ఇది చిత్రపరిశ్రమ విజయం

ఇది చిత్రపరిశ్రమ విజయం - Sakshi


‘‘తరాలను ఏకం చేసిన చిత్రమిది. 30 ఏళ్లుగా సినిమా చూడనోళ్లంతా బయటకు వస్తున్నారు. నడవలేని వృద్ధులు మనవళ్ల సహాయంతో థియేటర్లకు వచ్చారు. అభిమానులు, దురభిమానులు అనే అడ్డుగోడల్ని చెరిపేసిన చిత్రమిది. ప్రేక్షకులతో పాటు చిత్రపరిశ్రమవారు తమ సొంత సినిమాగా భావించి, స్పందించారు. ఇది మా విజయమో.. తెలుగు జాతి విజయమో కాదు. చిత్ర పరిశ్రమ విజయం’’ అన్నారు నందమూరి బాలకృష్ణ.  క్రిష్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా  వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించిన  ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఈ నెల 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  బాలకృష్ణ పత్రికలవారితో సమావేశమయ్యారు. ఆయనతో జరిపిన ఇంటర్వూ్య...



ఇంత భారీ విజయం వస్తుందని ముందే ఊహించారా?

ఊహించాను కాబట్టే సినిమా చేశా. ఈ చిత్రానికి చక్కని టీమ్‌ కుదిరింది. గుర్గావ్‌లోని స్నేహితుడితో మాట్లాడితే.. ఉత్తరాది జనాలంతా ఈలలు, చప్పట్లతో ఎంజాయ్‌ చేస్తున్నారని చెప్పాడు. ఈ చిత్రానికి భాషాబేధం లేదు. కశ్మీర్, బీహార్‌ తప్ప దేశాన్నంతటినీ పాలించిన యోధుడి కథ ఇది. భావి తరాలు తెలుసుకోవలసిన చరిత్ర. భారతీయులంతా చూడాల్సిన చిత్రం. ఇతర భాషల్లోనూ డబ్బింగ్‌ లేదా సబ్‌ టైటిల్స్‌తో రిలీజ్‌ చేస్తాం.



మీరు తప్ప శాతకర్ణిగా మరొకరు చేయలేరని క్రిష్‌ అన్నారు.. డైలాగులు మీకు తప్ప మరొకరికి సూట్‌ కావని కూడా కొందరు అంటున్నారు..

మంచి ఛాన్స్‌ అనిపిస్తే అంగీకరిస్తా గానీ, ‘నన్నెందుకు అనుకున్నావ్‌’ అని అడుగుతానా? చిత్రంలో ఆవేశం, సందేశం ఉన్నాయి కనుక నేనైతే బాగుంటుందని ఆయన అనుకున్నారేమో. ఆ రోజుల్లో నాన్నగారు, ఎస్వీ రంగారావుగారి డిక్షన్‌ బట్టి డైలాగులు రాసేవారు. ఇప్పుడు నాకలా కుదరడం అదృష్టం. సాయిమాధవ్‌ బుర్రా మంచి డైలాగులు రాయడంతో పాటు లొకేషన్‌లో అప్పటికప్పుడు ఛేంజ్‌ చేసేవారు.   



మీ వందో చిత్రం కాబట్టే శాతకర్ణికి ఇంత హైప్‌ వచ్చిందంటారా?

కచ్చితంగా వందో చిత్రం కావడం ఓ కారణం. ప్రజలకు తెలియని చరిత్ర, ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం వల్ల మంచి హైప్‌ వచ్చింది.



చరిత్రను వక్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి.

శాతవాహనుల్లో  23వ రాజైన శాతకర్ణి గురించి చరిత్రలో నాలుగే లైన్లు ఉన్నాయి. త్రిసముద్ర తోయపీత వాహనుడిగా సైన్యాన్ని నాలుగు దిక్కులకి నడిపించిన యోధుడు.. గణరాజ్యాలను ఏకం చేసిన వీరుడు.. అని మా పరిశోధనలో తెలుసుకున్నాం. తర్వాత శాతకర్ణి పాత్రకు తగ్గట్టు మిగతాదంతా మేము ఊహించుకుని సినిమా చేశాం. చిత్రీకరణకి ముందు శాతకర్ణి కోసం ఓ కిరీటం రెడీ చేయించాం. కానీ, ఆ రోజుల్లో కిరీటాలు లేవు. అందుకే, పట్టాభిషేకం సమయంలో రోమన్‌ తరహా కిరీటం వాడడం జరిగింది.



చిత్రీకరణకు వెళ్లేముందు పాత్ర కోసం మీరెలా సన్నద్ధమవుతారు?

ఏ పాత్రకైనా ఒక్కటే. అయితే... శాతకర్ణి పాత్ర కోసం కొంచెం ఎక్సర్‌సైజ్‌లు చేశా. ఈ మధ్య 6 ప్యాక్స్, 8 ప్యాక్స్‌ అని వస్తున్నాయి. అవన్నీ మన నేటివిటీ కాదు. నేను చొక్కా విప్పితే మనవాళ్లు ఎవరూ చూడరు. మన చరిత్రలో కోడి రామ్మూర్తిగారు ఉన్నారు. ఆయన ఎలా ఉండేవారు? మంచి దిట్టంగా, ధృడంగా ఉండేవారు. మన నేటివిటీ మనది.





ఈ చిత్రంలో తొడ కొట్టే ఐడియా మీదేనా?

దర్శకుడిది. కాకపోతే, విడుదలకి ముందు ఫైనల్‌ కాపీలో ఒక తొడ కొట్టడ మే పెట్టారు. రీ–రికార్డింగ్‌ టైమ్‌లో నేను చూసి ఫోన్‌ చేయగానే, రెండు తొడలు కొట్టిన షాట్‌ పెట్టారు. క్రిష్‌లో గొప్పదనం అదే. మనం చెబితే వింటారు.



‘రైతు’లో అమితాబ్‌ బచ్చన్‌ చేస్తున్నారా?

రాష్ట్రపతి పాత్ర కోసం ఆయన్ను సంప్రదించాం. ఐదారు రోజులు షూటింగ్‌ చేస్తే చాలు. ‘సర్కార్‌–3’ తర్వాత ఆలోచిద్దామన్నారు. కథ అద్భుతంగా వచ్చింది. తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా చేయాలనుకుంటున్నాం.



రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, సందేశాత్మక సినిమాలే చేయాలనుకుంటున్నారా?

రెండిటికీ సంబంధం లేదు. సందేశాత్మక కథలు నచ్చితే చేస్తా. ఫాంటసీ ‘ఆదిత్య 369’, మాయలు మంత్రాల నేపథ్యంలో ‘భైరవద్వీపం’ చేశా. ఇప్పుడీ చారిత్రక సినిమా. నా ఆంగీకం, వాచకం నుంచి కథలు పుడతాయి. నాకు సాహిత్యం మీద అభిరుచి ఎక్కువ. ఆ నేపథ్యంలోనూ సినిమా చేయాలనుంది.



దర్శకుడిగా, నిర్మాతగా సినిమాలు చేసే అవకాశం ఉందా?

నా ఊహల స్థాయికి ఎవరూ చేరుకోలేరనుకున్నప్పుడు దర్శకత్వం వహిస్తా. ఈ ఏడాది ఆఖరున నిర్మాణ సంస్థ ప్రారంభిస్తా.



మల్టీస్టారర్‌ సినిమాలు చేయడానికి సిద్ధమేనా?

పౌరాణిక సినిమా చేయాలనుంది. ఇంకో హీరో ఎవరనేది చెప్పను.



‘నర్తనశాల’ని మళ్లీ చేసే ఉద్దేశం ఉందా?

నా దృష్టిలో సౌందర్య తప్ప అందులో ద్రౌపది పాత్రకి ఇంకెవరూ న్యాయం చేయలేరు. అప్పుడు శ్రీహరిగారు భీముడి పాత్ర చేశారు. దర్శకుడిగా నేను ఎవరితోనైనా నటింపజేయగలను. ప్రతిభ ముఖ్యం కాదిక్కడ. కానీ, ఆహార్యం కుదరాలి. నా ఊహకి తగినవాళ్లు దొరికితే ఆ సినిమా చేస్తా.



ఈ చిత్రానికి ముందు మీరు, మోక్షజ్ఞ కలసి నటిస్తారనే వార్తలు వినిపించాయి!

‘ఆదిత్య 999’ కాన్సెప్ట్‌ బ్రహ్మాండంగా వచ్చింది. ఇంకా కథ సిద్ధం కాలేదు. వీలైతే నేను, మోక్షజ్ఞ కలసి చేయాలనుంది. మేమిద్దరం చేయగలిగిన సినిమా అదొక్కటే. సినిమాలో మా అబ్బాయిని పెట్టాలని కాదు, కథ అలా కుదిరింది.







దంగల్‌’ తరహా సినిమా మీ నుంచి ఆశించవచ్చా?

‘దంగల్‌’ చూడలేదు. సల్మాన్‌ఖాన్‌ ‘సుల్తాన్‌’ చూశా. అప్పుడప్పుడు భార్యాపిల్లలతో ప్రేక్షకుడిగా సినిమాలు చూస్తుంటా. ప్రతిదీ మనం చేయలేం. నేను రొమాంటిక్‌ హీరో కాదు. నటుడిగా నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి.



మోక్షజ్ఙ ఎంట్రీ ఎప్పుడు? కథలు ఏవైనా వింటున్నారా?

ఈ ఏడాది ఆఖరున మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది. నేను ఏదైనా వేడి వేడిగా వడ్డించాలనుకుంటా. ప్లానింగులు, గట్రా వంటి అలవాట్లు లేవు.



మీరు బయట సీరియస్‌గా ఉంటారు. ఇంట్లో కూడా అంతేనా..?

లేదండి బాబు! నేను సరదా మనిషినే. ఇంట్లో మామూలు మనిషిలా.. మీలా ఉంటాను. మా అబ్బాయి, నేను కలసి సినిమాలు చూస్తాం. మా అమ్మాయికి తెలియకుండా మనవడితో కూడా సినిమాలు చూస్తా. తనకు తెలిస్తే.. ‘చిన్న పిల్లాడు కదా, కళ్లకి ప్రాబ్లెమ్‌ అవుతుంది’ అంటుంది.



చిరంజీవి ‘ఖైదీ నంబర్‌ 150’ విడుదల రోజునే మీ సినిమా కూడా విడుదల చేయాలని అభిమానులు ఒత్తిడి తీసుకొచ్చారట! చిరంజీవితో మీ కాంపిటీషన్, రిలేషన్‌ గురించి?

ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు వస్తే పోటీ ఉంటుంది. కానీ, రెండూ డిఫరెంట్‌ సినిమాలు. నేను ఇండస్ట్రీలో క్లోజ్‌గా ఉండేది చిరంజీవితోనే. ఇప్పుడు సినిమాలు, హాస్పిటల్, ఎమ్మెల్యేగా వివిధ పనులతో బిజీగా ఉండడం వలన పెద్దగా ఎవరితోనూ కలవడం కుదరడం లేదు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top