వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ

వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ - Sakshi


ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే భారతదేశ సమైక్యత దెబ్బతింటుందని వలస పాలకులు ్రప్రచారం చేశారు. దేశం నుండి విడిపోకుండా ఎన్ని రాష్ట్రాలు ఏర్పడితే ఏమయిందని కాళోజీ భావన. సమైక్యంగా ఉండటానికి రాష్ర్ట ఏర్పాటు అడ్డంకి కాదని కాళోజీ వాదించారు.     

 

 కాళోజీ నారాయణరావు కవిత్వమంతా నిరంతరం తన చుట్టూ జరుగుతున్న సామాజిక సంఘటనలను ఆశ్రమించి ఉంటుంది. వైయక్తిక జీవితానికీ, కవిత్వానికీ మధ్య ఏ విధమైన వైరుధ్యం కాళోజీ కవిత్వంలో కనిపించదు. తన భావాలను వీలున్నంత తేలికగా వ్యక్తం చేయడమే కాళోజీ లక్ష్యం. తన కవిత్వంలో ప్రజా జీవితాన్ని చిత్రించిన ప్రజాకవి కాళోజీ.

 అవనిపై జరిగేటి అవకతవకలు జూచి

 ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?

 అంటూ ప్రజల కోసం పరితపించిన ప్రజాకవి కాళోజీ. ఆయనకు మొదటి నుంచి రాజకీయ నాయకులతో పేచీ ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలను నిర్లక్ష్యం చేసేవాళ్లంటే ఆగ్రహం.

 నా ఓటుకు పుట్టి నన్నే కాదంటే ఎట్ల కొడక

 మా ఓట్లకు పుట్టి మమ్మె కాదంటె ఎట్ల కొడక

 అని రాశాడు. ఆయన మొదట విశాలాంధ్రను సమర్థించాడు. రెండు ప్రాంతాలు కలిసుంటే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నమ్మాడు. కానీ ఎక్కడా ఎప్పుడూ కాళోజీ ఆశించినట్లు జరగలేదు. జరుగుతున్న అన్యాయాన్ని చూసి కాళోజీ సహించలేకపోయాడు. కొందరి నాయకుల మోసపూరిత విధానాలను ఖండిస్తూ తన కవిత్వంలో తూర్పార బట్టారు.

 భారతదేశంలో ‘ఆంధ్ర రాజకీయాలు’ ఉన్నప్పుడు ‘తెలంగాణ’ రాజకీయాలు కూడా ఉండక తప్పదు అన్నాడు కాళోజీ. పంటలు, సంపద, పెట్టుబడి, అధికారం క్రమ పరిణామమైనప్పుడు ఆక్రమాన్ని ఛేదించక తప్పదు. ప్రత్యేక అధికారం, ప్రజల అధికారం కోసం ప్రత్యేక ఉద్యమాలు తలెత్తుతుంటాయి. కాళోజీ ముందు చూపుతో ప్రజల వైపు నిలిచాడు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో నడిచిండు. బాధ్యతగా ఆ చైతన్యాన్ని చిత్రించిండు.

 ‘ఎవరుకున్నావు? ఇట్లేనని ఎవరనుకున్నావు?’ అనే కవితలో తెలంగాణకు జరిగిన అన్యాయాల్ని సాగుతున్న పక్షపాత వైఖరినీ తేటతెల్లం చేశారు.

 ఎవరనుకున్నారు ఇట్లౌనని ఎవరనుకున్నారు

 ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని

 హామీలిచ్చిన వారే అంతా స్వాహా చేస్తారని

 తప్పుడు లెక్కలతో తమ్ములనెప్పుడు ఒప్పిస్తారని

 అంకెల గారడీ చేస్తూ చంకలు ఎగిరేస్తారని

 ఆత్మహత్య ధోరణులను హంగామా చేస్తారని

 ఎవరనుకున్నారు...

 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం సాగుతున్నప్పుడు కాళోజీ తెలంగాణ రాష్ట్రం కాంక్షిస్తూ కవిత్వం రాశాడు. అందులో తెలంగాణ వేరైతే అన్న కవితలో ఇలా అంటాడు.

 తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా

 తెలంగాణ వేరైతే కిలోగ్రాము మారుతుందా

 తెలంగాణ వేరైతే తెలివి తగ్గిపోతుందా

 తెలంగాణ వేరైతే చెలిమి తుట్టి పడుతుందా

 తెలంగాణ వేరైతే తొలి సంజల పూస్తున్నది

 ప్రజల శక్తి ప్రజ్వలించి ప్రభల ప్రసారిస్తున్నది

 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా 1969 మే నెల ఒకటవ తేదీన వరంగల్లులో జరిగిన ప్రజాసమితి సదస్సులో తెలంగాణ ప్రాంతంలో ఉంటూ తెలంగాణకు ద్రోహం చేసే నాయకుల్ని గుర్తించాడు. అమ్ముడుపోతున్న తెలంగాణ నాయకులను హెచ్చరించాడు. ‘ప్రాంతం వాడే దోపిడీ చేస్తే’ అన్న కవితలో దోపిడిదారుడు ఎవరైనా సరే తన్ని తరమాలన్నాడు.

 

 దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం

 ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం

 ప్రాంతేతరుని దోపిడీకన్నా ప్రాంతం వాడి దోపిడీని తీవ్రమైనదిగా కాళోజీ పరిగణించడాన్ని గమనించాలి.

 ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే భారతదేశ సమైక్యత దెమ్బతింటుందని వలస పాలకులు ప్రాచారం చేశారు. దేశం నుండి విడిపోకుండా ఎన్ని రాష్ట్రాలు ఏర్పడితే ఏమయిందని కాళోజీ భావన. సమైక్యంగా ఉండటానికి రాష్ర్ట ఏర్పాటు అడ్డంకి కాదని కాళోజీ వాదించారు. పాలనలో ప్రత్యేకమే తప్ప ప్రజల జీవనంలో సంబంధాల్లో అరమరికలు ఉండనవసరం లేదని చెప్పారు. ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి వీర తెలంగాణ పోరాటం చేసిన వారసులు, వేరు తెలంగాణ కోరుకోరని కొందరు కవులు పద చమత్కారం చేస్తే కాళోజీ అంతే నైపుణ్యంతో చమత్కరించిండు.

 

 వీర తెలంగాణ నాది వేరు తెలంగాణ నాది

 వేరై కూడ తెలంగాణ వీర తెలంగాణ ముమ్మాటికి

 వీర, వేరు రెండు తెలంగాణలుండవని, చారిత్రక సందర్భం నుంచే రెండు దశలు ఉత్పన్నమయినాయని అన్ని వేళల్లో వీర తెలంగాణగానే ఉంటుందని ప్రకటించిండు. కాళోజీ కల సాకారమైంది. తెలంగాణ సాకారమైంది. ఇక నవ తెలంగాణను నిర్మించుకోవడమనే కర్తవ్యం మనముందుంది. ‘రాజకీయాలు’ పదానికి ప్రత్యామ్నాయంగా కాళోజీ సృష్టించిన పదం ‘ప్రజాకీయాలు’. ఆ శీర్షికతో కాళోజీ రచించిన కవితతో నా వ్యాసాన్ని ముగిస్తాను.

 నేతలకు అలవడింది రాజనీతి దండిగ

 అదే రాజకీయాల నాటిది

 పంచతంత్రం బాపతుది

 రాజనీతికి బదులు

 నేతకు ఉండవలసింది ప్రజాభీతి

 - మూడ్ రాజు, 9640499526

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top