తెలంగాణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త మద్దతు కూడగడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలుస్తామన్నారు.
* యూపీ ముఖ్యమంత్రి స్పష్టీకరణ
*అఖిలేష్‌తో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడి భేటీ

లక్నో నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకిస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త మద్దతు కూడగడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలుస్తామన్నారు. చిన్న రాష్ట్రాలకు సమాజ్‌వాది పార్టీ వ్యతిరేకమని, ఆంధ్రప్రదేశ్ విభజనను అడ్డుకునేందుకు తమ పార్టీ శాయశక్తులా కషి చేస్తుందని అన్నారు. జగన్ శుక్రవారం లక్నోలో అఖిలేష్‌తో భేటీ అయ్యారు. పార్టీ నేతలు ఎం.వి.మైసూరారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బాలశౌరి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనతో ఉన్నారు. యూపీ మంత్రి రాజేందర్ చౌదరి కూడా భేటీలో పాల్గొన్నారు. దాదాపు గంటపాటు సమావేశం సాగింది. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తొలిసారిగా లక్నోకు వచ్చిన జగన్‌కు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను.
చిన్న రాష్ట్రాలకు సమాజ్‌వాదీ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. నేతాజీ (అఖిలేష్ తండ్రి, ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్) కూడా ఈ విషయాన్ని పలుమార్లు స్పష్టం చేశారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల సమస్యలకు పరిష్కారం దొరకదు. పైగా కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ విడిపోయింది. అయినా సమస్యలేమీ పరిష్కారం కాలేదు. మరిన్ని కొత్త సమస్యలను ఆ రాష్ట్రం ఎదుర్కోవాల్సి వస్తోంది. సమస్యల పరిష్కారానికి కేంద్రం ఎలాంటి చర్యలు చేపట్టినా, సంస్కరణలు తీసుకొచ్చినా సమాజ్‌వాది పార్టీ పార్లమెంట్‌లో సమర్థిస్తుంది కానీ.. రాష్ట్ర విభజనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించదు. ఆర్టికల్ 3 ప్రకారమే కాదు.. ఏవిధంగా విభజించినా సమాజ్‌వాది పార్టీ వ్యతిరేకిస్తుంది..’’ అని అఖిలేష్ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజల పక్షాన నిలబడరా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘మేం ఇప్పుడు ఎవరి పక్షానా నిలబడటం లేదు. అరుునా మేం ఎవరి పక్షాన నిలబడ్డామనేది ప్రశ్న కాదు. రాష్ట్రాల విభజనకు మేము వ్యతిరేకం. మేం ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) పక్షాన నిలబడటం లేదు. తెలంగాణ పక్షాన ఉండటం లేదు. విభజనను వ్యతిరేకిస్తున్నాం. విభజన వల్ల వచ్చే లాభం ఏమీ ఉండదని చెబుతున్నాం. చిన్న రాష్ట్రాలకు కొత్త సమస్యలొస్తాయంటున్నాం..’’ అని చెప్పారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా మీ పార్టీ ఓటేస్తుందా? అని అడగ్గా.. ‘‘విభజనకు వ్యతిరేకం అని స్పష్టంగా చెబుతున్నాం కదా! అంటే విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నామనే కదా అర్థం..’’ అని అన్నారు. జగన్‌తో తనకు చాలాకాలంగా స్నేహం ఉందని, లోక్‌సభలో తొలిసారి కలుసుకున్నప్పటి నుంచీ స్నేహం కొనసాగుతోందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సిద్ధాంతాలు మారవచ్చు కానీ స్నేహానికి మాత్రం ముగింపు ఉండదని, జగన్‌తో స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఆర్టికల్-3 సవరణ ఆవశ్యకతను వివరించా
అఖిలేష్ యాదవ్ తనను ఆత్మీయంగా ఆదరించినందుకు జగన్ కతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి పూర్తిగా మద్దతు ఇస్తానని చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ‘‘అఖిలేష్ భాయ్ మద్దతు కోరేందుకు నేనిక్కడికి వచ్చా. మా మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాష్ట్రాలను అడ్డుగోలుగా విభజించడానికి ఉపయోగపడుతున్న ఆర్టికల్-3ని సవరించాల్సిన ఆవశ్యకతను నేను ఆయనకు వివరించా. ఆయన నాతో ఏకీభవించారు. లోక్‌సభలో 272 మంది సభ్యుల బలం ఉంటే ఎవరైనా... ఏ రాష్ట్రాన్ని అయినా విభజించవచ్చు. ఆంధ్రప్రదేశ్ విభజన కూడా అదే విధంగా జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీతోనే ఏ రాష్ట్రాన్నైనా విభజించేలా ఆర్టికల్-3ని సవరించాల్సిన అవసరాన్ని అఖిలేష్‌కు నొక్కిచెప్పాను. ఈ దిశగా దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నా. పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా బీజేపీతో మొదలుపెట్టి.. మమతా దీదీ (పశ్చిమ బెంగాల్ సీఎం), తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధిలను ఇప్పటికే కలిశాను. వారంతా సానుకూలంగా స్పందించారు.
ఇప్పుడు అఖిలేష్ కూడా ఈ విషయంలో పూర్తి సహాయసహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నవారంతా ముందుకు వచ్చి కలిసికట్టుగా వ్యతిరేకించాల్సిన సందర్భం ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తున్నారు... రేపు మిగతా రాష్ట్రాలను విభజిస్తారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌తో ఆగిపోదు. దేశ చరిత్రలో శాసనసభ తీర్మానం లేకుండా ఏ రాష్ట్రాన్నీ విభజించలేదు. ఆంధ్రప్రదేశ్‌ను మాత్రం శాసనసభ తీర్మానం లేకుండానే కేంద్ర ప్రభుత్వం విభజిస్తోంది. శాసనసభ తీర్మానం లేకుండా రాష్ట్రాన్ని విభజించే హక్కును ఢిల్లీకి (కేంద్రానికి) ఇస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌తో మొదలైన విభజన.. మిగతా రాష్ట్రాలకూ విస్తరిస్తుంది. అందువల్ల ఈ విధానాన్ని అడ్డుకోవాలని నేను చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన అఖిలేష్‌కు మనస్ఫూర్తిగా కతజ్ఞతలు తెలుపుకుంటున్నాను..’’ అని జగన్ అన్నారు.
జగన్‌కు ఘనస్వాగతం
లక్నో విమానాశ్రయంలో జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ఉత్తరప్రదేశ్ తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుధాకరరెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్.హనుమంతరావు, మణికరణ్‌రెడ్డి, విద్యాసాగర్, సాయిప్రతీక్ రెడ్డి, విజయ్‌సేనారెడ్డితో పాటు దాదాపు 200 మంది తెలుగువారు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి కాళిదాస్ మార్గ్‌లోని యూపీ ముఖ్యమంత్రి అధికార నివాసం వరకు.. దారిపొడవునా జగన్‌కు స్వాగతం చెబుతూ పెద్ద సంఖ్యలో బ్యానర్లు, కటౌట్లు కనిపించాయి. విమానాశ్రయం నుంచి జగన్ నేరుగా ముఖ్యమంత్రి అధికార నివాసానికి చేరుకున్నారు. ఆఖిలేష్ ఆయనకు ఎదురొచ్చి స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు. దాదాపు గంట పాటు సమావేశం జరిగిన తర్వాత ఇద్దరు నేతలు సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. తర్వాత మరోసారి చర్చలు కొనసాగించారు.


