సినీ సంగీత 'చక్ర'ధరుడు

సినీ సంగీత 'చక్ర'ధరుడు - Sakshi


తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చాక ఇక్కడ కెరీర్‌ను ప్రారంభించి, అచిరకాలంలోనే అగ్రస్థాయికి చేరిన తొలి సినీ సంగీత దర్శకుడిగాచక్రిని చెప్పుకోవచ్చు. 2000 ప్రాంతంలో తెలుగు చిత్రసీమలోకి పొంగిపొర్లి వచ్చిన కొత్తనీరులో ఆయన భాగం. జాగ్రత్తగా గమనిస్తే, దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోగా రవితేజ, సంగీత దర్శకుడు చక్రి, రచయిత భాస్కరభట్ల తదితరుల కెరీర్ దాదాపు ఏకకాలంలో కలసి ఉన్నత శిఖరాల వైపు సాగినట్లు కనిపిస్తుంది.



 * ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన జిల్లా చక్రధర్ సినీరంగంలో ‘చక్రి’గా తనకంటూ పేరు, స్థానం సంపాదించుకోవడానికి ముందు ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. వరంగల్ దగ్గరి స్వస్థలం నుంచి ఉద్యోగార్థం హైదరాబాద్ వచ్చిన ఆయన తొలిరోజుల్లో అమీర్‌పేట ప్రాంతంలో చిన్న చిన్న ఉద్యోగాలు కూడా చేశారు.



 * సంగీతం మీద ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే సాంస్కృతిక ఉత్సవాల్లో ఒక దేశభక్తి గీతానికి చక్రి బాణీ కట్టారు. ఆ తరువాత తనలాగే సంగీతం పట్ల ఆసక్తి ఉన్న మిత్రులను కలుపుకొని, ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తొలి రోజుల్లో కొన్ని క్యాసెట్లు కూడా రూపొందించి, విడుదల చేశారు. చివరకు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'బాచి' (2000) చిత్రంతో తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా చక్రి పరిచయమయ్యారు.



 * ఒక దశలో సినిమా అవకాశం కోసం అమితంగా కష్టపడ్డ ఆయన ఆ తరువాత ఏకంగా ఒకే ఏడాది 18 సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డెరైక్టర్‌గా అరుదైన ఘనత సాధించారు. 1980లలో ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రవర్తి తరువాత మళ్ళీ సంఖ్యాపరంగా ఆ ఘనత అందుకున్నది చక్రి కావడం, ఇద్దరికీ పేరులో సారూప్యత ఉండడం యాదృచ్ఛికమే అయినా, గమ్మత్తై వాస్తవం.



 * ఒక దశలో అగ్ర హీరోల భారీ బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న హీరోల లో బడ్జెట్ చిత్రాల దాకా ఎటు చూసినా చక్రి హవానే కొనసాగింది. తరువాత ఆ  జోరు కొంత తగ్గినా, చక్రికంటూ ఒక వర్గం సినిమాలు ఉండేవి. దర్శక - నిర్మాతలు ఉండేవారు.



 * ఇప్పటికి దాదాపు 80కి పైగా చిత్రాలకు చక్రి సంగీతం అందించినట్లు ఒక లెక్క. ఆ చిత్రాల్లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని 'ఇట్లు... శ్రావణి సుబ్రహ్మణ్యం', 'శివమణి', 'అమ్మ - నాన్న - ఓ తమిళ అమ్మాయి', 'ఇడియట్', 'దేశముదురు', కృష్ణవంశీ దర్శకత్వంలోని 'చక్రం', వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలోని 'దేవదాసు', శ్రీను వైట్ల 'ఢీ' లాంటి పలు విజయాలు ఉన్నాయి.



* చక్రి సినీ సంగీతంలోని ఒక విశేషం ఏమిటంటే - ఒక పక్క ఎంత మెలొడీ పాటలు ఆయన అందించారో, అంతే స్థాయిలో బీట్ పాటలు, ఆధునిక తరానికి నచ్చే ట్రెండీ బాణీలు కూడా అందించడం. 'నాకు వ్యక్తిగతంగా శ్రావ్యగీతాలంటే ఇష్టమైనా, దర్శక - నిర్మాతలు కోరిన విధంగా బీట్ పాటలు ఇస్తుంటా' అని ఆయనే చెప్పారు. సుమారు 80కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన చక్రి పాటల్లో అనేక హిట్లున్నాయి. 'నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిల...' లాంటి ఆల్‌టైమ్ హిట్లు ఆయన పాటలే. అలాగే, 'జగమంత కుటుంబం నాది...'('చక్రం' చిత్రంలోని సీతారామశాస్త్రి రచన) లాంటి తాత్త్విక గీతాలున్నాయి. మాస్, బీట్ పాటలకైతే లెక్కే లేదు.



 * సినీ సంగీత రంగంలోకి ప్రవేశించడానికి తాను పడ్డ కష్టాలను చక్రి చివరి దాకా మర్చిపోలేదు. అందుకే, అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతూ వచ్చిన ఆయన కౌసల్య లాంటి పలువురు వర్ధమాన గాయనీ గాయకులకు పదే పదే అవకాశాలిచ్చి, ప్రోత్సహించారు. స్వతహాగా తనలో ఉన్న గాయకుడి కోణాన్ని కూడా వీలైనప్పుడల్లా వెలికితీసేవారు. తారస్థాయిలో పాడాల్సిన పాటలను సైతం అలవోకగా పాడడం చక్రిలోని విశిష్టత.



 * ఇటీవల దాసరి దర్శకత్వంలో విడుదలైన 151వ చిత్రం 'ఎర్రబస్సు'కు సంగీతం అందించింది చక్రే! చక్రి సంగీతం అందించగా వై.వి.ఎస్. చౌదరి దర్శక - నిర్మాతగా, సాయిధరమ్ తేజ్ నటించిన తొలి చిత్రం 'రేయ్' లాంటివి కొన్ని ఇంకా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.



* తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన ఈ సంగీతకారుడు ఆ మధ్య 'జై బోలో తెలంగాణ' చిత్రానికి సంగీతం అందించి, పుట్టినగడ్డ ఋణం తీర్చుకొనే ప్రయత్నం చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకు ఒక ప్రత్యేక గీతాన్ని కూర్చాలని రచయిత భాస్కరభట్లతో చర్చిస్తున్నారు. ఆ కోరిక నెరవేరకుండానే హఠాత్తుగా కనుమరుగయ్యారు. ఇప్పుడు ఆయన లేరు... ఆయన పాటలే తీపిగుర్తులుగా మిగిలాయి. చక్రికి 'సాక్షి' తరఫున నివాళులర్పిస్తున్నాం. - రెంటాల

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top