1.42 లక్షల పోస్టులు ఖాళీ

1.42 లక్షల పోస్టులు ఖాళీ - Sakshi


సాక్షి, హైదరాబాద్: బాబొస్తే జాబు వస్తుంది.. ఇది ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీ. బాబు వచ్చాడు, కానీ కొత్త జాబుల సంగతెలా ఉన్నా ఉన్న జాబులు ఊడిపోతున్నాయి. ఇది కనిపిస్తున్న నిజం. బాబు వస్తే జాబ్‌లు వస్తాయని ఉద్దేశంతో ఓట్లేసిన నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం నిండా ముంచుతోంది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర దాటుతున్నా ఒక్క అటెండర్ పోస్టు కూడా ఇప్పటి వరకూ భర్తీ చేయకపోగా.. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. రాష్ట్రంలో 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. భర్తీకోసం ఒక్క నోటిఫికేషన్ కూడా వెలువరించలేదు. డీఎస్సీ పరీక్ష నిర్వహించి చాలాకాలమైనా.. నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు.



చైర్మన్ లేని ఏపీపీఎస్సీ

ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వరాదంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారు. ఏపీపీఎస్సీకి కనీసం చైర్మన్‌ను కూడా నియమించడం లేదు. ఇన్‌చార్జి చైర్మన్ శివన్నారాయణ పదవీకాలం కూడా మూడునెలల క్రితమే పూర్తయ్యింది. చైర్మన్  నియామకం కోసం కమిషన్ నుంచి ఫైలు వచ్చినా సీఎం  నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటుచేయడమే కాకుండా దానికి చైర్మన్‌ను, సభ్యులను నియమించింది. కమలనాథన్ కమిటీతో సంబంధం లేకుండా ఉద్యోగ నియామకాలకు వరుసగా నోటిఫికేషన్లు జారీచేసింది.



ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సీఎం వో, ఆ తరువాత మున్సిపల్ శాఖలో పనిచేసి అక్కడి పరిస్థితులు నచ్చక అసంతృప్తితో ఉన్న గిరిధర్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా నియమించారు. నియామకాల పై నిషేధంతో ఆయన ఉత్సవవిగ్రహంగానే మిగిలా రు. నెలకోసారి సమావేశం కావాల్సిన ఏపీపీఎస్సీ పా లకవర్గం చైర్మన్ లేకపోవడంతో మూడు నెలలుగా భేటీ కావడం లేదు. కాగా, గత ప్రభుత్వాల హయాం లో చేపట్టిన గ్రూప్ 1, 2 నియామకాల న్యాయవివాదాలపై ఇటీవల కొన్ని మార్గదర్శకాలు ఇస్తూ సుప్రీం కోర్టు తుది తీర్పులు వెలువరించింది. తీర్పు వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.



ఖాళీలున్నా పట్టని ప్రభుత్వం

పోస్టుల ఖాళీలపై కమలనాథన్ కమిటీకి ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీల సమాచారం ఇవ్వాలని ఏపీపీఎస్సీ ఆయా శాఖలకు లేఖలు రాసినా అవి అందించడం లేదు. కమలనాథన్ కమిటీకి ప్రభుత్వం నివేదిక ఇవ్వకముందు 16 వేలకుపైగా పోస్టుల ఖాళీలున్నట్లు తనకు వచ్చని సమాచారాన్ని బట్టి అప్పట్లో ఏపీపీఎస్సీకి గుర్తించింది. ఆ పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం అనుమతివ్వడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో నోటిఫికేషన్లపై నిరుద్యోగుల ఆశలు అడియాసలుగానే మిగిలిపోతున్నాయి.



ఐఏఎస్‌ల వద్దకు ఏపీపీఎస్సీ

రాజ్యాంగం సంస్థ అయిన ఏపీపీఎస్సీ ప్రతిష్టను దిగజార్చే పనులు కూడా ఇటీవల జరుగుతున్నాయి. రాష్ట్రాలకు కేటాయింపయ్యే ఐఏఎస్‌లు ప్రాంతీయ భాషను కూడా నేర్చుకోవాలన్న నిబంధన ఉంది. ఏపీకి కేటాయించిన వారికి పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించే బాధ్యత ఏపీపీఎస్సీదే. అయితే ఇటీవల ఏపీకి కొందరు ఐఏఎస్‌లు అలాట్ కాగా వారికి ప్రాంతీయ భాషలో పరీక్ష పెట్టాల్సి ఉంది. అయితే వారు రాలేమనడంతో ఢిల్లీకే వెళ్లాలని ఏపీపీఎస్సీ అధికారులకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలిచ్చి కొత్త సంప్రదాయానికి తెరతీసింది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top