నోట్లమార్పిడి పులిపై మోదీ స్వారీ

నోట్లమార్పిడి పులిపై మోదీ స్వారీ - Sakshi


అభిప్రాయం

వందల ఏళ్లుగా ఉనికిలో ఉన్న రూపాయిని ప్రధాని మోదీ ఒక్క దెబ్బతో చిత్తుకాగితంగా మార్చేశారు. బ్యాంకులలో ఉన్న ప్రజల సొంత డబ్బును ప్రభుత్వం సున్నా చేసిపారేసింది. సగటు మనిషి భారతీయ రూపాయిపై ఇక ఎన్నటికీ విశ్వాసం ఉంచడు.

 

నవంబర్ 9, 2016... భారతీయపౌరులు ఒక్కసారిగా తమ వద్ద ఎలాంటి డబ్బూలే దని, డబ్బుకోసం బ్యాంకులకు వెళ్లలేమని గ్రహించిన రోజు. తమ ప్రభుత్వం తీసు కున్న ఒకే ఒక చర్య వంద కోట్లమందికి పైగా ప్రజలను శక్తిహీనులుగా, దుర్బలులుగా దిగ జార్చిన రోజు. యావత్ప్రపంచంలో శాంతి కాలంలో కనీవినీ ఎరిగి ఉండని ఘటన ఇది. ఏ నియంతా ప్రజలను ఈ విధంగా సవాలు చేసిన చరిత్ర ఇంతవరకూ లేదు. 130 కోట్లమంది ప్రజలు నివసిస్తున్న దేశంలో 86 శాతం కరెన్సీ నోట్లను ఉన్నపళాన ఉపసంహరించినటు వంటి నాటకీయ మార్పును భారత్ మునుపెన్నడూ చూడలేదు.



ఫ్రాన్స్ చరిత్రలోనే అతి శక్తిమంతుడైన చక్రవర్తిగా పేరొందిన నెపోలియన్ 1812లో ఉన్నట్లుండి జూన్‌లో రష్యాపై యుద్ధం ప్రారంభించి చిత్తుగా ఓడిపోయాడు. 200 ఏళ్ల తర్వాత కూడా ఫ్రాన్స్‌తో ఎలాంటి భౌగోళిక సరిహద్దులూ లేని రష్యాతో అనాలోచిత యుద్ధం ద్వారా నెపోలియన్ అంతటి తెలివైన వ్యక్తి తన్ను తాను ఎందుకు ధ్వంసం చేసుకున్నాడని ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. అలాగే బ్రిటన్‌ను, యూరప్‌ను దాదాపుగా ఓడిస్తున్నట్లు కనిపించిన హిట్లర్ అప్పటికే తాను శాంతి ఒప్పందం కుదుర్చుకున్న రష్యాపై దాడి చేయాలని ఆకస్మిక నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా రెండో ప్రపంచ యుద్ధం లో ఓడిపోయాడు. రష్యాపై దాడి చేసి హిట్లర్ ఎందుకు సర్వస్వం కోల్పోయాడన్నది ఇంతవరకు ఎవరికీ అంతు బట్టడం లేదు.



తెలివైన, శక్తిమంతులైన మనుషులు తమకు తాముగా తప్ప తమ శత్రువులద్వారా ఎన్నడూ ఓటమికి గురికారనిపై రెండు ఘట నల బట్టి ఎవరైనా అంచనా వేయవచ్చు. మోదీ తన్ను తాను ధ్వంసం చేసుకుంటున్నారా అని ఇప్పుడిప్పుడే నిర్ణయించడం కష్టం. కానీ ఈ పెద్దనోట్ల రద్దు మోదీకే తీవ్ర ఇక్కట్లను సృష్టించిపెట్టింది. ఇప్పుడు పులిమీద స్వారీ చేయాలి లేదా అది కబళించాలి. మరో మార్గం లేదు.



పెద్దనోట్ల రద్దు వెనుక నిజాలు:

 1. గత 200 ఏళ్లలో ఏ ప్రముఖ దేశమూ ప్రస్తుతం భారత్‌లో లాగా నోట్ల మార్పిడిని లేదా పెద్ద నోట్ల రద్దును చేసి ఉండలేదు.  యుద్ధకాలంలో నోట్ల మార్పిడి కొంత మేర జరిగి ఉండవచ్చు కాని శాంతి కాలంలో ఎన్నడూ జరగలేదు. అంటే ఇతర దేశాలకు, వారి ఘనమైన ఆర్థిక వేత్తలకు బుర్ర లేనట్లా?

 2. ఇలాంటి నోట్ల మార్పిడిని చరిత్రలో ఏఆర్థికవేత్తా సూచించ లేదు. మీ బట్టలను మార్పు చేస్తే మీ వ్యాధి తొలగిపోతుందని చెప్పడం లాంటిదే ఇది. మీ శరీరంలో ఏదో తప్పు ఉండబట్టే మీరు రోగగ్రస్తులవుతుంటారు తప్పితే బట్టలు మార్చినందుకు కాదు.

 3. పెద్ద నోట్ల రద్దు ద్వారా సంపన్న భారతీయులే నష్టపోయి, పేదలు లాభపడతారని మోదీ వ్యాఖ్య. కాని భారతీయ జనాభాలో 40 శాతం మంది మధ్యతరగతి ప్రజలేనని మోదీ మర్చిపోయి నట్లుంది. మధ్యతరగతి ప్రజలు చాలావరకు నగదు రూపంలోనే డబ్బును భద్రపర్చుకుంటారు. ఇప్పుడు వీరి బాధ తక్కువగా లేదు.ఏ

 4. సంపన్నులు ఇకపై నిద్రపోరని మోదీ అంటున్నారు. కానీ ఐఏ ఎస్ అధికారి, రాజకీయనేత, నటుడు లేక అవినీతిపరులు బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడిన పాపాన పోలేదు. దీనిపై మోదీ చేస్తున్న రాజ కీయ ప్రకటనలు తనకు, బీజేపీకి తీవ్ర నష్టం కలిగించనున్నాయి. ప్రజల బాధల పట్ల నమ్రతను ప్రదర్శించడానికి బదులు, అహంకా రపు ప్రకటనలు చేయడం నష్టమని బీజేపీ వ్యాఖ్యాతలు గుర్తించాలి.

 పెద్ద నోట్ల రద్దు పరిణామాలు :

 1. రూపాయిపై సగటు మనిషి ఇక ఎన్నటికీ విశ్వాసం ఉంచడు. వందల ఏళ్లుగా ఉనికిలో ఉన్న రూపాయిని మోదీ చిత్తుకాగితంలా మార్చేశారు. మోదీ కానీ మరెవరైనా సరే తమ డబ్బును విలువలేనిగా మార్చివేస్తారని జనంకు తెలిసివచ్చింది. ప్రభుత్వం తన ఇష్టాను సారం వ్యవహరించగలదని అర్థమైంది. ప్రపంచ వ్యాప్తంగా భార తీయ రూపాయి పరువు దిగజారిపోయింది.

 2. నవంబర్ 9, 2016 నుంచి దేశంలోని అన్ని వర్గాల ప్రజల బాధలు వర్ణనాతీతం. కన్నీళ్లు, ప్రాథేయపడటం, అభ్యర్థించడం ఏవీ సహాయం చేయటం లేదు. డబ్బు పొందడానికి కోట్లాది భారతీయుల రోజూ క్యూలలో నిలుచుంటున్నారు. బ్యాంకులలో ఉన్న వారి సొంత డబ్బును ప్రభుత్వం సున్నా చేసి పారేసింది.

 3. ఇక గ్రామీణ ప్రజల బాధలు అనంతం. నగర ప్రజలు బ్యాంకులలో డబ్బులుంచుకుంటారు. గ్రామాల్లో నగదు రూపంలోనే డబ్బులు దాచుకుంటారు. భారతీయులు తమ డబ్బులను కూడా బ్యాంకులలోంచి తీసుకోలేరంటే ప్రజాస్వామ్యం లేనట్లే లెక్క. చరి త్రలో ఏ రాజూ, ఏ నియంతా ఇలాంటి చర్యకు పాల్పడలేదు.

 4. డబ్బు, పని లేకుండా కోట్లమంది బాధపడుతున్నారు. డబ్బు లేదు కాబట్టి ఉద్యోగం, ఉపాధి లేదు. కోట్లాదిమంది పనికి దూర మయ్యారు. కూలీలు వృథాగా కూర్చున్నారు. కష్టించే ప్రతి వ్యక్తి ఇప్పుడు పనిలేని భిక్షగాడైపోయాడు. నడినెత్తిమీద అణుబాంబు పేలి జీవితం అంతమైనట్లుగా ఉంది.

 


మోదీ హయాం సగం పూర్తయింది. ఏదో ఒక పెద్ద చర్య చేప ట్టాలన్నది తన వాంఛ. తాను వాగ్దానం చేసినట్లుగా విదేశాల నుంచి నల్లధనం తీసుకురాలేకపోయాడని విమర్శలు ఉన్నాయి. కానీ తాను సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలడని నిరూపించుకోవాలని మోదీ భావించినట్లుంది.

 


అంతకుమించి కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారుతోపాటు మోదీ చుట్టూ పదవీవిరమణ చేసిన అధికారులే ఎక్కువగా ఉన్నారు. అత్యంత బలహీనుడైన ఉర్జిత్ పటే ల్‌ను మోదీ కోరి ఆర్బీఐ గవర్నరుగా ఎంచుకున్నారు. ఇక ఆర్థిక శాఖ లోని ఐఏఎస్‌లు ఏ ప్రధానమంత్రికైనా సరే జీహుజూర్ అనేవాళ్లే. మోదీ మంత్రివర్గంలోనే ఏ మంత్రి కానీ, ఎంపీ కానీ మోదీ చేస్తున్నది తప్పు అని చెప్పే స్థితిలో లేరు. నేత చుట్టూ చెంచాలు, భజనపరులు ఉన్నప్పుడు రాజనీతి, రాజకీయం ఆత్మహత్య చేసుకోక తప్పదు.


ప్రమాదకరమైన విషయం ఏమిటంటే నోట్ల మార్పిడి విజయం సాధిస్తే, మోదీ మరింత నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తారు. నోట్ల మార్పిడి విఫలమైతే భవిష్యత్తులో ఆయనకి కష్టాలు తప్పవు. కానీ తను దేశానికి ఇప్పటికే ఏదో రకంగా హాని కలిగించేశారు.





పెంటపాటి పుల్లారావు

 వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు

 ఈ-మెయిల్ : drppullarao@yahoo.co.in

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top