నిజాలు దేవుడికెరుక: ఆ పట్టాలు దాటలేరెవరూ ! | Sakshi
Sakshi News home page

నిజాలు దేవుడికెరుక: ఆ పట్టాలు దాటలేరెవరూ !

Published Sun, Feb 23 2014 4:22 AM

నిజాలు దేవుడికెరుక: ఆ పట్టాలు దాటలేరెవరూ !

 పసివాళ్లు దేవుళ్లతో సమానం అంటారు. అలాంటి పసివాళ్లు దెయ్యాలవుతారా?
 అవ్వడమే కాకుండా... మరికొందరి ప్రాణాలు తీయాలని చూస్తారా?
 ఇవి అర్థం లేని ప్రశ్నలు కాదు. కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలోని టెక్సాస్‌వాసులు అర్థంకాక
 అడిగిన ప్రశ్నలు. కానీ వారికి ఇప్పుడు సమాధానాలు దొరికాయి. అవేంటో తెలుసుకోవాలంటే... శాన్ ఆంటోనియో దగ్గర ఉన్న రైల్ క్రాసింగ్ గురించి, దాని వెనుక ఉన్న కథ గురించి ముందు
 తెలుసుకోవాలి.  

 
 శాన్ ఆంటోనియో... టెక్సాస్. రాత్రి... పది గంటలు కావస్తోంది. అప్పుడప్పుడే చలికాలం మొదలవుతోందేమో... కాస్త వెచ్చదనం, కాస్త చల్లదనం కలిపిన విచిత్రమైన వాతావరణం నెలకొంది. చిరుగాలులు వీస్తున్నాయి. చెట్లు ఊగాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టుగా ఆగాగి ఊగుతున్నాయి.
 తుప్పల మధ్య ఉన్న సన్నటి రోడ్డు మీద వేగంగా దూసుకుపోతోంది కారు. డ్రైవింగ్‌సీట్లో ఉన్న రాబర్ట్ సెల్‌ఫోన్లో తన భార్యతో మాట్లాడుతూ నడుపుతున్నాడు. ‘‘మెల్లగానే వెళ్తున్నానులే డియర్. ఇదేమీ రద్దీగా ఉండే రోడ్డు కాదుగా. ఎందుకు కంగారు పడతావ్’’... భార్యకి సర్దిచెప్తున్నాడు.
 ‘‘నువ్వలాగే అంటావ్. నీ స్పీడు నాకు తెలియదా?’’... కినుకగా అందామె. నవ్వాడు రాబర్ట్. ‘‘సరే సరే... బుంగమూతి పెట్టకు. ఇదిగో... పూర్తిగా స్పీడు తగ్గించేశాను. సరేనా?’’
 ‘‘గుడ్‌బోయ్. అలా రా దారికి’’
 ‘‘రాకేం చేస్తాను. రైల్వేట్రాక్ వచ్చింది. కారు ఆపాలి కదా’’... అన్నాడు రాబర్ట్ నవ్వుతూ.
 ‘‘నా మాట మీద గౌరవంతో ఆపావనుకున్నాను. అసలు నిన్నూ...’’
 ఆమె ఇంకా ఏదో అనబోతుండగానే చెవులు బద్దలయ్యేంత పెద్దగా ఏదో శబ్దం వినిపించింది. ‘‘రీనా’’ అన్న గావుకేక ఆమె చెవుల్లో ప్రతిధ్వనించింది. ‘‘రాబర్ట్...’’ గట్టిగా అరిచిందామె. మరుక్షణం ఫోన్ కట్ అయిపోయింది. మళ్లీ డయల్ చేసింది. రింగవలేదు. మళ్లీ మళ్లీ చేసింది. కనెక్ట్ కావడం లేదు.
 గుండె దడ పెరిగిపోయింది రీనాకి. వెంటనే పోలీసులకి ఫోన్ చేసింది. జరిగినదంతా వివరించింది.
 ‘‘ఆయన ఫోన్ ఏ ప్రాంతంలో ఉండగా కట్ అయ్యిందో చెప్పగలరా?’’... అడిగాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘శాన్ ఆంటోనియో’’
 ఆ పేరు వింటూనే అతడి భృకుటి ముడిపడింది. ‘‘ఈ సమయంలో అక్కడికి వెళ్లడమే తప్పు. మీరు కంగారు పడకండి. నేను ఎంక్వయిరీ చేస్తాను’’ అనేసి ఫోన్ కట్ చేశాడు. భయంతో కూలబడింది రీనా.
    
 శాన్ ఆంటోనియాకి దక్షిణం వైపున ఉన్న రైలు పట్టాల వద్ద పోలీసులు, జనం గుమిగూడి ఉన్నారు. వారికి కాస్త దూరంలో బొమ్మలా కూర్చుని ఉంది రీనా. జరిగేదంతా మౌనంగా చూస్తోంది.
 రైలు గుద్దుకుని ముక్కలు చెక్కలైన కారు నుంచి రాబర్ట్ దేహాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులు. రీనా గుండె దడదడలాడుతోంది. ‘‘కారు పరిస్థితిని చూస్తుంటే రాబర్ట్ బతికివుండే అవకాశం లేదనిపిస్తోంది’’ అన్న ఇన్‌స్పెక్టర్ మాటలు పదే పదే వినిపించి పిచ్చెక్కిస్తున్నాయి. ఆ మాటలు నిజం కాకూడదని మనసులోనే దేవుణ్ని ప్రార్థిస్తోంది. కానీ దేవుడు ఆమె ప్రార్థన వినలేదు. ఇన్‌స్పెక్టర్ చెప్పిందే నిజమయ్యింది. రాబర్ట్ దేహం నుజ్జునుజ్జయిపోయింది.
 రక్తపు ముద్దలా ఉన్న భర్తను చూసి రీనా గుండె చెరువయ్యింది. ‘‘నన్ను వదిలేసి వెళ్లిపోవడానికి నీకు మనసెలా ఒప్పింది’’ అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది.
 ‘‘ఊరుకోండి మిసెస్ రాబర్ట్... ఇక్కడ ఇలా జరగడం మామూలే. అసలు మీవారు ఇటు రాకుండా ఉండాల్సింది’’
 అర్థం కానట్టు చూసింది రీనా. ఆమె చూపుల్ని అర్థం చేసుకున్నాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘మీ అనుమానం నాకు అర్థమైంది. ట్రాక్ వచ్చిందని మీవారు కారు ఆపినా, రైలు ఎలా గుద్దిందనేగా? ఇక్కడ కారు ఆపినా ఆగదు. వాళ్లు ఆగనివ్వరు.’’
 ‘‘వాళ్లా? వాళ్లెవరు?’’ ఆతృతగా అడిగింది రీనా.
 ‘‘వాళ్లే... ఆ పదిమంది పిల్లలు. కాదు... వాళ్ల ఆత్మలు’’
 ఉలిక్కిపడింది రీనా. నేను చెప్పేది నిజం అన్నట్టు చూశాడు ఇన్‌స్పెక్టర్.
 అవును. ఇన్‌స్పెక్టర్ చెప్పింది నిజం. శాన్ ఆంటోనియో రైల్‌క్రాసింగ్ వద్ద వాహనాలు ఆగవు. దానికి కారణం తెలుసుకోవాలంటే, దాదాపు ఎనభయ్యేళ్లు వెనక్కి వెళ్లాలి.
    
 1930 ప్రాంతం. ఓ స్కూలు యాజమాన్యం తమ విద్యార్థులను తీసుకుని పిక్నిక్ బయలుదేరింది. పిల్లలంతా సరదాగా, సంతోషంగా ఉన్నారు. పాటలు పాడుతూ అల్లరి చేస్తున్నారు. వాళ్ల సందడిని టీచర్లు ఎంజాయ్ చేస్తున్నారు.
 
 కొన్నేళ్ల క్రితం పెరూలోని ఓ మ్యూజిక్ బ్యాండ్ ఫ్యాన్ క్లబ్‌కి అధ్యక్షుడైన బ్రెండో పాసినో... ఈ స్థలం మీద ఆసక్తితో అక్కడ పరిశోధనలు చేశాడు. పని గట్టుకుని అక్కడ వాహనాన్ని నిలిపి పరిశీలించాడు. అతడు అమర్చిన కెమెరాలో వాహనం కదలికలతో పాటు... పట్టాల మీద ఓ చిన్నపిల్ల టెడ్డీబేర్ పట్టుకుని నిలబడి చూస్తోన్నట్టుగా కూడా రికార్డయ్యింది. పైన ఉన్న చిత్రం అదే!
 
 కాసేపటి తరువాత స్కూలు బస్సు శాన్ ఆంటోనియో రైల్‌క్రాసింగ్ దగ్గరకు చేరుకుంది. అది పెద్దగా ఎవరూ తిరిగే దారి కాకపోవడంతో టోల్‌గేటు పెట్టలేదు. షార్ట్‌కట్ అవసరం అనుకున్నవారు మాత్రమే అటువైపు వస్తారు. ఇప్పుడీ డ్రైవర్ కూడా అలా అనుకునే ఇటువైపు వచ్చాడు. పట్టాలు దాటుదామని బస్సును పోనిచ్చాడు. కానీ దురదృష్టం... ఓ ఎక్స్‌ప్రెస్ రైలు మృత్యుశకటంలా దూసుకొచ్చింది. పట్టాలు దాటుతోన్న బస్సును వాయువేగంతో గుద్దింది. బస్సు అంతెత్తున ఎగిరిపడింది. కొంతభాగం నుజ్జునుజ్జయిపోయింది. పదిమంది పిల్లలతో పాటు ఇద్దరు టీచర్లు మాంసం ముద్దలైపోయారు. మిగిలిన పిల్లలు తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయారు. ఈ ఘోర ఉదంతాన్ని మర్చిపోవడానికి అందరికీ చాలాకాలమే పట్టింది. ఇంకొన్నాళ్లు గడిస్తే అందరూ మర్చిపోయేవారే. కానీ సరిగ్గా అదే రైల్‌క్రాసింగ్ వద్ద... ఓ వ్యాన్ మళ్లీ యాక్సిడెంటుకు గురయ్యింది. డ్రైవర్ చనిపోయాడు. వెనక కూర్చునవాళ్లు గాయాలతో బయటపడ్డారు. వాళ్లు చెప్పింది విన్నవారి గుండెలు అదిరిపోయాయి.
 
 స్కూలు బస్సు ప్రమాదానికి గురయ్యాక అటువైపు రావడమే మానేశారంతా. కానీ జరిగింది తెలియక వాళ్లు వచ్చారు. పట్టాల మీదికి వెళ్లబోతుండగా వారికి రైలు కూత వినిపించిందట. దాంతో వ్యాన్‌ని ఆపేశారు. కానీ వ్యాన్ దానంతటదే కదలడం ప్రారంభమయ్యింది. ఆపుదామని ఎంత ప్రయత్నించినా వారివల్ల కాలేదు. వ్యాన్ పట్టాల మీదికి చేరింది. రైలు దగ్గరయ్యింది. అయితే అదృష్టం కొద్దీ దూరం నుంచే వ్యాన్‌ని గమనించిన డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేదంటే అందరూ పోయేవారే!
 ఇంజిన్ ఆఫ్ చేసినా కారు ఎలా కదులుతుంది?  మామూలు రోడ్డుకంటే రైలు ట్రాక్ కాస్త ఎత్తులో ఉంటుంది. అలాంటప్పుడు వ్యాన్ ఎలా దొర్లిపోతుంది? పైగా పట్టాల మీదికి వెళ్లి అక్కడే ఎలా ఆగిపోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు అప్పుడెవరికీ తెలియలేదు. కానీ మరికొన్ని ప్రమాదాలు జరిగిన తర్వాత నిజం బయటపడింది.
    
 
 చాలా వాహనాలు ఆంటోనియో రైల్‌క్రాస్ వద్ద ప్రమాదానికి గురవుతుండటంతో అధికారులు నిఘా పెట్టారు. పలువురు పరిశోధనలు చేపట్టారు. అప్పుడు కొన్ని నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ప్రమాదాలకు గురైన వాహనాల వెనుక వైపున... చిన్ని చిన్ని చేతుల ఆనవాళ్లు లభించాయి. ఒకసారి రెండు జతలు, ఇంకోసారి నాలుగు జతలు, మరోసారి ఐదు జతలు... ఇలా పలు వాహనాల మీద చేతుల ముద్రలు పడ్డాయి. దాంతో అధికారులు వాహనాల వెనుక ఫింగర్‌ప్రింట్ పౌడర్ వేసి, తీసుకెళ్లి పట్టాల దగ్గర ఆపి, దిగి చాటునుంచి గమనించారు. కొద్ది క్షణాల్లోనే ఆ వాహనాలు కదిలి పట్టాల మీదకు వెళ్లి ఆగడం చూశారు. రైలు వస్తే గుద్దడం, లేదంటే వాహనాలు దొర్లి దూరంగా పడిపోవడం జరిగేది. తరువాత ఆ వాహనాలను పరిశీలిస్తే... వాటిమీద చేతుల ముద్రలు స్పష్టంగా కనిపించాయి. అవి కచ్చితంగా చిన్నపిల్లల చేతులే. దాంతో బస్సు ప్రమాదంలో చనిపోయిన పిల్లలు దెయ్యాలయ్యారని, వాళ్లే ఈ ప్రమాదాలకు కారకులని అందరికీ అర్థమైపోయింది. అది మాత్రమే కాదు... వాహనం పట్టాల దగ్గరకు రాగానే వాతావరణం చల్లగా అయిపోతుందట. గాలి వీచడం ప్రారంభమవుతుందట. వింత ధ్వనులు వినిపిస్తాయట. ఆపైన వాహనాన్ని ఎవరో తోస్తున్నట్టుగా అనిపిస్తుందట. ఇక దాన్ని నియంత్రించడం వీలు కాదట.
 
 దెయ్యాలు లేవని అనేవారు ఆ వాదనలను ఖండించినా... పరిశోధనలు చేసినవాళ్లు, చేతిముద్రలు చూసిన అధికారులు మాత్రం ఒప్పుకోకుండా ఉండలేకపోయారు. అందుకే ఆ రైలు క్రాసింగ్ ఓ హాంటెడ్ ప్లేస్‌గా మిగిలిపోయింది. పదిమంది పిల్లల ప్రాణాలు తీసిన విషాద స్థలంగానే కాక, ఆ పిల్లల ఆత్మలు సృష్టిస్తోన్న భయోత్పానికి సాక్ష్యంగా కూడా నిలిచిపోయింది!
 - సమీర నేలపూడి

 
Advertisement
 
Advertisement