టీడీపీ తొక్కేస్తోంది

టీడీపీ తొక్కేస్తోంది - Sakshi


బీజేపీ కార్యవర్గ సమావేశంలో పలువురు నాయకుల ఆగ్రహం

 

 సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తమను తొక్కేస్తోందని, మిత్రపక్షంగా ఉన్నా ఎదగనీయకుండా రాజకీయం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో సోమవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ  సమావేశంలో పలువురు నేతలు మాట్లాడారు.



 గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తే దాన్ని వ్యతిరేకించి జైళ్లకు వెళ్లాం. ఇప్పుడు అవే రిజర్వేషన్లకు అనుకూలంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతుంటే ఏవిధంగా సమర్థిస్తామని యువమోర్చా నేతలు నిలదీశారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ అసెంబ్లీలో అధికార పార్టీ తీర్మానం చేసి, దుమ్మెత్తిపోస్తున్నా మనం ఏమీ చేయలేకపోతున్నామని ఆక్రోశించారు. కార్యకర్తలు అడిగే చిన్నచిన్న పనులు కూడా చేసిపెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా నియోజకవర్గంలో బీజేపీ నాయకులు కొద్దిగా ఎదిగితే టీడీపీ నాయకులు తొక్కేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో వేస్తున్న జన్మభూమి  కమిటీల్లో బీజేపీ కార్యకర్తలకు స్థానం కల్పించారా? అని ప్రశ్నించారు.



 తలెత్తుకోలేకపోతున్నాం: కామినేని

 కేంద్రంలో టీడీపీ నేతలకు పదవులు ఇవ్వనప్పుడు రాష్ట్రంలో బీజేపీ నేతలకు ఎందుకివ్వాలని చంద్రబాబు ప్రశ్నిస్తుంటే తాను తలెత్తుకోలేకపోతున్నానని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పినట్లు సమాచారం. దేవాలయ కమిటీల్లోనూ ఒకటి కంటే ఎక్కువ పోస్టులను బీజేపీకి ఇవ్వవద్దని టీడీపీ నేతలు పట్టుబడుతుండటం వల్ల న్యాయం చేయలేకపోతున్నానని మంత్రి మాణిక్యాలరావు వివరించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు  నేతలకు సూచిం చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  కంభంపాటి హరిబాబు, పార్టీ నేతలు విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ, కృష్ణంరాజు, కన్నా లక్ష్మీనారాయణ, కంతేటి సత్యనారాయణ రాజు, పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top