'పవన్ కళ్యాణ్ చిన్న పిల్లగాడు'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం స్పందించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం హైదరాబాద్ లో స్పందించారు. పవన్ కళ్యాణ్ చిన్న పిల్లగాడని, నిన్న జరిగిన సభలో ఆయన సినిమా డైలాగులు చెప్పారన్నారు. తెలంగాణ ప్రాంతంలో పవన్ ప్రభావం ఏమాత్రం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇన్నాళ్లు తెలంగాణ సమస్యలకు పట్టించుకోకుండా పవన్ ఇప్పుడు పార్టీ పెట్టి మాట్లాడటం సరైన పద్దతి కాదన్నారు. ఎన్నో కష్టాలు, నష్టాలకు ఓర్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి పార్టీపై పవన్ ఆరోపణలు చేయడం అర్థరహితమని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ తాను జనసేన పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో ప్రకటించారు. ఆ సందర్బంగా పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలు, ఆశయాలను వివరించారు.అయితే రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరించించిన వైఖరితోపాటు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పలువురు కేంద్రమంత్రులపై పవన్ ఈ సందర్బంగా నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.


