టీడీపీతో పొత్తు లేనట్లే:కిషన్ రెడ్డి | no alliance with tdp, says kishan reddy | Sakshi
Sakshi News home page

టీడీపీతో పొత్తు లేనట్లే:కిషన్ రెడ్డి

Mar 30 2014 1:59 AM | Updated on Mar 29 2019 9:18 PM

టీడీపీతో పొత్తు లేనట్లే:కిషన్ రెడ్డి - Sakshi

టీడీపీతో పొత్తు లేనట్లే:కిషన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీతో పొత్తులకు సంబంధించి ఇక చర్చలు ఉండవని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు.


సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తులకు సంబంధించి ఇక చర్చలు ఉండవని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. శనివారం తెలంగాణ ఎన్నికల కమిటీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీతో పొత్తు అవసరం లేదని, ఒంటరిగానే పోటీకి వెళ్లాలని పార్టీ అధిష్టానం ఆదేశించిందని వెల్లడించారు. అయితే తెలంగాణలో బీజేపీతో పొత్తుకు మరికొన్ని పార్టీలు యత్నిస్తున్నాయని, ఈ విషయంలో అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలిపారు. వాటిలో టీఆర్‌ఎస్ ఉంటుందా? అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా.. చాలా పార్టీలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఉగాది నాటికి 119 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

 

పొత్తు చర్చల కోసం ప్రత్యేకంగా బాబు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలోని రమణ, మోత్కుపల్లి నర్సింహులుతో బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్, పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్‌రెడ్డిలతో అంతకుముందు ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. బీజేపీకి 35 అసెంబ్లీ స్థానాలు, ఏడు పార్లమెంటు సీట్లకు మించి ఇవ్వటం సాధ్యం కాదని శుక్రవారం జరిగిన పొత్తు చర్చల సందర్భంగా చంద్రబాబు చెప్పిన మాటలనే దేశం నేతలు మళ్లీ వినిపించటంతో జవదేకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గంటపాటు చర్చించినా వారు పట్టువిడుపుల ధోరణి చూపకపోవటంతో బీజేపీ నేతలు  అర్ధంతరంగా చర్చలు ముగించి నిష్ర్కమించారు. ఆ తర్వాత ఒంటరిపోరుకు సిద్ధం కావాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంగా ఆదేశించినట్లు సమాచారం. ఈ నెల 31న ఢిల్లీలో జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి అభ్యర్థుల జాబితా పంపాల్సిందిగా ఆయన ఆదేశించారు. అందుకే కిషన్‌రెడ్డి ఉన్నపళంగా ఎన్నికల కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థుల ఖరారు ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా టీడీపీతో జరుగుతున్న పొత్తు చర్చలు ముగిసినట్టేనని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు హరిబాబు శనివారం ‘సాక్షి’కి తెలిపారు.

 

తమ వైపు నుంచి పొత్తు కోసం ఎలాంటి ప్రయత్నాలు ఉండబోవన్నారు. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేస్తున్నామన్నారు.


 దేశంతో దోస్తీకి సంఘ్ వ్యతిరేకం: పొత్తు చర్చల సందర్భంగా బీజేపీ బలాన్ని తక్కువ చేసి హేళనగా మాట్లాడిన చంద్రబాబు తీరుపై ఆర్‌ఎస్‌ఎస్ భగ్గుమంటోంది. ఇక బాబును దేబరించటం మానేసి సొం తంగా ఎన్నికల బరిలో నిలవాలని కమలనాధులకు తేల్చి చెప్పింది. బాబు ఒత్తిడికి తలొగ్గి తక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధపడితే ఆర్‌ఎస్‌ఎస్ నుంచి సహాయనిరాకరణ ఎదురు కావటం తథ్యమంటూ కటువుగానే హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ పొత్తు ఉండాలని భావిస్తే, 50 కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి ఉండాల్సిందేనని షరతు విధించినట్లు తెలిసింది. పొత్తు ఉంటే అశించినన్ని స్థానాలు దక్కే అవకాశం లేకపోవటం, పొత్తు వద్దంటూ 2 రోజులుగా జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు ఒత్తిడి, ఆర్‌ఎస్‌ఎస్ హెచ్చరికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు కూడా ఒంటరిపోరుకు వెళ్లాలనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.  
 
 ఆంధ్ర బీజేపీలో బాబు కోవర్టులు: మరోవైపు సీమాంధ్ర బీజేపీలో చంద్రబాబు కోవర్టులున్నారన్న విషయం కమలనాధులను కలవరపరుస్తోంది. టీడీపీలో సీట్లు సర్దుబాట్లు కష్టమైన స్థానాల్లో కొందరిని బీజేపీలోకి పంపి.. వారినే అభ్యర్థులుగా నిలపమని చంద్రబాబు తమకే డెరైక్షన్ ఇస్తుండటంతో బీజేపీ నేతలు కంగుతింటున్నారు. బీజేపీ కృష్ణా జిల్లాకు చెందిన ఓ నేత బాబుకు ఆర్థిక వ్యవహారాల్లో తన వంతు సహకారాన్ని అందిస్తుండగా, అనంతపురం ప్రాంతానికి చెందిన మరో నేత గతంలో ఎన్‌టీఆర్ ట్రస్టులో కీలక బాధ్యతలు చూసేవారు. నర్సాపురానికి చెందిన మరో నేతకు టీడీపీలో సీటు సర్దుబాటు చేయలేక బీజేపీలోకి పంపినట్లు తెలుస్తోంది. వీరికే సీట్లు కేటాయించమని చంద్రబాబు సూచించడం ఆయన వ్యూహంలో బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పుడీ నేతలే సీమాంధ్రలో బీజేపీని శాసించే స్థాయికి చేరుకోవడం సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సీట్ల కేటాయింపుల విషయంలో బాబు పట్టు కొనసాగిస్తుండడానికి కారణం ఈ కోవర్టులేనని వాపోతున్నారు. సీమాంధ్రలో 7 లోక్‌సభ, 25 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులతో బీజేపీ సిద్ధమవగా, 3 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి బాబు సంసిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. పురందేశ్వరికి సీటు ఇవ్వకూడదని ఆయన షరతుకూడా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.


 

Advertisement
 
Advertisement
Advertisement