రెండు ఆత్మహత్యలు.. వంద సందేహాలు | Two suicides .. One hundred doubts | Sakshi
Sakshi News home page

రెండు ఆత్మహత్యలు.. వంద సందేహాలు

Jun 15 2017 2:22 AM | Updated on Sep 2 2018 3:42 PM

రెండు ఆత్మహత్యలు.. వంద సందేహాలు - Sakshi

రెండు ఆత్మహత్యలు.. వంద సందేహాలు

సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లికి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి బుధవారం రివాల్వర్‌తో కాల్చుకున్నారు.

ఒక ఎస్సై.. ఒక బ్యూటీషియన్‌
కుకునూర్‌పల్లి ఎస్సై ఆత్మహత్య వెనుక మేకప్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య?
- మేకప్‌ ఆర్టిస్ట్‌ శిరీషకు, ఆమె పనిచేసే స్టూడియో యజమాని రాజీవ్‌కు మధ్య విభేదాలు
- ఇద్దరికీ స్నేహితుడైన శ్రవణ్‌ ద్వారా సెటిల్మెంట్‌ కోసం కుకునూర్‌పల్లికి..
తన క్వార్టర్స్‌లోనే ఆ ముగ్గురితో మాట్లాడిన ఎస్సై ప్రభాకర్‌రెడ్డి
హైదరాబాద్‌ వచ్చాక శిరీష ఆత్మహత్య.. విషయం తెలిసి తుపాకీతో కాల్చుకున్న ఎస్సై
కానీ శిరీషపై ఎస్సై దురాగతానికి పాల్పడ్డాడంటూ ప్రచారం
ఉన్నతాధికారులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు  
 
సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి పోలీసు క్వార్టర్స్‌.. బుధవారం ఉదయం ఎస్సై ప్రభాకర్‌రెడ్డి సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నారు..ఈ ఘటనకు దాదాపు రోజున్నర కింద మంగళవారం తెల్లవారుజాము సమయం.. హైదరాబాద్‌లోని ఆర్‌జే ఫొటోగ్రఫీ స్టూడియోలో పనిచేసే మేకప్‌ ఆర్టిస్ట్‌ శిరీష ఆత్మహత్య చేసుకుంది..
 
వేర్వేరు రోజులు, వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రెండు ఘటనల మధ్యా ఎన్నో లింకులు.. మరెన్నో సందేహాలు.. వ్యక్తిగత కారణాలతో శిరీష ఆత్మహత్య చేసుకుందని ఒకవైపు.. ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా ప్రభాకర్‌రెడ్డి రివాల్వర్‌తో కాల్చుకున్నారని మరోవైపు.. ఈ రెండూ కాదు శిరీషపై.. ప్రభాకర్‌ దురాగతానికి పాల్పడటంతో ఆత్మహత్య చేసుకుందని, ఆందోళన చెందిన ఎస్సై కూడా ఆత్మహత్య చేసుకున్నారనే ప్రచారం ఇంకోవైపు.. మరి ఈ రెండు ఉదంతాల మధ్య ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది.
 
సాక్షి, హైదరాబాద్‌: సిద్ధిపేట జిల్లా కుకునూర్‌పల్లికి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి బుధవారం రివాల్వర్‌తో కాల్చుకున్నారు. అంతకు ఒకటిన్నర రోజు ముందు హైదరాబాద్‌లో శిరీష అనే మేకప్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రెండు ఘటనలకు లింకు ఉందంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అసలు ఈ ఘటనల వెనుక ఏముందనేది చర్చనీయాంశంగా మారింది. సోమవారం రాత్రి శిరీష, ఆమె పనిచేస్తున్న స్టూడియో యజమాని రాజీవ్, అతడి స్నేహితుడు శ్రవణ్‌ కలసి కుకునూర్‌పల్లికి వెళ్లారు. శ్రవణ్‌ కోరిన మేరకు రాజీవ్, శిరీషల మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ప్రయత్నించారు. అది బెడిసికొట్టడంతో శిరీష ఆత్మహత్య చేసుకుంది. ఈ అంశాలన్నీ బుధవారం మీడియాలో హల్‌చల్‌ చేయడంతో ప్రభాకర్‌రెడ్డి బలవన్మరణానికి పా ల్పడినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ కేసును పోలీసు ఉన్నతాధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
కొత్త పరిచయాలతో 
హైదరాబాద్‌కు చెందిన వల్లభనేని రాజీవ్‌.. ఫిల్మ్‌నగర్‌లో షేక్‌పేట ప్రధాన రహదారిపై ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఆర్‌జే ఫొటోగ్రఫీ పేరుతో స్టూడియో నిర్వహిస్తున్నారు. శ్రీకృష్ణనగర్‌కు చెందిన అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్‌ శిరీష (28) ఈ సంస్థలో మేకప్‌ ఆర్టిస్ట్‌గా, హెచ్‌ఆర్‌ నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. ఆమె భర్త సతీష్‌చంద్ర బేగంపేటలోని ఓ పాఠశాలలో చెఫ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఒక కుమార్తె ఉంది. కొన్నేళ్లుగా రాజీవ్, శిరీషల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోందనే ఆరోపణలున్నాయి. ఏడాది కింద రాజీవ్‌కు ఒక సాఫ్ట్‌వేర్‌ సంస్థ హెచ్‌ఆర్‌ విభాగంలో పనిచేసే తేజస్వినితో పరిచయమైంది. ఆమెకు దగ్గరైన రాజీవ్‌.. తనను దూరంగా పెడుతుండడంపై శిరీష పలుమార్లు నిలదీసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని శిరీష హెచ్చరించడంతో.. రాజీవ్‌ రెండు నెలలుగా మళ్లీ శిరీషకు దగ్గరయ్యాడు.
 
తేజస్విని–శిరీష మధ్య వివాదం
రాజీవ్‌ తనకు దూరమై.. శిరీషకు తిరిగి దగ్గరవడాన్ని తేజస్విని జీర్ణించుకోలేకపోయింది. రాజీవ్‌ను తనకు దూరం చేస్తున్నావంటూ దాదాపు నెల రోజులుగా శిరీషకు అభ్యంతరకంగా వాట్సాప్‌ సందేశాలు పంపిస్తోంది. తమ మధ్య నుంచి తప్పుకోవాలంటూ హెచ్చరించింది. ఈ వివాదం తీవ్రస్థాయికి చేరుతుండటంతో శిరీషతో విషయం సెటిల్‌ చేసుకోవాలని రాజీవ్‌ భావించాడు. దీనికోసం తన స్నేహితుడైన బోదాసు శ్రవణ్‌ సహకారం కోరాడు. ఇలాంటి అంశాలు పోలీసుల సమక్షంలో సెటిల్‌ చేసుకోవాలని సలహా ఇచ్చిన శ్రవణ్‌.. తనకు పరిచయస్తుడైన కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి వద్ద సెటిల్‌ చేసుకుందామని చెప్పాడు.
 
సోమవారం కుకునూర్‌పల్లి వెళ్లిన ముగ్గురు
సోమవారం ఉదయమే శిరీష స్టూడియోకు వచ్చింది. శ్రవణ్, రాజీవ్‌లు మధ్యాహ్నం అక్కడికి వచ్చారు. వారంతా కలసి రాత్రి 9.30 గంటల సమయంలో రాజీవ్‌కు చెందిన ఎండీవర్‌ కారులో కుకునూర్‌పల్లికి వెళ్లారు. నేరుగా ప్రభాకర్‌రెడ్డి పోలీస్‌ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. వెళ్లే ముందు రాత్రి 8.40 గంటల సమయంలో తన భర్తకు ఫోన్‌ చేసిన శిరీష.. ఆలస్యంగా ఇంటికి వస్తానని చెప్పింది. అర్ధరాత్రి వరకు ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో పంచాయితీ జరిగాక... సుమారు ఒంటిగంట సమయంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. 1.40 గంటలకు శిరీష తాను శామీర్‌పేట ప్రాంతంలో ఉన్నట్లుగా తన భర్త సతీశ్‌చంద్రకు వాట్సాప్‌ ద్వారా లోకేషన్‌ పంపింది. ఆ వెంటనే సతీశ్‌ ఫోన్‌ చేసినా స్పందించలేదు. తెల్లవారుజామున 4.30 గంటలకు మరోసారి ఫోన్‌ చేసినా స్పందన రాలేదు.
 
స్టూడియోకే వచ్చిన ఆ ముగ్గురూ..
తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆ ముగ్గురూ స్టూడియో వద్దకు చేరుకున్నారు. మార్గమధ్యంలోనూ వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. శిరీష కారు ఆపాలంటూ రెండుసార్లు కిందికి దిగివెళ్లినట్లు సమాచారం. మిగతా ఇద్దరు ఆమెకు సర్దిచెప్పి స్టూడియో వరకు తీసుకొచ్చారు. అక్కడికి చేరుకోగానే శిరీష అపార్ట్‌మెంట్‌ రెండో అంతస్తులోని స్టూడియోలోకి వెళ్లిపోయింది. పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని భావించిన శ్రవణ్‌.. కింది నుంచే వెళ్లిపోయాడు. పదిహేను నిమిషాల తర్వాత రాజీవ్‌ స్టూడియోలోకి వెళ్లాడు. అయితే అప్పటికే శిరీష ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని కనిపించిందని.. తానే చున్నీ కత్తిరించి మంచంపై పడుకోబెట్టానని రాజీవ్‌ చెబుతున్నాడు. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మంగళవారం ఉదయం 6.30కు శిరీష భర్త సతీశ్‌కు ఫోన్‌ చేసి అక్కడకు రప్పించారు. తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, రాజీవ్‌పై అనుమానం ఉందంటూ సతీశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
మీడియాలో హల్‌చల్‌ చేసిన శిరీష వార్త
మంగళవారం శిరీష మృతిపై బంజారాహిల్స్‌ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కానీ బుధవారం ఉదయం నుంచి శిరీష ఆత్మహత్య వార్త మీడియాలో మరోవిధంగా హల్‌చల్‌ చేసింది. ఈ వ్యవహారంలో రాజీవ్, శ్రవణ్‌లను అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. దీంతో తన పేరు కూడా బయటకు వస్తుందని ఆందోళనకు గురైన ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు చెబుతున్నారు. తాము సోమవారం శిరీషను తీసుకుని కుకునూర్‌పల్లికి వెళ్లి వచ్చినట్లు రాజీవ్, శ్రవణ్‌ అంగీకరించారని అంటున్నారు. పోలీసులు స్టూడియోలోని సీసీ కెమెరా ఫుటేజీలను స్వా«ధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజీవ్, శ్రవణ్‌లను విచారిస్తున్నామని.. తేజస్వినిని సైతం అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. శిరీష పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయన్నారు.
 
ఆత్మహత్యకు కారణం ఆత్మహత్యేనా?
కుకునూర్‌పల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి శిరీష ఆత్మహత్యే కారణమని పోలీసులు చెబుతున్నారు. అయితే సిద్దిపేట జిల్లాలో గత పది నెలల్లో ఎస్‌ఐలు ఆత్మహత్య చేసుకోవడం ఇది మూడోసారి. గతేడాది ఆగస్టులో అప్పటి కుకునూర్‌పల్లి ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో దుబ్బాక ఎస్‌ఐ చిట్టిబాబు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా ప్రభాకర్‌రెడ్డి సైతం సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ఈ ఘటనల వెనుక ఉన్నతాధికారుల వేధింపులు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో క్రైమ్‌ మీటింగుల సమయంలో ఉన్నతాధికారులు ఎస్‌ఐలకు ‘టార్గెట్లు’పెట్టడం, ఆ మొ త్తం ఇవ్వకుంటే మెమోలతో వేధించడం పరిపాటిగా మారిందని సమాచారం. ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య వెనుకా అలాంటి కారణాలు ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా మూడో ఉదంతం కావడంతో పోలీసు విభాగంపై మచ్చ రాకుండా ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు, శిరీష ఆత్మహత్యకు లింకు పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 
 
అంతు చిక్కని ప్రశ్నలెన్నో..
కుకునూర్‌పల్లి వెళ్లిన రాజీవ్, శ్రవణ్, శిరీష నేరుగా ప్రభాకర్‌రెడ్డి క్వార్టర్స్‌కే వెళ్లారు. వివాదం సెటిల్‌ కోసమే అయితే పోలీస్‌ క్వార్టర్స్‌లో ఈ తతంగం ఎందుకు పెడతారు?
విషయం సెటిల్‌ చేయిస్తానంటూ తీసుకెళ్లిన శ్రవణ్‌.. తిరిగొచ్చాక అపార్ట్‌మెంట్‌ కింద నుంచే ఎందుకు వెళ్లిపోయాడు?
శిరీష స్టూడియోలోకి వెళ్లాక 15 నిమిషాల పాటు రాజీవ్‌ బయటే ఎందుకు ఉండిపోయాడు?
రాజీవ్, శిరీషలను కుకునూర్‌పల్లికి తీసుకెళ్లిన శ్రవణ్‌... శిరీష ఆత్మహత్య విషయాన్ని ప్రభాకర్‌రెడ్డికి చెప్పకుండా ఉంటారా?
బంజారాహిల్స్‌ పోలీసులు శ్రవణ్, రాజీవ్‌లను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అంటే మంగళవారమే శిరీష ఆత్మహత్య విషయం ప్రభాకర్‌రెడ్డికి తెలిసి ఉండొచ్చు. మరి ప్రభాకర్‌రెడ్డి బుధవారం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
బుధవారం సాయంత్రం వరకు కూడా మీడియాలో ఎక్కడా రాజీవ్, శ్రవణ్, శిరీష కుకునూర్‌పల్లికి వెళ్లినట్లు రాలేదు? మరి ఆ కారణంతో ప్రభాకర్‌రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు?
ఎస్‌ఐగా పనిచేస్తున్న ప్రభాకర్‌రెడ్డికి పోలీసుల దర్యాప్తు విధానం పక్కాగా తెలిసే ఉంటుంది. ఏదైనా కేసులో ఓ వ్యక్తి ప్రమేయమున్నట్లు అనుమానించినా.. సాక్షిగా భావించినా పోలీసులు వెంటనే పిలుస్తారు. మరి శిరీష కేసుకు సంబంధించి తాము ప్రభాకర్‌రెడ్డిని ఏ విధంగానూ సంప్రదించలేదని, అసలా విషయమే తమకు తెలియదని బంజారాహిల్స్‌ పోలీసులు చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యకు ఆ కేసే ఎలా కారణమవుతుంది?
శిరీష మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్‌ వైద్యులు ఆమె పెదవులతో పాటు ముఖంపై గాట్లు ఉన్నట్లు గుర్తించారని పోలీసులు చెప్తున్నారు? అవి ఎలా వచ్చాయి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement