రెండు వేల ఏళ్లుగా నిలిచిన నాటకం యాంటిగని...

రెండు వేల ఏళ్లుగా నిలిచిన నాటకం యాంటిగని...


గ్రీకు నాటకకర్తల్లో సోఫొక్లిస్ (క్రీ.పూ.5వ శతాబ్దం) తన జీవితకాలంలోనూ ఆ తర్వాతా ఐరోపీయ సాహిత్యాన్నీ, చింతననూ ప్రభావితం చేసినట్టుగా మరే గ్రీకు రచయితా ప్రభావితం చేయలేదు. అతడు రాసిన నాటకాల్లో కేవలం ఏడే  లభ్యమవుతున్నా వాటన్నింటిలో విశిష్టమైనది యాంటిగని. దీనిని ప్రసిద్ధ విద్యావేత్త ఎం.ఆర్.అప్పారావు తెలుగు అనువాదం చేస్తే 30 ఏళ్ల క్రితమే సాహిత్య అకాడెమీ ప్రచురించింది.



 యాంటిగని కథ చాలా సరళం. ఒక మహారాజు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు. కొడుకుల పేర్లు ఎటియోకిల్స్, పోలినేసిస్. కూతుళ్ల పేర్లు యాంటిగని, ఇస్మెనె. మహారాజు చనిపోయాక థీబ్స్ నగర రాజ్యాన్ని  కొడుకులిద్దరూ వంతుల వారీగా పరిపాలన సాగించడానికి ఒప్పందం చేసుకొని ఉంటారు. కథ ప్రారంభం నాటికి ఎటియోకిల్స్ పరిపాలన చేస్తూ ఉంటాడు. అతని వంతు ముగిసింది. ఇప్పుడు పోలినేసిస్ వంతు. కాని పరిపాలనను పోలినేసిస్‌కు ఇవ్వడానికి ఎటియోకిల్స్ నిరాకరిస్తాడు. దాంతో పోలినేసిస్ తన సోదరుడి మీద (అంటే థీబ్స్ నగరరాజ్యం మీద) యుద్ధం ప్రకటిస్తాడు.

 

 అయితే అప్పటికే వీరి సోదరి యాంటిగనితో తన కుమారుడి నిశ్చితార్థం చేసుకొని ఉన్న క్రెయోన్ అనే రాజప్రతినిధి ఈ యుద్ధంలో ఎటియోకిల్స్ తరఫున నిలబడతాడు. దురదృష్టవశాత్తూ యుద్ధంలో అన్నదమ్ములిద్దరూ ఒకరి చేతిలో ఒకరు హతమవుతారు. క్రెయోన్ రాజవుతాడు. తమ నగరరాజ్యం పట్ల విధేయతతో ఉండి దాని రక్షణ కోసం యుద్ధం చేసిన ఎటియోకిల్స్‌కి రాజలాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని, నగర రాజ్యం మీద యుద్ధం ప్రకటించిన పోలినేసిస్‌కి ఎటువంటి అంత్యక్రియలూ నిర్వహించకూడదనీ, ఆ శవాన్ని కాకులూ గద్దలూ పీక్కు తినాలనీ క్రెయోన్ ఆదేశాలు జారీ చేస్తాడు. తన శవానికి అంత్యక్రియలు జరగకపోవడం కన్నా ఒక ప్రాచీన గ్రీకు పౌరుడికి పెద్ద అవమానం మరొకటి లేదు. అందుకని అతడి సోదరి యాంటిగని ఆ శవానికి కనీస లాంఛనప్రాయంగానైనా అంత్యక్రియలు నిర్వహించాలని ప్రయత్నిస్తుంది. అలా చెయ్యడం ద్వారా ఆమె రాజధర్మానికీ, భ్రాతృధర్మానికీ మధ్య ఒక సంఘర్షణకి తెర తీస్తుంది.

 

 ఇది సహజంగానే క్రెయోన్‌కి ఆగ్రహం తెప్పిస్తుంది. అతడు యాంటిగనిని ప్రశ్నించినప్పుడు ఆమె తనకి సోదరుడి పట్ల ధర్మం నిర్వహించడమే ముఖ్యమని అందుకు తాను చావుకు కూడా వెనకాడననీ చెప్తుంది. తన సోదరుడి శవానికి లాంఛనప్రాయంగానే కాక సమగ్రంగా అంత్యకర్మలు నిర్వహించడానికి పూనుకుంటుంది. దాంతో ఆగ్రహించిన క్రెయోన్ యాంటిగనికి సజీవమరణశిక్ష విధిస్తాడు.

 

 కాని కథ అక్కడితో ఆగదు.  గ్రీకు నాటకాల్లో తరచు కనిపించే టైరీషియస్ అనే అంధసాధువు క్రెయోన్ దగ్గరకు వచ్చి పోలినేసిస్ శవానికి రాజలాంఛనాలతో అంత్యకర్మలు నిర్వహించమని, యాంటిగనిని విడుదల చెయ్యమని సలహా ఇస్తాడు. క్రెయోన్ వినడు. దాంతో టైరీషియస్ ఆగ్రహించి క్రెయోన్ ఇంట్లోనే దారుణమైన పరిణామాలు సంభవించనున్నాయని హెచ్చరించి వెళ్లిపోతాడు. యాంటిగనికి మరణశిక్ష పడిందని తెలిసి ఆమెకు కాబోయే వరుడు హీమోన్ (క్రెయోన్ కొడుకు) ఆత్మహత్య చేసుకుంటాడు. కొడుకు మరణించాడని తెలిసి అతడి తల్లి, క్రెయోన్ భార్య కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. కొడుకునీ భార్యనీ పోగొట్టుకున్న క్రెయోన్ కూడా భగ్నహృదయంతో మృత్యువుకి ఎదురేగుతాడు.

 

 స్థూలంగా ఇదీ కథ. దీనిని సోఫోక్లీస్ ట్రాజెడీ అన్నాడు. అయితే ఈ కథ విషాదాంత నాటకమెట్లా అయింది? నాటకం ముగిసేటప్పటికి నాలుగు మరణాలు సంభవించినందువల్లనా? నాటకానికి యాంటిగని అని పేరు పెట్టినందువల్ల రెండువేల యేళ్ల పాటు ఈ నాటకాన్ని యాంటిగనికి సంభవించిన ట్రాజెడీగానే భావించారు. కాని యాంటిగని చేసింది వీరోచితకృత్యం కదా. ఆమె కథ వీరరసోత్పాదకం తప్ప కరుణ రసోత్పాదకం ఎలా అవుతుంది? అంటే మనం నాటకాన్ని సరిగ్గా చదవలేదన్న మాట.

 గ్రీకు నాటకాల్లో నాయకుడు విషాదాంతం వైపు నడవడానికి అతడి వ్యక్తిత్వంలో ఉండే పగులు కారణమవుతుంది. ఆ పగులుకి ముఖ్యకారణం ఆ నాయకుడు ఒక గర్వాంధతకు లోను కావడం. గ్రీకులు దాన్ని జిఠఛటజీట అన్నారు. అంటే ఏ కారణం వల్లగానీ మనిషి తాత్కాలికంగా ఒక గర్వాంధతకి లోనవుతాడు. ఆ గర్వాంధత అతణ్ణి అభిశప్తుణ్ణి చేస్తుంది.  అటువంటి గర్వాంధత ఫలితం పతనం, గ్లాని, విషాదం. దాన్ని గ్రీకులుnemesisఅన్నారు.

 

 యాంటిగని నాటకంలో యాంటిగని ఒక జిఠఛటజీటకి లోనయింది. ఆమె తన సోదరుడి పట్ల భ్రాతృధర్మాన్ని నెరవేర్చి ఊరుకోకుండా ఆ విధంగా నెరవేర్చడంలో ఒక అద్వితీయ సంతోషాన్ని, కించిదున్మత్తతనీ అనుభవించింది. ఒక మనిషి తన కర్తవ్యం నెరవేర్చడంలో గర్వించవలసిందేమీ లేదు. కర్తవ్య నిర్వహణ దానికదే ఒక కనీస బాధ్యత. దాన్నుంచి ప్రత్యేకంగా సంతోషం పొందుతున్నావంటే దానర్థం భారతీయ పరిభాషలో చెప్పాలంటే ఆ కర్మ నిష్కామ కర్మ కాలేదని అర్థం. ఆసక్తితో చేసే కర్మ మనిషిని బంధించి తీరుతుంది. యాంటిగని విషయంలో జరిగిందదే. మరొక రకంగా ఇది క్రెయోన్ ట్రాజెడీ కూడా. ఎందుకంటే క్రెయోన్ కూడా తన రాజధర్మాన్ని నిర్వహించడంలో ఒక అద్వితీయ సంతోషాన్ని పొందడమే కాక ఆ క్రమంలో ఒక నిష్టూర వ్యక్తిత్వాన్ని ప్రదర్శించాడు. ఒక రాజు తన రాజధర్మాన్ని నిర్వహిస్తున్నందుకు నిష్టూరంగానూ కర్కశంగానూ మారవలసిన అవసరం లేదు. ఆ నిష్టూరత్వమే అతడి ఇంట్లో పెను విషాదాన్ని సృష్టించింది.

 

 మొదట చదివినప్పుడు రాజధర్మానికీ భ్రాతృధర్మానికీ సంఘర్షణగా కనిపించిన ఈ కథ నిజానికి మనుషులు తమ ధర్మాన్ని తాము నిర్లిప్తతతో నిర్వహించకుండా ఆసక్తితో నిర్వహిస్తే దాని ఫలితాలు విషాదంగా పరిణమిస్తాయని చెప్పడంగా ఇప్పుడు అర్థమవుతున్నది నాకు.

 - వాడ్రేవు చినవీరభద్రుడు

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top