తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరు... | Process of Telangana bill approved | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరు...

Feb 18 2014 7:32 PM | Updated on Aug 18 2018 4:13 PM

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరు... - Sakshi

తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరు...

లోక్సభ ప్రసారాలను నిలిపివేసి, సభ్యుల ఆందోళన, నిరసన, గందరగోళం మధ్య అత్యంత ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను లోక్సభ ఆమోదించినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు.

న్యూఢిల్లీ: లోక్సభ ప్రసారాలను నిలిపివేసి, సభ్యుల ఆందోళన, నిరసన, గందరగోళం మధ్య అత్యంత ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను లోక్సభ ఆమోదించినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించారు. పార్లమెంటు మెయిన్ గేటు మూత - పెద్ద సంఖ్యలో మార్షల్స్ సభలోకి ప్రవేశం-లోక్సభ గ్యాలరీలు, ద్వారాలు మూసివేసి.... అత్యంత దారుణంగా, అప్రజాస్వామికంగా బిల్లు ఆమోదం తతంగాన్ని ఈరోజు ముగించాం అనిపించారు. కీలకమైన బిల్లు ఆమోదించే విషయంలో అధికార కాంగ్రెస్కు, ప్రధాన ప్రతిపక్షం బిజెపి సహకరించిన తీరు బాధాకరం. రెండు పక్షాలు కుమ్మక్కై తెలుగు ప్రజలకు ద్రోహం చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి మండిపడ్డారు.  ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ విధంగా జరగడం విచారకరం. విభజనను ఆమోదించిన వారు కూడా లోక్సభలో జరిగిన తీరు పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగువారిని విడగొట్టే విషయంలో రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ ఒక్కటయ్యారని విమర్శిస్తున్నారు.

ఈ రోజు ఉదయం నుంచి లోక్సభ జరిగిన తీరు...

*పార్లమెంటు పరిసరాల్లో అసాధారణ భద్రత కల్పించారు.
*మొయిన్‌ గేటును మూసివేశారు.  పార్లమెంటుకు సభ్యులు కాలినడకనే వెళ్లారు.
*సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర సభ్యుల ఆందోళనతో సభను వాయిదా వేశారు.
*మధ్యాహ్నం 12.45 గంటల తరువాత సభ ప్రారంభమైంది.
*సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు వెల్లోకి దూసుకు వెళ్లారు.
*బిల్లును వ్యతిరేకంగా సీసీఎం సభ్యులు తొలిసారిగా లోక్సభ వెల్కి వచ్చి నిరసన తెలిపారు.
*శివసేన, అన్నాడిఎంకె, ఇతర పార్టీల  ఎంపీలు కూడా వెల్లోకి దూసుకెళ్లారు.
* పెద్దసంఖ్యలో సభలోకి మార్షల్స్ ప్రవేశించారు.
*సస్పెండైన ఎంపిలు సభలోకి రావడానికి ప్రయత్నించారు.
*లోక్సభ అట్టుడికి పోయింది.  మధ్యాహ్నం 3 గంటల వరకూ సభను వాయిదా వేశారు.
*ఆ తరువాత సభ ప్రారంభం కాగానే లోక్‌సభ గ్యాలరీలు, ద్వారాలు మూసివేశారు.  
* లోక్సభ ఛానల్ ప్రసారాలను నిలిపివేశారు.
*బిల్లు ప్రవేశపెట్టేందుకు హొం మంత్రి షిండేకు స్పీకర్ మీరాకుమార్ అనుమతి ఇచ్చారు.
*సభ్యుల నిరసన, గందరగోళం మధ్యలోనే  షిండే బిల్లును ప్రవేశపెట్టారు. ప్రసంగించారు.
*ప్రతిపక్షనేతగా సుష్మాస్వరాజ్  బిల్లుపై మాట్లాడారు.  ఆ తరువాత జైపాల్ రెడ్డి మాట్లాడారు.
*రాష్ట్ర విభజనకు సంబంధించిన అత్యంత కీలకమైన బిల్లుపై సభలో 23 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది.
*అనంతరం గందరగోళం, సభ్యుల నిరసనల మధ్య  బిల్లుకు ఆమోదం పొందింది.
* మూజువాణి ఓటు ద్వారా  తంతును ముగించారు.  
*విపక్షాల నిరసనలను పట్టించుకోకుండానే బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.
*లోక్సభలో జరుతున్న తీరుకు నిరసనగా తృణమూల్, జేడీయూ సభ్యులు వాకౌట్ చేశారు.
*బిల్లుపై విపక్షాల సవరణలు అన్నీ వీగిపోయాయి.
* రెండు రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్ల ప్రతిపాదను అంగీకరించలేదు.
*సభలో ఒక పక్క చర్చ జరుగుతుంటే  సోనియా గాంధీ వెళ్లిపోయారు.

బిల్లు ఆమోదించిన తీరుపై ప్రముఖుల స్పందన

* వైఎస్ఆర్ సిపి నేత  జగన్మోహన రెడ్డి : పాకిస్తాన్లో కూడా ఈ రకంగా జరగదు. నియంత అంటే హిట్లర్ కాదు ఇక సోనియా గాంధీ గుర్తుకు వస్తారు. ఈరోజు బ్లాక్డే.
* వైఎస్ఆర్ సీపీ: రేపు బంద్కు పిలుపు.
* బిజెపి సీనియర్ నేత : పార్లమెంట్ చరిత్రలో ఈ రోజు చీకటి అధ్యాయం.
* తృణమూల్ ఎంపి దినేష్ త్రివేది:  ప్రజాస్వామ్యం ఓడిపోయింది, బిల్లు పాసైంది.
* జేడీయూ నేత శరద్ యాదవ్ : ఇది చాలా విచిత్రమైన రాష్ట్ర విభజన.
* ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ : విభజనపై న్యాయపోరాటం చేస్తాం.
* తృణమూల్ అధినేత మమతా బెనర్జీ:  ఈ విధానం ఎమర్జెన్సీని తలపిస్తోంది. దేశ చరిత్రలోనే అప్రజాస్వామిక ఘటన.
* సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్: లోక్‌సభలో జరిగింది దురదృష్టకర ఘటన.
* కాంగ్రెస్ ఎంపి కావూరి సాంబశివరావు: సుప్రీంకోర్టు కొట్టివేస్తుంది.
* సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపిలు: రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ బాయ్ బాయ్
* బిల్లు ఆమోదం పొందిన తీరుకు నిరసనగా కేంద్ర మంత్రి పురందేశ్వరి మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.


*కేంద్ర హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే: మాటకు కట్టుబడి తెలంగాణ ఇచ్చాం.
* మంత్రి జానారెడ్డి : సోనియా గాంధీ చిత్తశుద్ధికి తెలంగాణ బిల్లు ఆమోదం నిదర్శనం.
* కేంద్రమంత్రి నారాయణస్వామి: ప్రతి సవరణపైనా ఓటింగ్ జరిగింది. విపక్షాలు చేసిన సవరణలు వీగిపోయాయి.
* చిరంజీవి : విభజన విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూడొద్దు.
* తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్:  ఈ విజయం తెలంగాణ అమరులకు అంకితం.
* టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు: విభజనకు టిడిపి ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. రాష్ట్ర విభజన తప్పు కాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement