రంగు మారుతున్న టీడీపీ
జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు నకలుగా మారుతోందా అంటే.. ప్రస్తుత సమీకరణలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది.
- రంగు మారుతున్న టీడీపీ
- పదవుల కోసం కాంగ్రెస్ నేతల వలసలు
- భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు
- మాజీ మంత్రి సారథి చేరికపై ఉమా గుర్రు
- జిల్లా ‘దేశం’లో మారుతున్న సమీకరణలు
జిల్లాలో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు నకలుగా మారుతోందా అంటే.. ప్రస్తుత సమీకరణలు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. పదవుల కోసం వైఎస్సార్‌సీపీలోకి చేరేందుకు విఫలయత్నం చేసిన పలువురు కాంగ్రెస్ నేతలు ఇప్పుడు టీడీపీ వైపు చూడటం కొత్త సమస్యలకు దారితీస్తోంది. ఏళ్ల తరబడి పార్టీ జెండాలు మోసిన నాయకులు, కార్యకర్తలను వదిలి పదవుల కోసం టీడీపీలోకి వస్తున్న కాంగ్రెస్ నాయకులను బాబు భుజానికెత్తుకోవడంపై తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. జిల్లాలో ఆ పార్టీలోని ఆశావహుల్ని కాదని పసుపు చొక్కా వేసుకునే కాంగ్రెస్ వారికి టిక్కెట్ ఇస్తే ఓడించేందుకు సైతం తాము వెనుకాడబోమని టీడీపీకి చెందిన క్యాడర్ చెబుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ : కాంగ్రెస్‌పై తరచూ విరుచుకుపడే జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇప్పుడు కాంగ్రెస్‌కు నకలుగా మారిపోతున్న సొంత పార్టీ పరిస్థితిపై బెంగ పట్టుకుంది. పదవుల కోసం కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావులను తమ పార్టీలోకి రాకుండా నిలువరించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు సమాచారం. అయితే సారథి, ముద్దరబోయిన ఇద్దరిలో ఒక్కరికైనా సీటు ఇవ్వాల్సి వస్తుందని చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్టు వినికిడి.
మైలవరంలో రెండోసారి గెలిచే అవకాశం లేనందున దేవినేని ఉమా రానున్న ఎన్నికల్లో పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్నారు. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీలో చేరి పెనమలూరు సీటు ఆశించే అవకాశం ఉండగా, బోడే ప్రసాద్, వైవీబీ రాజేంద్రప్రసాద్ తమ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోవడంతో టీడీపీలో వర్గపోరు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. వర్గపోరు నేపథ్యంలో పెనమలూరు సీటుపై ఉమా దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నూజివీడులో అప్పుడే రంగులు మార్చేసి టీడీపీ కార్యాలయం కూడా తెరిచేశారు. అదే సీటుపై ఉమాతో పాటు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు ఆశలు పెట్టుకున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు తొలి నుంచి నూజివీడు సీటును ఆశిస్తున్నారు. అదే సామాజికవర్గానికి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టిక్కెట్ ఇస్తే టీడీపీలో సేవలు అందిస్తున్న బచ్చుల అర్జునుడు వర్గం తిరుగుబాటు చేసే అవకాశం ఉంది.
బెజవాడలో యలమంచిలి, వెల్లంపల్లి...
మరోవైపు విజయవాడకు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న కేశినేని శ్రీనివాస్(నాని)కు టిక్కెట్ రాకుండా ఆయన వ్యతిరేక వర్గీయులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్‌కు కాకుండా కాంగ్రెస్ ప్రస్తుత ఎమ్మెల్యే యలమంచిలి రవికి కేటాయించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్యాకేజీలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిత్వం ఇచ్చేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
బాడిగకు హామీ...
మరోవైపు ఎంపీ కొనకళ్ల నారాయణరావు గుండెకు శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న తరుణంలో చంద్రబాబుతో పలువురు కాంగ్రెస్ నాయకులు మంతనాలు జరిపి సీటు రాయబారాలు నెరపడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే బందరు ఎంపీ సీటుపై కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణకు చంద్రబాబు హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ కుమారుడు టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి తన తండ్రికి ఎంపీ టిక్కెట్ కోరినట్టు సమాచారం.
బందరు ఎంపీ టిక్కెట్ కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలకు ఇస్తే ఎంపీ కొనకళ్ల నారాయణరావు తమ్ముడు కొనకళ్ల జగన్నాధరావు(బుల్లయ్య)కు పెడన, పెనమలూరు అసెంబ్లీ టిక్కెట్‌లలో ఒకటి కేటాయించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అదే జరిగితే పెడనపై ఆశలు పెట్టుకున్న టీడీపీ మాజీ చీఫ్ విప్ కాగిత వెంకట్రావుకు రాజకీయ నిరుద్యోగం తప్పదు. అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరితే అవనిగడ్డ ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. టీడీపీలోకి చేరే కొత్తవారి కోసం సీట్లు కేటాయిస్తే పార్టీ శ్రేణులు తిరుగుబాటు చేస్తారని చెబుతున్నారు.
మాజీ మంత్రి సారథిపై ఫేస్‌బుక్‌లో సెటైర్లు
కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో సోషల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని సారథిపై సెటైర్లు పేలుస్తున్నారు. ప్రధానంగా పెనమలూరు, పామర్రు, గుడివాడ, అవనిగడ్డ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ శ్రేణులు ఫేస్‌బుక్‌లో సారథిపై వ్యంగ్యంగా సెటైర్లు పెట్టడం గమనార్హం.


