బాక్సైట్ దారిలో బాబుగారి వేషాలెన్నో!

బాక్సైట్ దారిలో బాబుగారి వేషాలెన్నో! - Sakshi


►  అధికారంలో ఒక మాట.. ప్రతిపక్షంలో మరో బాట

నిజాలన్నీ దాచి నిందలు వేయడం బాబు నైజం


 

(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి)  విశాఖ బాక్సైట్‌పై రాష్ర్టవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అన్ని పక్షాలూ తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి.తవ్వకాలకు అనుమతిస్తూ చంద్రబాబు  ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా మన్యం అట్టుడుకుతోంది.  గిరిజనులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం జీవోను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తనకు తెలీకుండానే ఆ జీవో వచ్చింది అని చెబుతున్నారు.  ఏ ప్రభుత్వంలోనైనా సీఎంకు తెలియకుండా ముఖ్యమైన జీవోలు జారీ అవుతా యా? అది నిజమయితే అలాంటి సీఎం  పరిపాలనకు పనికివస్తాడా? ఎన్నికల ముందు బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకించిన బాబు ఇపుడు ఎందుకు యూ టర్న్ తీసుకున్నారు? ఎందు కు జీవోలు జారీ చేస్తున్నారు? ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత కనపడగానే డ్రామాలు ఎందుకు మొదలు పెట్టారు? జీవో తనకు తెలియకుండా వచ్చిందని చెబుతున్న చంద్రబాబు ఇపుడు రద్దు చేసే అవకాశం తన చేతుల్లోనే ఉన్నా ఎందుకు చేయడం లేదు? ఈ జీవో వల్ల ఉపయోగమెవరికి? నష్టపోయేదెవరు? నిలుపుదల చేస్తున్నానంటూనే చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం వెనక మర్మమేమిటి? తాను తప్పు చేస్తూ నెపం పక్కవారిపై నెట్టేసే బాబు నైజం అనేకమార్లు బైటపడింది. ఇపుడు కూడా ఆయన నిజాలన్నీ దాచేసి దివంగత సీఎం వైఎస్‌రాజశేఖరరెడ్డిపై బురదజల్లేందుకు మరోమారు ప్రయత్నించారు.. అందుకే విశాఖ బాక్సైట్ ఉదంతం పూర్వాపరాలను ఓ మారు పరిశీలిద్దాం..



►  ఎన్నికల ముందు ఏం చెప్పారు?...

ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారు? ‘బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తాం. ఎట్టిపరిస్థితులలోనూ తవ్వకాలను అనుమతించేది లేదు’ అంటూ ప్రగల్భాలు పలికారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ లీజులు, అల్యూమినా కర్మాగారం ఏర్పాటు ఒప్పందం గిరిజనుల హక్కులకు తీవ్ర భంగకరమని, వాటిని రద్దు చేయాలని అసెంబ్లీ లోపలా, వెలుపలా డిమాండ్ చేశారు.  అంతేకాదు గవర్నర్ వద్దకు ఓ ప్రతినిధి బృందాన్ని పంపించి విశాఖ బాక్సైట్ గనుల లీజుతో పాటు తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. విశాఖ బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలంటూ చంద్రబాబు స్వయంగా 24.12.2011న గవర్నర్‌కు ఓ లేఖ రాశారు. 24.04.12న అదే లేఖను మరోమారు విడుదల చేశారు.  



 అధికారంలోకి రాగానే యూటర్న్...

ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట.. పగ్గాలు చేపట్టగానే ఆయనది వేరే బాట.. ఇదీ చంద్రబాబు నైజం. అనేక సందర్భాలలో ఇది రుజువయ్యింది. ప్రతిపక్షంలో ఉండగా గిరిజనుల హక్కుల కోసం పోరాటమన్న  చంద్రబాబు పగ్గాలు చేపట్టగానే యూటర్న్ తీసుకున్నారు. గిరిజనుల హక్కులను కాలరాసే ‘జీవో 97’ని జారీ చేశారు. జీవో 97తో ప్రభుత్వం మన్యంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న 1212 హెక్టార్ల( 3,030 ఎకరాల)భూమిలోనూ, చింతపల్లి, జై భూములలో బాక్సైట్ మైనింగ్ చేపట్టే బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ)కి అప్పగించింది. ఇక్కడ వెలికితీసిన బాక్సైట్ ముడి నిక్షేపాలను నర్సీపట్నం సమీపంలో ‘అన్‌రాక్’ కంపెనీ నెలకొల్పిన రిఫైనరీకి, జిందాల్ గ్రూప్ నెలకొల్పబోతున్న రిఫైనరీకి తరలిస్తారు.



మన్యంలో దావానలం..

బాక్సైట్ తవ్వకాలతో చంద్రబాబు తలపెట్టిన దారుణమైన విధ్వంసానికి  వ్యతిరేకంగా మన్యంలోని గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రజాసంఘాలు, సామాజిక సంస్థలు, పర్యావరణ వేత్తలు, వామపక్షాలతో సహా వివిధ రాజకీయ పార్టీలు వారికి అండగా పోరాడుతున్నాయి. గిరిజన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనాయకులు ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఏకంగా శాసనసభ్యత్వానికే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. గిరిజనుల మనోభావాలకు అనుగుణంగా, వారి హక్కుల పరిరక్షణకై జీవో 97కు వ్యతిరేకంగా ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిసెంబర్ 2న మన్యంలో పర్యటిస్తానని ప్రకటించారు. అన్నివైపుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతుండడం, ప్రతిపక్షనేత  గిరిజనులకు బాసటగా నిలవడంతోనే సీఎం తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.



  జీవో 97 రాజ్యాంగ ఉల్లంఘనే...

ప్రస్తుతం విశాఖ బాక్సైట్ తవ్వకాల కోసం ఎంపిక చేసిన ప్రాంతం గిరిజనులు ఉండే రిజర్వ్‌డ్ ఏజెన్సీ ప్రాంతం. రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 ప్రకారం గిరిజనులకు, వారు నివసించే ప్రాంతాలకు రాజ్యాంగపరంగా కొన్ని రక్షణలు ఉంటాయి. ప్రభుత్వాలైనా గిరిజనుల జీవనం, సంక్షేమాన్ని దెబ్బతీసే కార్యకలాపాలను చేపట్టడానికి వీల్లేదు. ఒకవేళ బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్‌లో సిఫార్సు చేయాలి. ఆ కమిటీని ప్రభుత్వమే నియమించాలి. కానీ ఏడాదిన్నరయినా ప్రభుత్వం ఇంత వరకు కౌన్సిల్‌ను ఏర్పాటు చేయలేదు. కౌన్సిల్ నియామకం కాకుండా మైనింగ్ సిఫార్సుకు తావు లేదని ప్రభుత్వానికి తెలిసినా ఏకపక్షంగా జీవో 97 జారీ చేసింది. అలాగే గిరిజన ప్రాంతంలో ఏం చేయతలపెట్టినా గ్రామ సభల ఆమోదం పొందాలి. గవర్నర్ సిఫార్సు చేయాలి. ఆ తర్వాత రాష్ర్టపతి ఆమోదం కూడా పొందా లి. వీటిలో ఏ ఒక్కటినీ చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చలేదు.



 సుప్రీం మార్గదర్శకాలూ ఉన్నాయి...

 అటవీ ప్రాంతాలలోని అమూల్యమైన సంపదను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేయడానికి వీలులేకుండా సుప్రీం కోర్టు 1997లో చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ఆదివాసీల భూములను అప్పటి ఏపీ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు మైనింగ్ లీజులకిచ్చింది. ఆ నిర్ణయాన్ని ‘సమత’ అనే స్వచ్ఛంద సంస్థ కోర్టులో సవాలు చేసింది. కింది కోర్టుల్లో వారి పిటిషన్ వీగిపోయినా సుప్రీం అత్యంత ముఖ్యమైన తీర్పును వెలువరించింది. దాని ప్రకారం... ఆదివాసీలు, గిరిజనులు నివసించే ప్రాంతాలలోని ప్రకృతి, ఖనిజ వనరులు ఏవైనా స్థానిక ప్రజల సంక్షేమానికే ఉపయోగించాలి. అలాగే మన్యంలో గనుల్ని తవ్వే హక్కులు గిరిజనులకు మాత్రమే చెందుతాయని అంతవరకు ఉన్న చట్టం. గిరిజనులకు ఉన్న ఈ హక్కుకు సుప్రీంకోర్టు మద్దతు పలికింది.  



 70వ దశకంలోనే బాక్సైట్‌పై అంచనాలు

తూర్పు కనుమల్లో బాక్సైట్ సంపద నిక్షిప్తమై ఉందని 70వ దశకంలోనే గుర్తించారు. 21శాతం బాక్సైట్ నిక్షేపాలున్న ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఆ సంపదను వాణిజ్యపరంగా ఉపయోగించాలని 1970లోనే ఏపీఐడీసీ ప్రయత్నించింది. మెకాన్ సంస్థతో 1975 ఏప్రిల్‌లో సర్వే చేయించారు. 1987లో రష్యన్ సంస్థతో కలసి ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేయించారు. ఆంధ్రప్రదేశ్ భూ బదలాయింపుల క్రమబద్ధ్దీకరణ చట్టం -1970 ప్రకారం గిరిజనుల భూములని ఏ రకంగానైనా గిరిజనేతరులకు బదలాయించడం నిషిద్ధం. ఆ తర్వాత ఈ చట్టానికి చేసిన సవరణ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు మైనింగ్ చేయడం కూడా నిషిద్ధ్దం.



 గతంలోనే బాబు యత్నాలు..

వెన్నుపోటుతో అధికారం చేజిక్కించుకోగానే బాక్సైట్ నిక్షేపాలపై బాబు కన్నుపడింది. సుప్రీం తీర్పు అందుకు ఆటంకంగా మారింది. గిరిజనుల చట్టాలూ ఆయన కాళ్లకు అడ్డంపడ్డాయి. అయినా బాబు దుబాయ్ నుంచి ఓ బృందాన్ని పిలిపించి, అక్కడి కొండల్ని చూపించి తవ్వుకోవడానికి మీరు రెడీనా అని అన్నారు. దుబాయ్ ప్రతినిధి బృందానికి సకల సదుపాయాలూ కల్పించాలని సూచిస్తూ 29-02-2000న సీఎం చంద్రబాబు కార్యదర్శి స్వయంగా పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. దుబాయ్ బృందం 2000 మేలో హైదరాబాద్ వేంచేయగా సీఎం హోదాలో చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు. చట్టాలను, సుప్రీంకోర్టు తీర్పును తోసిరాజని బాబు తన ‘చాణక్యం’ అంతా ఉపయోగించి 2000 మే, జూన్‌లలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్‌తో ప్రత్యేక తీర్మానం చేయించారు.



2000 మే 24న విశాఖ గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్‌లో జరిపిన భేటీలో ఈ కౌన్సిల్‌తో ‘మన్యంలో గనుల్ని గిరిజనేతరులు కూడా తవ్వవచ్చు’ అని దుర్మార్గమైన తీర్మానం చేయిం చారు. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ రాజ్యాంగబద్ధ సంస్థ. అది గిరిజనుల హక్కుల పరిరక్షణకు పనిచేయాల్సిన సంస్థ. కానీ దానితోనూ నిబంధనలకు విరుద్ధమైన తీర్మానాలు చేయించిన ఘనుడు చంద్రబాబు.ఆయన ప్రభుత్వం చట్టాలకు తూట్లు పొడిచిన తర్వాతే విశాఖ బాక్సైట్ మైనింగ్ లీజుల్ని నేరుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రమాదం దాపురించింది. ఆ తర్వాత దుబాయ్ అల్యూమినియం కంపెనీ(దుబాల్)కు లీజులు కట్టబెట్టేందుకు బాబు చేయని ప్రయత్నమే లేదు. 2004 మేలో దుబాయి బాబులు రంగంలోకి దిగిపోయారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో బాబు ఆశలు ఆవిరయ్యాయి. బాక్సైట్ నిక్షేపాలను నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టి తానూ ముడుపులు మింగేయాలని తహతహలాడిన చంద్రబాబు ఇపుడు తానేమీ ఎరగనట్లు వైఎస్ హయాంలోనే బాక్సైట్ లీజుల వ్యవహారం ఆరంభమయినట్లు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు.



 గిరిజన సంక్షేమానికి అనుగుణంగానే వైఎస్ నిర్ణయాలు

చంద్రబాబు చేసిన చట్ట సవరణలు, ప్రత్యేక తీర్మానాల కారణంగా విశాఖ బాక్సైట్ మైనింగ్ లీజులు నేరుగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే అవకాశం ఉన్నా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సంయమనం పాటించింది. బాక్సైట్ గనుల లీజుల్ని నేరుగా కంపెనీలకు కేటాయించలేదు. నిజానికి లీజు తమ పేరిటే ఉండాలని బాబు తీసుకువచ్చిన దుబాల్ కంపెనీ గట్టిగా పట్టుబట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలోని మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కే సర్వహక్కులు ఉంటాయని వైఎస్ సర్కార్ స్పష్టం చేసింది. జిందాల్, అన్‌రాక్, నాల్కో వంటి కంపెనీలు బాక్సైట్‌ను అల్యూమినా, అల్యూమినియంగా మార్చే కర్మాగారాలని వేలకోట్ల పెట్టుబడిపెట్టి అక్కడే నెలకొల్పాలని వైఎస్ సర్కార్ నిర్ణయించింది. బాక్సైట్ దొరికే చోటే కర్మాగారం ఏర్పాటయితే గిరిజనులకు ఉపాధి లభిస్తుంది.



అంతేకాదు బాక్సైట్ శుద్ధి కర్మాగారాలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో లాభాలు - టర్నోవర్‌లలో ప్రభుత్వం, సంస్థలు, ఏపీఎండీసీలు తమ వంతుగా ఎంతెంత శాతాన్ని గిరిజనుల సంక్షేమానికి వెచ్చించాలన్న స్పష్టమైన నిబంధనలూ ఉన్నాయి.  ప్రభుత్వానికి వచ్చే రాయల్టీలో 25%, ఏపీఎండీసీ ఖనిజ విక్రయాల ద్వారా పొందే ఆదాయంలో 20%, అల్యూమినా కర్మాగారం సాధించే లాభంలో 0.5% మొత్తాన్ని ఈ ప్రాంతంలోని గిరిజనుల ఆర్థిక, సామాజిక ప్రగతికి వెచ్చించాలని స్పష్టమైన నిబంధన ఉంది. చంద్రబాబులా నచ్చిన కంపెనీలకు నిబంధనలను అతిక్రమించి మరీ అడ్డగోలుగా అన్నీ కేటాయించే నైచ్యానికి వైఎస్ ఎన్నడూ దిగజారలేదు. షరతులతో కూడిన ఆరు గనుల తవ్వకం లీజులను ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ పేరిట మంజూరు చేసింది. 1957 గనుల చట్టం, 1960 ఖనిజాల రాయితీ నియమావళి మేరకే ఒప్పందాలు జరిగాయి. అంతకు ముందు ప్రభుత్వాల హయాంలో ప్రయత్నాలు జరిగినట్లే వైఎస్ హయాంలోనూ బాక్సైట్ అనుబంధ పరిశ్రమల స్థాపనకు (గిరిజనుల సంక్షేమానికి విఘాతం కలగకుండా) నిబంధనల మేరకు ప్రయత్నాలు జరిగాయి. అయినా వ్యతిరేకత రావడంతో ఆ ప్రయత్నాలను వైఎస్ పూర్తిగా నిలిపేశారు.



దొంగే దొంగా అన్నట్లు...

విశాఖ బాక్సైట్ వ్యవహారంలో ఆది నుంచి నేటి వరకు జరిగిందిదే. తన నేరాలన్నిటినీ దాచిపెట్టి పక్కవారిపై నెపం మోపడానికి ప్రయత్నించడం బాబు నైజం. బాక్సైట్ లీజుల వ్యవహారాన్ని రాజశేఖరరెడ్డి మీద, కాంగ్రెస్ మీద నెట్టేయడానికి శ్వేత పత్రంలో ఆయన చేయని ప్రయత్నమే లేదు. చంద్రబాబు చెప్పినట్లు వైఎస్ హయాంలోనే బాక్సైట్ తవ్వకాలు జరిగాయనేది శుద్ధ అబద్దం. ఇన్నేళ్లు అక్కడ బాక్సైట్ తవ్వకాలు జరగనేలేదు. ఒక్క తట్ట కూడా బాక్సైట్‌ను ఎత్తి పోయలేదు. వైఎస్‌కు ముందు, వైఎస్ తర్వాత బాక్సైట్ తవ్వకాల కోసం నిబంధనలను అతిక్రమించి అనేక ప్రయత్నాలు చేసింది చంద్రబాబే. ప్రతిపక్షంలో ఉండగా బాక్సైట్ తవ్వకాలు నిషేధించాలని ఉద్యమాలు చేసిన, చేయించిన బాబు అధికారంలోకి రాగానే యూటర్న్ తీసుకోవడానికి కారణాలు వెతకనక్కరలేదు. గిరిజనుల ప్రయోజనాలను పణంగా పెట్టి బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తేనే ఆయన మెచ్చిన కంపెనీలు బాగుపడతాయి. అందుకే  హడావుడిగా జీవో జారీ చేశారు. వ్యతిరేకత రావడంతో ఆ జీవో సంగతే తనకు తెలియదంటున్నారు. ప్రస్తుతానికి జీవోను నిలుపుదల చేశామని చెబుతున్నారు.. గిరిజనుల సంక్షేమంపై నిజంగా చిత్తశుద్ది ఉంటే జీవోనే రద్దు చేయవచ్చు కదా? అది వదిలేసి శ్వేతపత్రాలు విడుదల చేయడం దేనికి సంకేతం? చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే జీవోను రద్దు చేసేవారని, అలా కాకుండా నిలుపుదల చేయడంలోనే ఏదో కుట్ర పొంచి ఉందని గిరిజన సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

 

ఆద్యుడు చంద్రబాబే.. అయినా ైవె ఎస్‌పై బురదజల్లే యత్నం


విశాఖ బాక్సైట్ లీజులకు ఆద్యుడు చంద్రబాబే. 1995లో పదవి చేపట్టగానే ఆయన బాక్సైట్ నిక్షేపాలపై కన్నేశారు. నిబంధనలను మార్చి, గిరిజనులను ఏమార్చి 2000లోనే దుబాయ్ కంపెనీ ప్రతినిధులను తీసుకొచ్చి బాక్సైట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ నిజాలన్నీ దాచి ఇపుడు వైఎస్ రాజశేఖరరెడ్డిపై బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు 2004 ఎన్నికల్లో గెలిచినట్లయితే దుబాయ్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు బాక్సైట్ తవ్వకాలతో యథేచ్ఛగా దోపిడీ సాగించేవారే. ఆయన ఓడిపోవడంతో వినాశకరమైన దుబాయ్ ఒప్పందాలకు బ్రేక్ పడింది. బాక్సైట్ తవ్వకాలపై వైఎస్ దృష్టిపెట్టినా గిరిజనుల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతమూ కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top