చార్మినార్‌లో రెండు మినార్లూ అడుగుతారు: జైరాం | Seemandhra will ask two minars in Charminar, says Jairam Ramesh | Sakshi
Sakshi News home page

చార్మినార్‌లో రెండు మినార్లూ అడుగుతారు: జైరాం

Mar 5 2014 1:54 AM | Updated on Sep 27 2018 5:59 PM

చార్మినార్‌లో రెండు మినార్లూ అడుగుతారు: జైరాం - Sakshi

చార్మినార్‌లో రెండు మినార్లూ అడుగుతారు: జైరాం

‘‘సీమాంధ్రులకు అవకాశం ఇస్తే చార్‌మినార్‌లో రెండు మినార్లు కావాలని అడుగుతారు...’’ అంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాంరమేష్ వ్యంగ్యంగా విమర్శించారు.

 సీమాంధ్రులపై జైరాం వ్యంగ్య విమర్శ
 సాక్షి, విజయవాడ/గుంటూరు: ‘‘సీమాంధ్రులకు అవకాశం ఇస్తే చార్‌మినార్‌లో రెండు మినార్లు కావాలని అడుగుతారు...’’ అంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాంరమేష్ వ్యంగ్యంగా విమర్శించారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు రోజూ అధిష్టానం వద్దకు వచ్చి అష్టోత్తరం, సహస్రనామం చదివినట్లుగా యూటీ కావాలని అడిగారని జైరాం వ్యాఖ్యానించారు. రాయపాటి, లగడపాటి, మేకపాటిలకు కేంద్రం చాలా చేసిందని చెప్పారు. జైరాం మంగళవారం రాత్రి విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమవేశంలో ప్రసంగించారు.
 
 విజయవాడ, గుంటూరు పార్టీ కార్యాలయాల్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తల సమావేశంలో కేంద్రమంత్రి జె.డి.శీలం మాట్లాడుతూ.. దుగ్గరాజపట్నం పోర్టుతో పాటు రామాయపట్నం పోర్టును కూడా అభివృద్ధి చేయాలని కోరినపుడు జైరాం పైవిధంగా ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. సీమాంధ్రకు ఇచ్చిన ప్యాకేజీలు, హామీలు అమలు జరిపేందుకు ప్లానింగ్ కమిటీలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
 
  ప్రత్యేక ప్యాకేజీల అంశం చట్టంలోనో, ఆర్డినెన్స్‌లోనో పెట్టాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఈ హామీలన్నీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటామన్నారు. జాతీయ రహదారుల కాంట్రాక్టర్లు, ఎయిర్‌పోర్టు, ఫార్మాసూటికల్, పవర్ ప్లాంట్  కాంట్రాక్టర్లు అందరూ ఈ ప్రాంతంలోనే ఉన్నారని, వారందరూ తలుచుకుంటే ఈ ప్రాంత అభివృద్ధి చాలా సులభమని వ్యాఖ్యానించారు. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు అధ్యయనంపై వారం రోజుల్లో కేంద్రం నిపుణుల కమిటీని నియమిస్తుందన్నారు. రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టుకు వెళ్లే హక్కు ఎవరికైనా ఉందని, అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్-3, 4 ప్రకారం 1959, 1979, 2002, 2009ల్లో రాష్ట్ర విభజనను ఆమోదిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. తాను సీమాంధ్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యానని, ఏ ప్రభుత్వం ఉన్నా సీమాంధ్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తానని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement