ఒక్క బిచ్చగాడు... వంద లచ్చగాళ్లు

ఒక్క బిచ్చగాడు... వంద లచ్చగాళ్లు


ఒక్క బిచ్చగాడు సినిమాతో వందల మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు లచ్చాధికారులయ్యారు. స్టార్ బాగుంటే బిచ్చగాళ్లు లచ్చాధికారులు అవుతారంటారు. ఏ స్టార్ వేల్యూ లేని ఈ హీరో... బిచ్చగాడి పాత్రలో వందల మందిని లచ్చాధికారులను చేశాడు. బిచ్చగాణ్ణి మించిన లచ్చనమైన స్టోరీ (సారీ.. లక్షణమైన కథ లేదు.

 

‘బిచ్చగాడు’ బడ్జెట్.. ఒక పెద్ద స్టార్ హీరో తీసుకుంటున్న పారితోషికంలో పది శాతం..

 పేరున్న నటీనటులు చేశారా.. అబ్బే లేదు..

 స్టార్ డెరైక్టర్ తీశాడా.. ఊహూ...

 మరి... ఏ హంగూ ఆర్భాటం లేకుండా బొమ్మ తెరమీద కొచ్చేస్తే జనాలు చూసేస్తారా?

 కంటెంట్‌లో దమ్ముంటే చూస్తారు..

 అందుకు మంచి ఉదాహరణ ఈ ‘బిచ్చగాడు’.

 పేరుకే బిచ్చగాడు...

 తీసినవాళ్లు, కొన్నవాళ్ల పాలిట బిలియనీర్ బాబు...

 శుక్రవారానికి బిచ్చగాడు తెరపైకొచ్చి 50 రోజులవుతోంది.

వసూళ్లు ఎంతో తెలుసా? దాదాపు 20 కోట్ల రూపాయలు..

 సుమారు రెండు కోట్ల బడ్జెట్‌తో తీసిన సినిమా

 పదింతలు రాబట్టడం చిన్న విషయం కాదు.

 ‘బిచ్చగాడు’ని కొన్నాడు.. అయిపోయాడన్నవాళ్లే.. నిర్మాత చదలవాడ లక్ష్మణ్‌ది తెలివైన నిర్ణయం అంటున్నారు.

 

ఓసారి బిచ్చగాడు ‘బిహైండ్ ది స్క్రీన్’ విషయాలు చెప్పాలంటే... ముందు ఆ చిత్రకథానాయకుడు విజయ్ ఆంటోని గురించి చెప్పాలి. ఈయన ఒకప్పుడు  మ్యూజిక్ డెరైక్టర్. ఇప్పుడూ సంగీతదర్శకుడిగా చేస్తున్నారు కానీ, మెయిన్ టార్గెట్ మాత్రం తెరపై కనిపించడమే. హీరోగా చేయాలి. అది కూడా మంచి మంచి సినిమాలు చేయాలని తమిళ చిత్రం ‘నాన్’ ద్వారా హీరోగా మొదటి అడుగు వేశారు. తెలుగులో అది ‘నకిలీ’గా విడుదలైంది. ఆ తర్వాత తమిళంలో చేసిన ‘సలీమ్’... ‘డాక్టర్ సలీమ్’గా విడుదలైంది. రెండూ ఫర్వాలేదనిపించుకున్నాయ్. ఆ తర్వాత చేసిన ‘ఇండియా-పాకిస్తాన్’ తెలుగులో విడుదల కాలేదు. నాలుగో సినిమానే ‘పిచ్చైక్కారన్’. అంటే.. బిచ్చగాడు అని అర్థం.

 

స్టోరీ.. వెరీ సింపుల్

ఇలాంటి టైటిల్‌తో సినిమా చేయాలంటే ఖలేజా కావాలి. లాభాలు వస్తే బిచ్చగాడు.. కోటీశ్వరుడు అయ్యాడంటారు. లేకపోతే సింపుల్‌గా సార్థక నామధేయుడు అంటారు. విజయ్ ఆంటోనీకి, చిత్రదర్శకుడు శశీకి ఆ విషయం తెలియకేం కాదు. కానీ, స్టోరీ డిమాండ్ చేసింది.. ధైర్యంగా ‘పిచ్చైక్కారన్’ అని పెట్టేశారు. కథ చాలా సింపుల్. కన్నతల్లి ఆరోగ్యం కోసం బిచ్చగాడిగా మారిన మిలియనీర్ కథ ఇది.



తమిళంలో ఇలాంటి కాన్సెప్టులకు ఆదరణ ఉంటుంది. హీరో ఏంటి? బిచ్చగాడు ఏంటి? అని ఆలోచించరు. అందుకే తమిళంలో విడుదల చేయడానికి పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. మొదటి రోజునే హిట్ టాక్ తెచ్చేసుకుంది. పెద్ద సినిమాలు చేసే డెరైక్టర్లు, హీరోలు సైతం ‘పిచ్చైక్కారన్’ భేష్ అని అభినందించారు. ఇప్పుడీ సినిమాని తెలుగులో విడుదల చేయాలన్నది విజయ్ ఆంటోని ఆకాంక్ష. ఎవరు కొంటారు?



నో రిస్క్.. ఓన్ రిలీజ్!

తమిళంలో మార్చి 4న విడుదలైంది. ఆ తర్వాత చదలవాడ లక్ష్మణ్ దృష్టి ఆ చిత్రం పై పడింది. నిర్మాత  చదలవాడ శ్రీనివాసరావు తనయుడు ఈయన. తండ్రీ కొడుకులకు సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అంతే.. తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. తమిళంలో మంచి హిట్టయిందన్నది ఓ కారణం. కంటెంట్ బాగుంది కాబట్టి తెలుగు ప్రేక్షకులు చూస్తారన్న నమ్మకం మరో కారణం. దాదాపు 50 లక్షల రూపాయలు పెట్టి ధైర్యంగా అనువాద హక్కులు కొనేశారు. పబ్లిసిటీకి ఓ 25 లక్షలు ఖర్చు పెట్టాలనుకున్నారు. కొంతమంది బయ్యర్లు ముందుకొచ్చినప్పటికీ అమ్మడానికి ఇష్టపడలేదు. సినిమా మీద నమ్మకంతో ఓన్‌గా రిలీజ్ చేయాలని డిసైడైపోయారు. రిస్క్ అవ్వదని కూడా అనుకున్నారు.

 

50 టు 200

పబ్లిసిటీ విషయంలో రాజీపడలేదు. విడుదల చేయాలనుకున్న నెల రోజుల ముందే పబ్లిసిటీ మొదలుపెట్టారు. మే 13న దాదాపు 50 థియేటర్లలో విడుదల చేశారు. ఫస్ట్ షోకే హిట్ టాక్. రోజు రోజుకీ వసూళ్లు పుంజుకున్నాయి. నిర్మాతలో జోరు పెరిగింది. పబ్లిసిటీ ఖర్చు పెంచేశారు. విడుదలకు ముందు నుంచీ ఇప్పటివరకూ మొత్తం పబ్లిసిటీకి దాదాపు కోటీ 75 లక్షలైంది. థియేటర్లు కూడా పెంచారు. మొదట రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 50 థియేటర్లు కూడా లేని ఈ సినిమా ఇప్పుడు 50 రోజులకు చేరువయ్యేసరికి, థియేటర్ల సంఖ్య 200 అయింది. వసూళ్ల లెక్క వింటే ఎవరికైనా సరే... దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ వారాంతానికి 20 కోట్ల రూపాయలు టచ్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో అనువాద చిత్రాల్లో ఈ కలెక్షన్స్ టచ్ చేసిన సినిమా ఏదీ లేదు. తమిళంలోకన్నా ఈ చిత్రం తెలుగులో ఎక్కువ వసూలు సాధించింది. అక్కడ ఈ సినిమా విడుదలై వంద రోజుల పైనే అయింది.



ఇప్పటివరకూ సాధించిన వసూళ్లు దాదాపు 18 కోట్ల రూపాయలు. డెరైక్ట్ సినిమాకన్నా డబ్బింగ్ రూపంలోనే ఎక్కువ వసూళ్లు సాధించడం ఏంటి? ‘‘తెలుగులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కొదవ ఉండదు. ‘బిచ్చగాడు’లాంటి కథలు ఎప్పుడో కానీ రావు. అందుకే తెలుగువాళ్లకు కూడా కనెక్ట్ అవుతుం దని రిలీజ్ చేశాను. ఫ్యామిలీతో కలసి చూసే సినిమా కావడంతో హిట్ ఖాయం అని నమ్మా. అది నిజమైంది’’ అని లక్ష్మణ్ చెప్పారు.

 

బిచ్చగాడికి తిరుగు లేదు

‘బిచ్చగాడు’కి దాదాపు ఇరవై రోజుల ముందు (ఏప్రిల్ 22) విడుదలైన ‘సరైనోడు’ ఈ సినిమా విడుదల (మే 13న) అయ్యే నాటికి వసూళ్ల పరంగా మంచి జోరు మీద ఉంది. ‘బిచ్చగాడు’ తర్వాత విడుదలైన ‘అఆ’ (జూన్ 2) సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అటు ‘సరైనోడు’ కలక్షన్ల ధాటికీ, ఇటు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘అఆ’ ధాటికీ ‘బిచ్చగాడు’ తట్టుకుంది. జూన్ 17న విడుదలైన ‘జెంటిల్‌మన్’ విజయవిహారం చేస్తున్నా ‘బిచ్చగాడు’ వసూళ్లకు నష్టం జరగలేదు. ఈ సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ ఉండటంతో బాక్సాఫీస్ దగ్గర తిరుగు లేకుండాపోయింది. మరికొన్నాళ్ల పాటు ప్రేక్షకులు ఈ బిచ్చగాడికి డబ్బులు ఇవ్వడం ఖాయం... మొత్తం మీద ఈ బిచ్చగాడు వందల మందిని లచ్చాధికారులను చేశాడు.  

- డి.జి. భవాని

 

సినిమాలంటే నాకు చాలా ప్యాషన్. నాన్నగారు చాలా సినిమాలు తీసిన విషయం తెలిసే ఉంటుంది. నిర్మాణ రంగంలో నేను డెరైక్ట్‌గా ఇన్‌వాల్వ్ అయి చేసిన సినిమా ‘బిచ్చగాడు’. అందుకని ఈ చిత్రవిజయం నాకు చాలా

 స్పెషల్ అనిపిస్తోంది. సినిమాల ద్వారా కోట్లు సంపాదించాలనే ఆకాంక్ష మాకు లేదు. మనీ మేకింగ్‌కన్నా ప్రేక్షకులకు మంచి సినిమాలు ఇవ్వాలనుకుంటున్నాం. బలమైన కథ ఉన్న చిత్రాలను అందించాలన్నదే మా ఆలోచన. ‘బిచ్చగాడు’లా ఫ్యామిలీ మొత్తం కలసి చూసే చిత్రాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం.             

- నిర్మాత చదలవాడ లక్ష్మణ్

 

సైథాన్‌గా బిచ్చగాడు

మార్కెట్ లో బిచ్చగాడు తెచ్చిన సంచ లనంతో విజయ్ ఆంటోని రాబోయే సినిమాకు టాలీవుడ్‌లో విపరీతమైన బిజినెస్ క్రేజ్ ఏర్పడుతోంది. డబ్బింగ్ బొమ్మ కళావిహీనం అవుతున్న సమయంలో వినూత్న ఆలోచనతో సినిమా చేసి, అనువాద సినిమాకు ఆక్సిజన్ అయ్యారు విజయ్ ఆంటోని.  ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్నకొత్త సినిమా ‘సైతాన్’ తెలుగులో అదే పేరుతో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించనున్నారు. భిన్నమైన కథలు ఎంచుకుంటాడనే గుడ్ విల్ ఉన్న ఈ హీరోకు ‘బిచ్చగాడు’ సక్సెస్ తోడవడంతో ‘సైతాన్’ కోసం తెలుగు బయ్యర్లు పోటీ పడే పరిస్థితి ఏర్పడుతోంది. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అనువాద హక్కులను  ఎస్. వేణుగోపాల్ దక్కించుకున్నారు. ఎం. శివకుమార్ సమర్పణలో వచ్చే నెల ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నెలలోనే పాటలను విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top