దేశభక్తికి అసలు చిరునామా

దేశభక్తికి అసలు చిరునామా


కొత్త కోణం

 

నిష్కళంక దేశభక్తునిగా, సాహసమే ఊపిరిగా బతికిన విప్లవకారునిగా మన మెరిగిన భగత్‌సింగ్... భారత సమాజంలోని వైరుధ్యాలకు ఆయువుపట్టయిన కులం, దాని వికృత రూపమైన అంటరానితనాలను లోతుగా అధ్యయనం చేసి, పరిష్కారాన్ని చూపిన దార్మనికుడు కూడా. కొందరి  జీవితాలు, ఆలోచనలు, సమాజ గతిని నిర్దేశిస్తాయి.  అన్ని అడ్డంకులను అధిగమిస్తూ నిరంతరం పురోగమించే శక్తిని సమాజానికిస్తాయి. అందుకే భగత్‌సింగ్ వంటి వారు అజరామరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.

 

‘‘అంటరాని కులాల ప్రజలను జంధ్యం ధరించడానికి అనుమతిస్తు న్నామా? వేదాలను, శాస్త్రాలను అధ్యయనం చేయడానికి అంగీకరిస్తు న్నామా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. మరి అటువంటప్పుడు ఇతర దేశాల వాళ్ళు మనల్ని బానిసలుగా చూస్తున్నారని, అవమానిస్తున్నారని విమ ర్శించే హక్కు మనకు ఎక్కడున్నది?’’ బాబాసాహెబ్ అంబేద్కరో లేక మహాత్మ జ్యోతిరావు ఫూలేనో అన్న మాటలు కావివి. బ్రిటిష్ వాడి గుండెల్లో బాంబులు పేల్చి, దేశ దాస్య శృంఖలాలను ఛేదించేందుకు ప్రాణాలను తృణ ప్రాయంగా త్యజించిన విప్లవ వీరుడు షహీద్ భగత్‌సింగ్ రాసిన మాటలివి. మన మెరిగిన భగత్‌సింగ్‌లోని అంతగా వెలుగుచూడని తాత్విక కోణమిది. 1928, జూన్‌లో ‘కీర్తి’ అనే పంజాబీ పత్రికలో ‘అంటరానితనం’పై ఆయన రాసిన వ్యాసంలోని వాక్యాలివి.  అంటరానితనం దుష్టస్వరూపాన్ని, దానిని అమలు చేస్తున్న హిందూమత వ్యవస్థ డొల్లతనాన్ని అందులో ఆయన తూర్పారబట్టారు.



ఈ వ్యాసం రాసేనాటికి కులం, అంటరానితనం సమ స్యలపై మాట్లాడుతున్న వాళ్ళు చాలా తక్కువ. అంబేద్కర్ నాయకత్వంలోని ఉద్యమం మినహా, దళితేతరులు, రాజకీయ సంస్థలు, పార్టీలు ఏవీ  నాటికి అంటరానితనం గురించి మాట్లాడటం లేదు. మహాత్మా గాంధీ ‘హరిజన సేవక్ సంఘ్’ను స్థాపించింది 1932లో.  అంబేద్కర్, అంటరాని కులాల ఏకైక నాయకునిగా ఉండడం ఇష్టంలేకనే గాంధీజీ పూనా ఒప్పందం తర్వాత హరిజన సేవక్ సంఘ్‌ను మొదలు పెట్టారని భావిస్తున్నారు. భారత కమ్యూ నిస్టు పార్టీ కూడా 1931లోనే కుల సమస్యపై తీర్మానం చేసింది.



ఊపిరిలోనే దేశభక్తిని నింపుకుని....  

ఆ వ్యాసం రాసే నాటికి భగత్‌సింగ్ వయస్సు 22 ఏళ్లే. అప్పటికే సమాజాన్ని, ప్రపంచ పరిణామాలను అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. భగత్‌సింగ్ కుటుంబం జాట్ అగ్రకులానికి చెందినదే అయినా, కొన్ని తరాలుగా అది సామాజిక, రాజకీయ జీవితంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. భగత్‌సింగ్ తాత అర్జున్‌సింగ్ హిందూ మత సంస్కర్తల్లో ఒకరైన ఆర్య సమాజ్ స్థాపకుడు దయానంద్ సరస్వతి అనుచరునిగా ఉండేవారు. ఆయన తండ్రి కిషన్‌సింగ్, మామలైన అజిత్‌సింగ్, స్వరణ్‌సింగ్‌లు గదర్ పార్టీలో సభ్యులుగా పని చేశారు. భగత్‌సింగ్ 1907 సెప్టెంబర్, 28న అవిభక్త పంజాబ్‌లోని ల్యాల్ పూర్(నేటి ఫైసలాబాద్) జిల్లాలోని బంగా గ్రామంలో జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్‌లో ఉన్నది. 1911లో పాఠశాలలో చేరిన భగత్‌సింగ్, తాత పెంపకంలో దేశభక్తిని పుణికిపుచ్చుకున్నాడు.



పసి వయస్సులోనే భగత్ సింగ్ మదిలో దేశభక్తి భావాన్ని నాటిన అర్జున్‌సింగ్, మనవడిని దేశానికి అంకితం చేస్తానని ప్రకటించారు. ఖల్సా హైస్కూల్లోనే పిల్లలను చదివించడం సిక్కుల ఆనవాయితీ. అయినా, అది బ్రిటిష్‌వారి కనుసన్నల్లో నడుస్తోన్నదన్న కారణంగా కిషన్‌సింగ్ తన కొడుకు భగత్‌ను లాహోర్‌లోని ఆర్య సమాజ్‌కు చెందిన దయానంద్ ఆంగ్లో-వేదిక్ స్కూల్‌లో చేర్పించాడు. మెట్రిక్యులేషన్ ముగిశాక నేషనల్ కళాశాలలో చేరాడు. విద్యార్థిగా ఉండగానే భగత్‌సింగ్‌కు దేశభక్తి రాజకీయాలతోపాటు, మార్క్సిజం, లెనినిజం సిద్ధాంతాలను, ప్రపంచ ఉద్యమాలను అధ్యయనం చేసే అవకాశం లభించింది.

 



పద్నాలుగేళ్లకే జాతీయ విప్లవకారులతో సంబంధాలేర్పడ్డ భగత్‌సింగ్‌కు, అతని తాతమ్మ కోరిక మేరకు పెళ్ళి నిశ్చయించారు. భగత్‌సింగ్ అందుకు నిరాకరించి, ‘‘నేను విప్లవోద్యమంలో పూర్తి కాలం పనిచేయాలనుకుంటున్నాను. నీవు ఒక తల్లి కోరిక మేరకు నా పెళ్ళి చేయాలనుకుంటున్నావు. కానీ కోట్లాది మంది భారతీయుల తల్లి భరతమాత  చెర విడిపించడం, ఆ తల్లి కోరిక తీర్చడం నా కర్తవ్యం’’ అంటూ తండ్రికి ఉత్తరం రాసి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. విప్లవకారులతో కలిసి ‘‘నౌజవాన్ భారత్ సభ’’ను స్థాపిం చారు. ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ తదితరుల నేతృత్వంలో నడుస్తున్న ‘‘హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్’’లో చేరారు. 1926లో దసరా రోజున లాహోర్‌లో జరిగిన బాంబు పేలుడులో నిందితునిగా భగత్‌సింగ్‌ను అరెస్టు చేశారు. ఐదు వారాల జైలు జీవితం తర్వాత బెయిలుపై విడుదలయ్యారు.



ఇంక్విలాబ్ జిందాబాద్!

1919 నాటి జలియన్‌వాలాబాగ్ మారణకాండ, 1928 నాటి లాలా లజపతి రాయ్ మరణం భగత్‌సింగ్‌ను బాగా ప్రభావితం చేసిన రెండు ఘటనలు. జలియన్‌వాలా బాగ్ నరమేధం జరిగిన మరుసటి రోజే ఆ స్థలానికి వెళ్ళి నెత్తురింకిన మట్టిని తీసుకొని భగత్‌సింగ్ పోరాట ప్రతిజ్ఞ చేశారు. సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనపై పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన లాలా లజపతిరాయ్ ఆ తరువాత మరణించారు. ఆ లాఠీచార్జీకి కారణమైన స్కాట్‌ను కాల్చి చంపాలని వెళ్ళిన భగత్‌సింగ్ బృందం కాల్పుల్లో మరొక అధికారి సాండర్స్ మరణించాడు.



జాతీయోద్యమ పోరాటాల అణచి వేతకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న పబ్లిక్ సేఫ్టీ బిల్లు, కార్మిక వివాదాల బిల్లులను నిరసిస్తూ 1929 ఏప్రిల్ 8న భగత్‌సింగ్, భటుకేశ్వర్ దత్‌లు సెంట్రల్ అసెంబ్లీలో రెండు బాంబులను ఎవరూ లేని నిరపాయకరమైన చోటు చూసి విసిరారు. కేవలం హెచ్చరికగానే తాము బాంబులను వేశామని ఆ తర్వాత వారు ప్రకటించారు. బాంబులు వేసి వారు పారిపోక, స్వచ్ఛం దంగా అరెస్టయ్యారు. కేసు విచారణనే వేదిగా చేసుకుని తమ హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఆర్‌ఏ) లక్ష్యాలను దేశానికి చాటాలని వారు ముందే నిర్ణయించుకున్నారు, కేసు విచారణ తదుపరి 1929 జూన్, 12న భగత్‌సింగ్. భటుకేశ్వర్ దత్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ, అండమాన్ జైలుకు పంపాలని కోర్టు తీర్పు చెప్పింది.



అయితే సాండర్స్ హత్య కేసులో భగత్‌సింగ్ నిందితుడంటూ పోలీసులు ఆ కేసును తిరగ దోడారు. ఈ కేసులో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌లకు 1930లో ఉరిశిక్ష  విధించారు. కిశోరిలాల్, మహావీర్‌సింగ్, విజయ్‌కుమార్‌సిన్హా, శివవర్మ, తది తరులకు జీవిత ఖైదు విధించి అండమాన్ జైల్లో బంధించారు. వారి ఉరి శిక్షలకు వ్యతిరేకంగా దేశమంతా నిరసన వెల్లువెత్తింది. అయినా బ్రిటిష్ ప్రభుత్వం విప్లవ వీరుల్ని 1931, మార్చి 23న  ఉరితీసింది. యువ విప్లవ కిశోరం ఇంక్విలాబ్ జిందాబాద్! నినాదంగా భారత ప్రజల గుండెల్లో నిత్యమూ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాడు.



కులంపై సంధించిన శస్త్రం

ముందే చెప్పుకున్నట్టు భారత సమాజంలోని వైరుధ్యాలకు ఆయువుపట్టుగా ఉన్న కులాన్ని, దాని వికృత రూపమైన అంటరానితనాన్ని అర్థం చేసుకొని భగత్‌సింగ్ చేసిన విశ్లేషణ నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. ‘‘కొన్ని విష యాలను తలచుకుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి ఉంటుంది. ఒక కుక్కను మన తొడల మీద కూచోపెట్టుకొని గారాబం చేస్తాం. వంటగది సహా, ఇల్లంతా స్వేచ్ఛగా తిరగనిస్తాం. కానీ సాటి మనిషిగా పుట్టిన వాడిని అంటరా నివాడని పేరుపెట్టి, అంటుకుంటే చాలు మన ధర్మం నాశనమవుతుందని బాధపడిపోతాం’’ అంటూ భగత్‌సింగ్ అంటరానితనాన్ని యువ భగత్ నిర సించాడు. అంతేకాదు, మురికిగా, అపరిశుభ్రంగా ఉంటారని, అపరిశుభ్ర మైన పనులు చేస్తారని కొందరిని వెలివేస్తున్నాం. మన మురికిని కడిగిన తల్లిని ఎందుకు వెలివేయడం లేదని నిలదీశారు. దేశ రక్షణకు, సమాజ పురో గతికి అంటరాని కులాలు చేసిన సేవను ప్రస్తావిస్తూ... గురుగోవింద్‌సింగ్ సైన్యంలోనూ, ఛత్రపతి శివాజీకి అండగానూ అంటరాని కులాలు పనిచేశా యని, వాళ్ళు లేకపోతే హిందూ ధర్మం ఎప్పుడో దెబ్బతినేదని ఆయన స్పష్టం చేశారు.



1928 సమయంలో అంబేద్కర్ నాయకత్వంలో అంటరాని కులాలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఉద్యమా నికి భగత్‌సింగ్ సంఘీభావాన్ని ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్‌ను అంగీకరించడం ద్వారానే వారి జీవితాలలో మార్పు వస్తుందంటూ ‘‘ఈ సమస్యకు పరిష్కారం ఏమిటనే ప్రశ్న అందరిలో ఉదయిస్తుంది. ప్రతి మనిషి పుట్టుక, వృత్తి ద్వారా గుర్తింపును పొందకుండా, ప్రతి మనిషిని సమానంగా చూసినపుడే అంటరానితనం కుల వివక్ష, మాయమైపోతాయి’’ అంటూ కులసమస్యకు పరిష్కారం చూపాడు.



అంటరాని కులాల ప్రజలను ఉద్దేశిస్తూ, ‘‘మీరు నిజమైన కార్మికవర్గం. మీ సమయాన్ని వృథా చేసుకోకండి. మీ కాళ్ళ మీద నిలబడి ఈ అసమానతల్ని ప్రతిఘటించండి. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూ డదు. మీకు మీరే రక్షకులుగా నిలవండి. సామాజిక ఉద్యమం ద్వారా విప్లవా నికి నాంది పలకండి. మీరు, మీరు మాత్రమే ఈ దేశపు మూలస్తంభాలు, మూలాధారాలు. నిద్రపోతున్న సింహాల్లారా, లేవండి విప్లవ పతాకాన్ని ఎగురవేయండి!’’ అంటూ ఆయన గర్జించడాన్ని చదువుతుంటే భగత్‌సింగ్ కళ్ళ ముందే నిలిచినట్టనిపిస్తుంది. ఆయన రచనల పేరుతో వచ్చిన చాలా పుస్తకాల్లో ఈ వ్యాసానికి చోటు దక్కకపోవడానికి కారణాలు ఎలాంటివో అర్థం చేసుకోగలం. కులం పట్ల భగత్ సింగ్ విస్పష్ట వైఖరిని మరుగుపరిచే ప్రయత్నం జరిగిందనే భావించాలి.



భగత్‌సింగ్ ఇరవై నాలుగేళ్ల ప్రాయంలోనే అమరుడైనా, ఆయన ఆలోచనలు, ఆచరణ, జీవితం నాటి నుంచి నేటి వరకు యువతరాన్ని విప్లవోన్ముఖులను చేస్తూనే ఉన్నాయి. అంటరానితనంపై ఆయన ప్రకటించిన అభిప్రాయాలు నాటి పంజాబ్‌లోని అంటరాని సామా జిక వర్గాల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. అక్కడి అంటరాని కులాలు సాధిం చిన సామాజికార్థికాభివృద్ధే అందుకు నిదర్శనం. కొందరి  జీవితాలు, ఆలోచ నలు, సమాజ గతిని నిర్దేశిస్తాయి. అన్ని అడ్డంకులను అధిగమిస్తూ నిరంతరం పురోగమించే శక్తిని సమాజానికిస్తాయి. అందుకే భగత్‌సింగ్ వంటి వారు అజరామరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు.

 

- మల్లెపల్లి లక్ష్మయ్య

(మార్చి 23 భగత్‌సింగ్ 85 వ వర్ధంతి)

 వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్: 97055 66213

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top