సరిహద్దుల్లో పాక్‌ గాలిబుడగల దుమారం! | Sakshi
Sakshi News home page

సరిహద్దుల్లో పాక్‌ గాలిబుడగల దుమారం!

Published Sun, Oct 2 2016 10:16 AM

సరిహద్దుల్లో పాక్‌ గాలిబుడగల దుమారం!

చండీగఢ్‌: పాకిస్థాన్‌ నుంచి పెద్దసంఖ్యలో గాలిబుడగలు (బెలూన్‌లు) భారత సరిహద్దులోకి వచ్చి వాలుతుండటం కలకలం రేపుతోంది. పంజాబ్‌లో సరిహద్దుల మీదుగా దాదాపు మూడు డజన్ల గాలిబుడగలను బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఫీరోజ్‌పూర్‌, పఠాన్‌కోట్‌, అమృతసర్‌ సైనిక ఔట్‌పోస్టుల వద్ద అత్యధిక సంఖ్యలో గాలిబుడగలు దొరికాయి. ఉర్దూలో భారత్‌ వ్యతిరేక సందేశాలున్న కాగితాల్ని గాలిబుడగలకు కట్టి భారత్‌ వైపు ఎగురవేస్తున్నట్టు తెలుస్తోంది. భారతీయ మహిళలను, సైనికులను దూషిస్తూ అసభ్య వ్యాఖ్యలతో కూడిన గాలిబుడగలే అధికసంఖ్యలో వస్తున్నాయి. కొన్ని గాలిబుడగలపై ప్రధాని నరేంద్రమోదీకి సవాళ్లు కూడా ఉన్నాయి. ‘మోదీ పాకిస్థాన్‌ సైన్యం సత్తా ఏమిటో తెలుసుకోవాలంటే.. నేరుగా తలపడి చూసుకో’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయి.

గత జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్‌ నుంచి రాజస్థాన్‌ మీదుగా ప్రయాణించిన ఓ భారీ హెలియం బెలూన్‌ను భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) కూల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో తయారైన ఈ బెలూన్‌ 25వేల అడుగుల ఎత్తులో ఉండగానే ఐఏఎఫ్‌ రాడర్లు గుర్తించాయి. తమ దేశం నుంచి బెలూన్లు వెళితే భారత్‌ స్పందన ఎలా ఉంటుంది? వాటిని ఎంతసేపటిలో గుర్తిస్తారు? అన్నది తెలుసుకోవడానికి పాక్‌ సైన్యం ఇలాంటి కన్నింగ్‌ పనులకు పాల్పడుతుందా? అని సైనికాధికారులు అనుమానిస్తున్నారు.

Advertisement
Advertisement