ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతో తెలుసా?

ఫస్ట్‌డే కలెక్షన్లు ఎంతో తెలుసా?


ముంబై: బాక్సాఫీస్‌ దగ్గర భాయిజాన్‌ ఈసారి మెరవలేదు. గత ‘ఈద్‌’ సినిమాల కంటే దారుణంగా వెనకబడ్డాడు. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ నటించిన ‘ట్యూబ్‌లైట్‌’ సినిమా తొలిరోజు వసూళ్లు ఉసూరుమనిపించాయి. స్వయంగా సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లే ఈ విషయాన్ని పేర్కొన్నారు.



‘బాహుబలి-2’ను మించిపోతుందనే అంచనాల నడుమ శుక్రవారం(జూన్‌ 23న) విడుదలైన ‘ట్యూబ్‌లైట్‌’.. తొలిరోజు కేవలం రూ.21.15 కోట్లు మాత్రమే కలెక్ట్‌ చేసింది. 2016 ఈద్‌కు వచ్చిన ‘సుల్తాన్’ ‌మొదటిరోజు వసూళ్లు రూ.36.54కోట్లు. అదే 2015లో విడుదలైన బజరంగీ భాయిజాన్‌ ఫస్ట్‌డే కలెక్షన్లు రూ.36.50కోట్లు. ఇప్పటివరకు ఫస్ట్‌డే హయ్యస్ట్‌ కలెక్షన్లు సాధించిన హీరోల్లో షారూఖ్‌(హ్యాపీ న్యూఇయర్‌ - రూ.44.97కోట్లు) మొదటిస్థానంకాగా, ప్రభాస్‌ (బాహుబలి-2 - రూ.41.00కోట్లు) ది రెండోస్థానం.



ట్యూబ్‌లైట్‌ కదా.. లేటుగా వెలుగుతుందేమో!

గడిచిన కొన్నేళ్లలో మొదటిరోజు అతితక్కువ వసూళ్లను రాబట్టిన సల్మాన్‌ సినిమా ట్యూబ్‌లైటే కావడం గమనార్హం.  ఎన్నో అంచనాలతో ‘ట్యూబ్‌లైట్‌’ కొని నిరాశచెందామని, సినిమాలోని కంటెంట్‌ జనానికి నచ్చకపోవడం వల్లే ఇలా జరిగిందని రాజేశ్‌ తదానీ, అక్షయ్‌ రాఠీ అనే డిస్ట్రిబ్యూటర్లు మీడియాతో అన్నారు.



రంజాన్‌కు మూడు రోజుల ముందే దేశవ్యాప్తంగా 4,400 స్క్రీన్లపై‘ట్యూబ్‌లైట్‌’ విడుదలైంది. అయితే తొలిరోజు కలెక్షన్లు చూసి నిరాశచెందాల్సిన పనిలేదని, పండుగ నాడు, ఆ తర్వాతిరోజుల్లో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. వీకెండ్‌లో కనీసం రూ.60 కోట్ల బిజినెస్‌ చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.



వార్‌డ్రామా నేపథ్యంలో హాలీవుడ్‌లో(2015లో) వచ్చిన ‘లిటిల్‌ బాయ్‌’ సినిమాకు అఫీషియల్‌ రీమేకే ‘ట్యూబ్‌లైట్‌’! ఇండో-చైనా వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ట్యూబ్‌లైట్‌లో సల్మాన్‌ బుద్ధిమాద్యం గల లక్ష్మణ్‌ సింగ్‌ బిష్త్‌ పాత్రను పోషించాడు. చైనీస్‌ నటి జుజు, బాలనటుడు మార్టిన్‌ రే టాంగు, ఓంపురి తదితరులు ప్రధాన తారాగణం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top