ్లు ఇచ్చాం.. అవన్నీ పూర్తికావాలి కదా... కొత్తగా ఇంతమంది ఇళ్ల కోసం అడుగుతున్నారు. వారందరికీ మంజూరు చేయాలి కదా... అంటూ వార్డులు, కాలనీలు, కులాలు, ఇళ్ల వారిగా కూడా మైండ్ గేమ్ ప్రచారం సాగించారు. అలా చేస్తూనే ఈ వార్డులో మొత్తం ఇన్ని ఓట్లున్నాయి. మాకు ఎన్ని ఓట్లు పడ్డాయో కూడా తెలిసిపోతుంది. తర్వాత మీ ఇష్టం అంటూ పరోక్ష బెదిరింపులతో మైండ్ గేమ్ ఆడినట్టు అక్కడి ఓటర్లు చెబుతున్న కొన్ని విషయాలు విస్మయం కలిగిస్తున్నాయి.



ఈ రకంగా ఓటర్లను తీవ్రస్థాయిలో ప్రభావం చేయడమే కాకుండా ఈ బై ఎలక్షన్ గెలిస్తే జగన్ మోహన్ రెడ్డి సీఎం కాడు. ఆ పార్టీ అధికారంలోకి రాదు. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఓటు వేసి ఏం ప్రయోజనం. రెండేళ్ల తర్వాత మీరు ఎవరికైనా వేయండి. కానీ ఇప్పుడు మాకు వేయండి... అంటూ మానసికంగా ఓటర్లపై ఒత్తిడి చేయడం కూడా తమ పార్టీకి బాగా కలిసొచ్చిందని టీడీపీ నేతలు అంటున్నారు.



నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో టీడిపి మెజారిటీ ఓట్లను‌ కొల్పోకుండా మంత్రి ఆది నారాయణ రెడ్డి తో పాటు మరో ఏడుగురు ఎమ్మెల్యే లు‌ నిత్యం‌ ఆ రెండు మండలాల్లో ప్రతి వంద మంది ఓటర్లకి ఓక నేత చొప్పున నియమించి వాళ్ల ఆర్థిక, సాధక బాధలను తీర్చడం చేశారు. ఓటర్లను ప్రభావం చేసుకోవడానికి వ్యక్తిగత ప్రయోజనాలు చేకూర్చే పనులే కాకుండా ఆయా కాలనీల వారిగా బోర్లు వేయడం, రోడ్లు వేయిస్తామన్న హామీలివ్వడం, రుణాలిప్పిస్తామని చెప్పడం, దర్గాలు, మసీదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం... వంటివి ఒకవైపు చేస్తూనే మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల జగన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి కాల్చి చంపుతా అన్నట్టు జనంలో ప్రచారం చేశారు. నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో వారి ఓట్లను రాబట్టుకోవడానికి శిల్పా కుటుంబం ఆ వర్గాలకు వ్యతిరేకం అంటూ అనేక రకాల దుష్ప్రచారం చేయడంలో కూడా టీడీపీ నేతలు విజయం సాధించారు.



‘ఉపఎన్నికలను సాధారణ ఎన్నికలతో పోల్చలేం. ఏమాత్రం సంబంధం కూడా ఉండదు. అయితే ఒక్క నంద్యాల గెలుపుకోసం అన్ని రకాలుగా మేం చేయని ప్రయత్నమంటూ లేదు. ఈ నియోజకవర్గంలో మేం పెట్టిన ఎఫర్ట్ విశ్లేషించుకుంటే మాత్రం భవిష్యత్తు భయమేస్తోందంటూ’ టీడీపీ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.


సానుభూతి ఉండగా...

ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో ఆయన కుటుంబంపై సానుభూతి ఎంతో ఉంది. 2014 సాధారణ ఎన్నికల సందర్బంగా ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మరణించడం, రెండేళ్లకే భూమా నాగిరెడ్డి మరణించడం, బాధ్యత అంతా కుటుంబంలోని పిల్లపై పడటం వంటి సానుభూతి కూడా ప్రజల్లో ఉంది. సానుభూతి భూమా బ్రహ్మనందరెడ్డికి కలిసొచ్చే అంశం. అయితే, ఇంతగా సానుభూతి పవనాలు వీచినప్పటికీ ఎన్నో జిమ్మిక్కులు చేస్తే గానీ తమ అభ్యర్థి గెలుపు సాధ్యం కాలేదని కూడా టీడీపీ నేతలు విశ్లేషించుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top