ఐటీ హబ్‌గా హిందూపురం

ఐటీ హబ్‌గా హిందూపురం - Sakshi


హిందూపురం మునిసిపాలిటీ : తగిన ప్రణాళిక రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి హిందూపురం ప్రాంతంలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన నియోజకవర్గంలోని పార్టీ ఎమ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, పట్టణంలోని కౌన్సిలర్లు, తదితరులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు.

 

 అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బెంగళూరు నుంచి అనంతపురం వరకు ఐటీ కారిడార్‌ను కచ్చితంగా తీసుకొస్తామన్నారు. అలాగే ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా చర్యలు చేపట్టామన్నారు. హిందూపురం ప్రాంతంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు కోసం  నిపుణుల ద్వారా అధ్యయం చేస్తున్నామన్నారు.

 

  పట్టణానికి బెంగళూరు దగ్గరగా ఉండటం, అక్కడ ప్రభుత్వ కిద్వాయ్ ఆస్పత్రి ఉండటం వల్ల ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి పీఏబీఆర్ నుంచి నీటి సరఫరా నిమిత్తం నిరంతర విద్యుత్ సరఫరా కోసం బంజుల బండ నుంచి ప్రత్యేక విద్యుత్ లైన్లతకు ప్రభుత్వం రూ.4 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. శుక్రవారం అనంతపురంలో జరిగిన సమావేశంలో హంద్రీ నీవా, పీఏబీఆర్ పథకాలపై చర్చించామన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణాల నుంచి మహిళల వలసల నివారణకు ఇక్కడే గార్మెంట్స్ పరిశ్రమల స్థాపనకు చర్యలు చేపడుతున్నామన్నారు.

 

 బాలకృష్ణకు అంగన్‌వాడీ కార్యకర్తల వినతి

  స్థానిక ఆర్‌అండ్ బీలో ఎమ్మెల్యేను కలిసి అగన్‌వాడీ కార్యకర్తలు తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం చెల్లిస్తున్న అద్దె చాలడం లేదంటూ యజమానులు ముందుకు రావడం లేదన్నారు.

 

 దీంతో కేంద్రాల నిర్వహణ కష్టంగా మారిందని, శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, తమ జీతాలను పెంచాలని వారు కోరారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు బాలకృష్ణకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top