ట్రెండ్ మారింది గురువా... తప్పదు! - దర్శకుడు ముత్యాల సుబ్బయ్య

ట్రెండ్ మారింది గురువా... తప్పదు! - Sakshi


అరుణ కిరణం... మమతల కోవెల...ఎర్ర మందారం... మామగారు... అన్న... పవిత్ర బంధం...  హిట్లర్... పెళ్లి చేసుకుందాం... గోకులంలో సీత... అన్నయ్య...  ఇలాంటి సూపర్ హిట్ సినిమాలను డెరైక్ట్ చేసింది ముత్యాల సుబ్బయ్య. ఎప్పుడూ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో కనిపిస్తూ... ‘గురువా’ అంటూ స్వచ్ఛంగా పలకరించే ఈ పెద్దాయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అది తెలుసుకోవడానికే ‘సాక్షి’ ప్రయత్నించింది. ఆయన్నుకలిసి ముచ్చటించింది.

 

దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఊపిరి సలపకుండా సినిమాలు చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా నిశ్శబ్దం. ఎలా ఉంది?



ఎల్లకాలం మనమే రాజ్యం ఏలాలంటే కుదరదు. ట్రెండ్ మారింది గురువా... తప్పదు. దాన్ని స్వాగతించాలి. మా రోజుల్లో పెద్ద సినిమాలు, మోస్తరు సినిమాలు, చిన్న సినిమాలు... ఇలా మూడు రకాలుండేవి. నేను ఈ మూడు రకాల సినిమాలూ చేసేవాణ్ణి. సుబ్బయ్య పెద్ద సినిమాలు మాత్రమే తీస్తాడు అనే పేరు నాకు ఎప్పుడూ లేదు. నా ‘దీవించండి’ సినిమా తర్వాత ట్రెండ్ మారింది. సినిమాల్లో స్టార్‌డమ్ రాజ్యమేలడం ప్రారంభించింది. చిన్న సినిమాలు చచ్చిపోయాయి. మిడిల్ క్లాస్ హీరోలు కనుమరుగయ్యారు. నేను తీసే కుటుంబ కథలు టీవీల్లో సీరియల్స్‌లా వచ్చేస్తున్నాయి.



చిరంజీవితో ‘అన్నయ్య’ వంటి పెద్ద హిట్టు తీసిన తరువాత కూడా  పెద్ద సినిమాలు రాకపోవడానికి కారణం?



‘పవిత్రబంధం’ సినిమాను కన్నడంలో చేయమని అల్లు అరవింద్ అడిగారు. తీసిన కథనే తీయడం దేనికి? ఇక్కడే ఓ సినిమా ఇవ్వొచ్చు కదా! అనడిగితే... ‘అన్నయ్య’ ఇచ్చారాయన. చాలా పెద్ద హిట్ అది. కానీ... నా దురదృష్టం ఏంటంటే ఆ సినిమా తర్వాత నుంచే మన హీరోల మైండ్‌సెట్‌లో మార్పు మొదలైంది. కొత్తదనం కోసం తాపత్రయపడటం మొదలు పెట్టారు. మళ్లీ సుబ్బయ్యతో ఏం వెళతాం. ఈ దఫా ఇంకొకరితో పోదాం... అనే ధోరణికి వచ్చేశారు. నేను చేసేది నచ్చక వాళ్లు వేరే వాళ్ల దగ్గరకు వెళ్లలేదు. కేవలం కొత్తదనం కోసమే వెళ్లారు.



ఇప్పటికి ఎన్ని సినిమాలు చేసుంటారు?



51 సినిమాలు చేశా. వాటిలో ‘ఇదేం ఊరురా బాబు’(2001) మాత్రం విడుదల కాలేదు. అందులో ఆకాశ్, ప్రత్యూష హీరో, హీరోయిన్లు.



మీలోని మరో కోణం... సామాజిక స్పృహతో కూడిన సినిమాలు. నవభారతం, ఎర్రమందారం, అరుణకిరణం, అన్న... ఇవన్నీ ఆ కోవకు చెందినవే. మళ్లీ ఇలాంటి సినిమాలు చేయొచ్చుగా. ఆ ట్రెండ్ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్ కదా?



నేను రెడీ. సామాజిక స్పృహతో సినిమాలు తీద్దాం అనుకునే నిర్మాతలు ఎవరున్నారు చెప్పండి? ఈ తరం బ్యానర్లో టి.కృష్ణగారితో నేను పనిచేస్తున్నప్పుడు.. కథను కొత్తగా ప్రజెంట్ చేయాలని తపించిపోయేవారంతా. అలా ఆలోచించేవారు ఇప్పుడు లేరు. సినిమాకు డెరైక్టర్ కెప్టెన్ అంటారు కానీ... నిజానికి సినిమాకు కెప్టెన్ నిర్మాత. ఆయనకు అభిరుచి ఉంటే దర్శకుడు ప్రాణం పెడతాడు. అలాంటి నిర్మాతలు లేరు.



ఇప్పడెవరైనా నిర్మాత అడిగితే, మీరెలాంటి సినిమా తీస్తారు?



ఎలాంటి సినిమా తీస్తారని నిర్మాతను అడుగుతా. నిర్మాత మనసులోని కోరిక బట్టే నా సినిమా. నాకు సినిమా తప్ప వేరే  తెలీదు. ఇప్పుడు నాకు సినిమాల్లేవ్ కానీ, ఇప్పటికీ నాకు  ఆఫీస్   ఉంది. ఉదయం  ఇక్కడకు వచ్చి కూర్చుంటా. బుక్స్ చదువుతా. సీడీలు పెట్టుకొని సినిమాలు చూస్తా. కాసేపు సీరియల్స్ చూస్తా.



చివరగా... మీ సినీ ప్రస్థానాన్ని ఓసారి గుర్తు చేసుకుంటారా?



మాది వ్యవసాయ కుటుంబం. నాన్నపేరు శంకరయ్య, అమ్మ పేరు శేషమ్మ. నెల్లూరు జిల్లా విడవలూరిలో బీకాం చేశా. అక్కడ్నుంచి సినిమాలపై ఆసక్తితో మద్రాస్ రెలైక్కాను. మొదట మానాపురం అప్పారావుగారి వద్ద చేరాను. ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత ఎ.సంజీవిగారు ‘సిసింద్రీ చిట్టిబాబు’(1971) చేస్తుంటే వెళ్లి చేరాను. అది అయ్యాక కొన్నాళ్లు ఖాళీ. తర్వాత పి.సి.రెడ్డిగారి వద్ద చేరాను. ఆయన దగ్గర చేస్తున్నప్పుడే ‘మూడుముళ్ల బంధం’తో దర్శకుణ్ణయ్యే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా ఆడకపోయే సరికి మళ్లీ ఖాళీ. నాకు ముగ్గురు పిల్లలు, భార్య. సంసారాన్ని ఎలా నడపాలి?అందుకే మళ్లీ కో డెరైక్టర్‌గా పి.సి.రెడ్డిగారి వద్దే చేరాను. ఆ టైమ్‌లోనే టి.కృష్ణగారు ‘విప్లవశంఖం’ సినిమా నిర్మించారు. దర్శకుడవ్వాలనేది ఆయన కోరిక. అందుకే ‘నేటి భారతం’ కథ కూడా రెడీ చేసుకున్నారు. మంచి కో డెరైక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు పి.సి.రెడ్డిగారు నా పేరు సూచించారు. అలా టి.కృష్ణగారి సాంగత్యం లభించింది. మేం కలిసి చేసిన ‘నేటి భారతం’ పెద్ద హిట్. దేశంలో దొంగలుపడ్డారు, దేవాలయం, వందేమాతరం, ప్రతిఘటన... ఇలా ఆయన సినిమాలన్నింటికీ నేనే కో-డెరైక్టర్‌ని. ‘రేపటిపౌరులు’ మొదలు కాకముందే... నాకు ‘అరుణకిరణం’తో మరోసారి దర్శకునిగా అవకాశం వచ్చింది. ఆ సినిమా చేస్తూ... మరో వైపు ‘రేపటిపౌరులు’కి కో డెరైక్టర్‌గా చేశాను.



‘రేపటిపౌరులు’ సగం మీరే తీశారట కదా?



అవును... ‘అరుణకిరణం’ అవకాశం రాగానే... ‘రేపటి పౌరులు’ సిట్టింగ్‌లో కూడా నేను కూర్చోలేదు. అయితే... అప్పటికే టి.కృష్ణగారికి క్యాన్సర్ అని తెలిసింది. ‘రేపటిపౌరులు’ రెండు రోజుల షూటింగ్ చేసి కృష్ణగారు అస్వస్థతకు గురయ్యారు. అలాంటి సమయంలో టి.కృష్ణగారి సలహాలు తీసుకుంటూ ఆ సినిమా పూర్తి చేశాను. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లో టి.కృష్ణగారు క్యాన్సర్ చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లారు. ‘అరుణకిరణం’ విడుదలై విజయం సాధించిందని తెలిసి అమెరికా నుంచే అభినందనలు పంపారు. నిజంగా టి.కృష్ణగారి సాంగత్యం నా జీవితంపై ఎంతో ప్రభావం చూపించింది.

 

బాలకృష్ణ-వాణిశ్రీలతో తీస్తే ఆ సినిమా పెద్ద హిట్టయ్యేది!



నా తొలి సినిమా ‘మూడు ముళ్ల బంధం’ చాలా రిస్కీ సబ్జెక్ట్. భర్త కన్నా భార్య పెద్దదైతే? ఈ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. కానీ చాలామంది అది రాంగ్ అన్నారు. కృష్ణుని కంటే రాధ పెద్దది.  రాముడి కంటే సీత  వయసులో పెద్దది కాదా? సోక్రటీస్ కంటే ఆయన భార్య చాలా పెద్దది. అలాంటప్పుడు అది తప్పు ఎలా అవుతుంది? అసలు ఈ కథకు ఇన్‌స్పిరేషన్ మోదుకూరి జాన్సన్‌గారు. నేను పీసీరెడ్డిగారి వద్ద సహాయకునిగా చేస్తున్నప్పుడు ‘కొత్తకాపురం’ సినిమాలోని పాట కోసం మోదుకూరి జాన్సన్‌గారి ఇంటికెళ్లాను. వారి ఇంట్లో ఓ పెద్దావిడ ఉంది. ‘జాన్సన్...’ అని పిలుస్తోందావిడ. ‘మీ అమ్మగారు అనుకుంట పిలుస్తున్నారండీ...’ అన్నాన్నేను. ‘ఆవిడ మా అమ్మగారు కాదయ్యా... నా భార్య’ అన్నారు జాన్సన్ తాపీగా.



నేను షాక్. ‘అదేంటిసార్’ అంటే... ‘అదంతా ఓ కథలే’ అన్నారాయన. ఇక ఆయన్ను నేను కదిలించలేదు. ఆ తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. ఆమె నర్స్‌గా పనిచేస్తున్న రోజుల్లో జాన్సన్‌గారు చదువుకుంటూ ఉండేవారనీ, అనుకోకుండా సంభవించిన వారి పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లికి దారి తీసిందనీ. ఆ భార్యభర్తల మధ్య పదిహేనేళ్ల తేడా. అప్పుడనిపించింది.. ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా ఎందుకు తీయకూడదు అని. అలా తయారైన కథే ‘మూడుముళ్ల బంధం’. ఆ పాయింట్ మింగుడు పడక ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని చాలామంది అంటుంటారు. కానీ నిజానికి ఆ సినిమా ఫ్లాప్‌కి కారణం  తారాగణం. నా అభిప్రాయం ఏంటంటే... పెద్దయ్యాక ఆ కుర్రాడు బాలకృష్ణ. హీరోయిన్ వాణిశ్రీ అని. అలా తీస్తే సినిమా పెద్ద హిట్. అసలు ఇప్పుడు రావాల్సిన కథ అది. కానీ ఏం లాభం... తొందరపడి కోయిల ముందే కూసేసింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top