బ్యూటీ ఫుల్.. బతుకమ్మ

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ


సద్దుల సద్దు మోగకముందే.. ఆనందం అంబరాన్నంటింది. రంగురంగుల బతుకమ్మకు అన్ని రంగాల ఆడపడుచులు ఆటపాటలతో ఆరాధించారు. తీరొక్క పూల కొమ్మకు తమదైన రీతిలో ఉయ్యాల పాటలు వినిపించారు. సంబరాల వేడుకను సయ్యాటలతో జరుపుకున్నారు. కళాకారులు, యాక్టర్లు, యాంకర్లు, లాయర్లు, క్రీడాకారిణులు.. పిన్నలు, పెద్దలు, రాజకీయ రమణులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన మగువలు జనజాతరలో మమేకమయ్యారు. బతుకమ్మ పాటకు.. దాండియా ఆటను జోడించి కలర్‌ఫుల్ వేడుకను కళ్లముందుంచారు. గౌరమ్మకు జానపదాలతో గళార్చన చేసి మురిపెంగా గంగ ఒడికి చేర్చారు. సెల్‌కాన్ సౌజన్యంతో సాక్షి ‘సిటీప్లస్’ ఆధ్వర్యంలో శిల్పారామంలో మంగళవారం జరిగిన బతుకమ్మ సంబరాలు.. సైబర్‌వనంలో గునుగు పూల పరిమళం వెదజల్లింది.

 - సాక్షి, సిటీప్లస్

 

 ‘ఆడబిడ్డకు బతుకునిమ్మంటూ ఉయ్యాలో... ఆడ బిడ్డకు బతుకునివ్వమంటూ ఉయ్యా లో... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’.. పాటలతో పచ్చని ఆవరణ అణువణువూ ప్రతిధ్వనించింది. ఈ పాటలకు రాగం కలిపిన వారిలో రాజకీయనేతలూ ఉన్నారు. కాలు కదిపిన వారిలో కళాకారులూ ఉన్నారు. లాంగ్‌గార్డెన్‌లో ఒక వైపుగా నెలకొల్పిన బంగారు పూల బతుకమ్మ కాంతులు వెదజల్లింది.

మధ్యలో ఏర్పాటు చేసిన చిన్న వేదికపై ఒక్కొక్కరుగా బతుకమ్మలను అమర్చారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ప్రముఖ న్యూస్‌రీడర్ స్వప్న స్వాగత వచనాలతో సెలబ్రిటీల రాక ప్రారంభమైంది. ఒకరి వెంట ఒకరుగా వచ్చిన విభిన్న రంగాల ప్రముఖులు బతుకమ్మ సంబరాలకు సిద్ధమయ్యారు. తెలంగాణ సంప్రదాయ సంగీత రీతులను ఆస్వాదిస్తూ, ముచ్చట్లతో గడిపారు. అందరూ హాజరైన అనంతరం ఆటపాటలకు తెరలేచింది.

 

 సంప్రదాయానికి వందనం..

 మెత్తని పచ్చిక మీద నర్తించిన పాదాలు... ప్రకృతికి ప్రణమిల్లిన తెలంగాణ సంప్రదాయానికి ఘన వందనాలు అర్పించాయి. అచ్చమైన తెలంగాణ ప్రాంత గ్రామీణ మహిళలు అందించిన సహకారాన్ని ఆనందంగా అందుకుంటూ.. అక్కడికక్కడే ఆటపాటల్లో ఇన్‌స్టంట్ ట్రైనింగ్ తీసుకుని మరీ పలువురు సినీ, గ్లామర్ రంగపు అమ్మాయిలు ఆడిపాడిన తీరు అందరినీ అలరించింది. మన పండుగ అంటే మనది మాత్రమే కాదు మన లో మమేకమైన అందరిదీ అనే సరికొత్త సిద్ధాంతానికి జన్మనిచ్చిందీ సంబరం. పురుషులమైతేనేం.. ఆటపాటలకు మేము సైతం సై అంటూ పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్  వంటివారు సైతం పాల్గొనడం విశేషం.

 

 అపురూప ‘కళ’యిక...

 రాత్రి 9గంటల దాకా నిర్విరామంగా సాగిందీ సందడి. రాజకీయనేతలు, యువ సినీతారలు, అందాల రాణులు, సంప్రదాయ కళాకారులు... ఇలా విభిన్న రంగాలకు చెందిన మహిళల అపూర్వ కలయికతో తెలంగాణలోనే ఇప్పటిదాకా జరిగిన వాటిల్లో అత్యంత వైవిధ్యభరిత వేడుకగా నిలిచింది. ఈ సంబరంలో శిల్పారామం సందర్శకులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో హాజరైన సినీ, రాజకీయ, గ్లామర్ రంగ ప్రముఖుల ఆటోగ్రాఫ్స్ తీసుకుంటూ, ఫొటోలు దిగుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు.     

 

 కోలాహలంగా దాండియా... దసరా వేడుకలో భాగంగా సిటీప్లస్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాండియా కార్యక్రమం సైతం అతిథులను ఉర్రూతలూగించింది. రంగు రంగుల స్టిక్స్‌ను చేతబూనిన యువతులు, సెలబ్రిటీలు శిల్పారామం ఆవరణకు కొత్త శోభను అద్దారు. దాదాపు 2 గంటలకు పైగా సాగిన దాండియా సంబరంలో సందర్శకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంజాయ్ చేశారు. అద్భుతమైన సంగీత నేపధ్యంలో సాగిన ఈ సందడిని తమకు సమర్పించిన సాక్షి సిటీప్లస్‌కు వీరంతా హ్యాట్సాఫ్ చెప్పారు.

 

 ఆకట్టుకున్న ఆర్జే సూర్య...

 కార్యక్రమం ముగింపు సందర్భంగా బిగ్ ఎఫ్ ఎమ్ ఆర్జే సూర్య అందించిన మిమిక్రీ హర్షధ్వానాలు అందుకుంది. అటు మెగాస్టార్ నుంచి ఇటు సూపర్‌స్టార్ దాకా పలువురు నటుల్ని ఆయన అనుకరించిన తీరు, అందుకు గాను అల్లుకున్న కథనం అహుతుల్ని నవ్వుల్లో ముంచెత్తింది.   

 

 స్వరాష్ట్రంలో తొలిసారి.. ఇది మహిళల పండుగ. కులాలకు అతీతంగా అందరి మధ్య అనుబంధాలను పెంచే పండుగ. తొలిసారి సొంత రాష్ట్రంలో అధికారికంగా సెలిబ్రేట్ చేసుకోవడాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.

 - శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే

 

 సామాజిక పండుగ..

  ఆటపాటలు, ఆడవాళ్ల ముచ్చట్లు, ఇరుగుపొరుగు క్షేమసమాచారాలు.. ఇలా అన్నీ కలసి బతుకమ్మ ఓ సామాజిక పండుగలా అనిపిస్తుంది.

 - కార్తీక రెడ్డి, నగర మాజీ మేయర్

 

 పూల పండుగ

 బతుకమ్మ అంటే పూల పండుగ. పూలను పూజించే పండుగ. ప్రకృతి ఒడిలో పుట్టిన అందమైన పూలను సేకరించడం మొదలు.. వాటిని గౌరమ్మగా తీర్చిదిద్ది.. ఆటపాటలతో ఎంతో ఆసక్తిగా సాగే పండుగ.

 - రేష్మ, సినీనటి

 

 తెలంగాణ ఆయువుపట్టు

 తెలంగాణ సంప్రదాయానికి బతుకమ్మ ఆయువుపట్టు. బతుకమ్మ పాటను మించిన చైతన్య గీతం మరొకటి లేదు.  చరిత్ర మొదలు చుట్టుపక్కల జరిగే విషయాల వరకూ అన్నీ బతుకమ్మ పాటల్లో భాగమవ్వడమే ఈ పండుగ ప్రత్యేకత.

 - డాక్టర్ బండారు సుజాత శేఖర్, రచయిత్రి



 అన్నింటా ముందుకు..

ఈ బతుకమ్మకు అందరూ ఒక చోట చేరడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బతుకమ్మను తెలంగాణ రాష్ట్రం ఇంత గొప్పగా సెలబ్రేట్ చేయడం చాలా బాగుంది. ఇప్పట్నుంచి తెలంగాణ అన్నింటా ముందుండాలని కోరుకుంటున్నాను.

 - నైనా జైస్వాల్, టీటీ ప్లేయర్

 

 రంగుల బతుకమ్మలు..

 బతుకమ్మ గొప్పదనం కళ్లకు కట్టినట్టుగా కనిపించింది ఇక్కడ. బాగా ఎంజాయ్ చేశాను. అందరూ రంగురంగుల చీరల్లో బతుకమ్మల్లా మెరిశారు.

 - అనూష, విజే

 

 పోరు బాట.. హోరు పాట

 తెలంగాణ పోరుబాటలో బతుకమ్మ ఆటపాటలు కీలక భూమిక పోషించాయి. రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మలు చేతబూని ఉద్యమించిన మగువలందరూ ఇప్పుడు వేడుకగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బతుకమ్మ వైభవం దేశవ్యాప్తంగా విస్తరించాలి. ఈ పండుగ ఒక్క ప్రాంతానికి పరిమితం కాకూడదు. అన్ని వర్గాల ప్రజలను ఈ పండుగలో భాగస్వాములను చేయాలి. అప్పుడే ఈ జనం పండుగ ఘనంగా జరిగినట్టు అవుతుంది.

 - డీకే అరుణ, మాజీ మంత్రి

 

 దేశమంతా ఆడాలి..

 బతుకమ్మను అందంగా పేర్చడం వచ్చు. అమ్మమ్మ పాట పాడుతుంటే మా పెదనాన్న, చిన్నాన్న, పిల్లలమంతా కలసి ఆడేవాళ్లం. అడుగులో అడుగేస్తూ సాగే బతుకమ్మ ఆట ఆడటం కూడా ఒక కళే. తెలంగాణ వచ్చాక దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. మన బతుకమ్మను దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకునేలా చేసే బాధ్యత మనదే.

 - అలేఖ్య పుంజల

 

 పట్నం వచ్చిన తల్లి

 పల్లెపల్లెను.. ప్రతి గడపను పలకరించిన బతుకమ్మ.. ఇప్పుడు నగరానికి వచ్చేసింది. సిటీలో అన్ని చోట్ల ఘనంగా జరుపుకుంటున్న బతుకమ్మ వేడుకలే దీనికి నిదర్శనం. బతుకమ్మ పండుగ .. ప్రకృతిని కొలిచే పండుగ. అమ్మవారిని ఆటపాటలతో పూజించే పండుగ ఇది.

 - వి. మమత , టీజీవో అధ్యక్షురాలు

 - ఫొటోలు: ఠాకూర్, రాజేష్

  సృజన్, రాజేష్ రెడ్డి

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top