తేరుకోని మహానగరం | To recover City | Sakshi
Sakshi News home page

తేరుకోని మహానగరం

Oct 15 2014 1:43 AM | Updated on Jul 28 2018 3:23 PM

తేరుకోని మహానగరం - Sakshi

తేరుకోని మహానగరం

హుదూద్ సృష్టించిన పెనువిధ్వంసం నుంచి కకావికలమైన విశాఖపట్నం ఇంకా విషాదం నుంచి తేరుకోలేక పోతోంది.

ఆదుకోని యంత్రాంగం
మూడోరోజు స్తంభించిన కమ్యూనికేషన్స్
అత్యవసర వైద్యం అందక రోగుల ఇక్కట్లు
సీఎం, పీఎం సేవలో ఉన్నతాధికారులు
నత్తనడకన సహాయ, పునరావాస కార్యక్రమాలు
మనోనిబ్బరంతో ముందడుగేస్తున్న నగరవాసులు
నిత్యావసరాలందక లూటీ చేస్తున్న బాధితులు

 
విశాఖపట్నం: హుదూద్ సృష్టించిన పెనువిధ్వంసం నుంచి కకావికలమైన విశాఖపట్నం ఇంకా విషాదం నుంచి తేరుకోలేక పోతోంది. 48గంటలు గడుస్తున్నా నగరవాసులు ఆ షాక్ నుంచి బయటపడలేకపోతున్నారు. పెనువిషాదం మిగిల్చిన శిథిలాల మధ్య బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మూడో రోజు కూడా గుక్కెడు నీళ్లు కూడా దొరక్క నరకయాతనపడ్డారు. నెట్‌వర్కింగ్ వ్యవస్థ చిద్రమైపోవడంతో కమ్యూనికేషన్స్‌లేక పడరాని పాట్లు పడుతున్నారు. జాతీయ రహదారితో పాటు నగరంలోని అంతర్గత రహదారులపై నేలకొరిగిన మహావృక్షాలను యుద్ధప్రాతిపదికన తొలగించడంతో రాక పోకలు సుగమం అయినప్పటికీ విద్యుత్  సరఫరా పునరుద్ధరించలేకపోయారు. సోమవారం సాయంత్రానికే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మంగళవారం కూడా ఆచరణకు నోచుకోలేదు. దీంతో అంధకారంలో చిక్కుకున్న ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు పడుతున్న బాధలైతే వర్ణనాతీతంగా ఉన్నాయి.

నీళ్లకోసం జనరేటర్ కష్టాలు

గుక్కెడు నీళ్లకోసం విశాఖ నగరవాసులు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. అపార్టుమెంట్‌వాసులు గంటకు రూ.2వేల అద్దెతో జనరేటర్లను ఏర్పాటు చేసుకుని వాటర్ ట్యాంకుల్లో మంచినీళ్లు తోడుకుంటున్నారు. జనరేటర్లు దొరకని ప్రజలు సమీపంలో ఉన్న లాడ్జీల్లో రూమ్‌లు తీసుకుని కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నగరంలో ఏమూలకెళ్లినా బోరుల వద్ద జనం బారులు తీరి కన్పిస్తున్నారు. మంచినీళ్ల కోసం సిగపట్లకు దిగుతున్నారు. పెదజాలరిపేట, చినజాలరిపేటవంటి మత్స్యకార ప్రాంతాల్లో గోతులు తవ్వి చలమల్లో ఊటనీరు పట్టుకుంటున్నారు. ఇక విద్యుత్ సరఫరాలేక కేజీహెచ్ సహా కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యవసర వైద్యసేవలందక రోగులు నరకం చవిచూస్తున్నారు. డీప్ ఫ్రిజ్‌లలో ఉంచాల్సిన మందులు పాడైపోతుండడంతో వెంటిలేటర్స్‌పై ఉన్న రోగుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఇక ప్రతీ బాధిత కుటుంబానికి ఆహార పొట్లాలు-మంచినీళ్లు, అరలీటర్ పాలప్యాకెట్లు అందిస్తామని ఇచ్చిన హామీ కూడా నీటిమూటగానే మిగిలిపోయింది. మూడో రోజు కూడా ఇళ్లు నేలమట్టమైన మురికివాడల్లో సైతం ఎక్కడా పునరావాస చర్యలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాని పరిస్థితి. కొన్ని చోట్ల స్థానిక నాయకులు పంపిణీ చేస్తున్నా కట్టుబట్టలతో రోడ్డునపడ్డ నిర్వాసితులకు అందక అర్ధాకలితో అలమటిస్తున్నారు. మత్స్యకారుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఇళ్లన్నీ కుప్ప కూలిపోవడంతో వంటచేసుకునే వీలులేక రోడ్లపైనే సహాయం కోసం అర్థిస్తున్నారు.

అందని ప్రభుత్వ సాయం

ఐదులీటర్ల కిరోసిన్‌తోపాటు సాధారణ బాధితులకు 25కేజీల బియ్యం, మత్స్యకారులకు 50 కేజీల బియ్యం పంపిణీ యుద్ధప్రాతిపదికన చేపడతామన్న ప్రభుత్వం కనీసం నామమాత్రంగా కూడా శ్రీకారం చుట్టలేదు. నిత్యావసర ధరలు అందుబాటులోకి వచ్చినప్పటికీ డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో ఆవేదనతో ఉన్న బాధితులు నిత్యావసరాలను లూటీ చేసే పరిస్థితి ఏర్పడింది. నగర వాసులకోసం వివిధ జిల్లాలను నుంచి ఏడు లారీలలో రప్పించిన నిత్యావసరాల్లో రెండు లారీల నిత్యావసరాలను జిల్లా పాలనా కేంద్రమైన కలెక్టరేట్‌వద్దే బాధితులు అందినకాడకి పట్టుకుపోవడం వారి ఆక్రందనకు అద్దంపడుతోంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌తోపాటు ఏపీ ఫైర్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది నేలకూలిన భారీవృక్షాలను రాకపోకలకు ఇబ్బందిలేకుండా తొలగించడంతో ఆర్టీసీ సిటీ సర్వీసులతోపాటు ఆటోలు కూడా రోడ్డెక్కాయి. ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మోడువారిన చెట్లు తొలగిస్తుండడంతో నగరంలో ఎక్కడా పచ్చదనం మచ్చుకైనా కన్పించే పరిస్థితి లేకుండా పోయింది.

క్షేత్ర స్థాయిలో కొరవడిన పర్యవేక్షణ

కేంద్ర రాష్ర్టమంత్రులతోపాటు ఎనిమిదిమంది ఐఏఎస్ అధికారులను నగరానికి డివిజన్ల వారీగా ఇన్‌చార్జిలుగా నియమించినా వారంతా నగరంలో మకాం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు నగరాన్ని చూసేందుకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సేవలో ఉండడంతో క్షేత్రస్థాయిలో సహాయ పునరావాస చర్యలను పర్యవేక్షించే నాథుడు లేకుండా పోయారు. నెట్‌వర్కింగ్ లేకపోవడంతో ఏ మూల ఏ పనులు జరుగుతున్నాయో తె లుసుకునే వీలులేకుండా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రే నెట్‌వర్క్ యాజమాన్యాల తీరుపై మండిపడడమే ఇందుకు నిదర్శనం. బీఎస్‌ఎన్‌ఎల్ సహా వివిధ నెట్‌వర్క్‌ల సిగ్నలింగ్ వ్యవస్థ కుప్పకూలడంతో ప్రజల మధ్య సెల్ కమ్యూనికేషన్స్ అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఏటీఎంలు పనిచేయక  చేతిలో ఉన్న కాస్త డబ్బులు అయిపోయి ఆర్థికంగా ఇక్కట్ల పాలవుతున్నారు. ఇక తమ కష్టార్జితం హుదూద్ విధ్వంసంలో సర్వనాశనమైనా భవిష్యత్‌పై గంపెడాశలతో ఉన్న ప్రజలు మాత్రం మనోనిబ్బరంతో రేపటి కోసం ముందడుగు వేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement