ట్రంప్‌ హత్య.. సారీ చెప్పిన హీరో | ‘Johnny Depp apologizes for assassination joke | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ హత్య.. సారీ చెప్పిన హీరో

Jun 24 2017 4:49 PM | Updated on Aug 25 2018 7:52 PM

ట్రంప్‌ హత్య.. సారీ చెప్పిన హీరో - Sakshi

ట్రంప్‌ హత్య.. సారీ చెప్పిన హీరో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్యచేయబోయేది ఎవరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హాలీవుడ్‌ హీరో జానీ డెప్‌ ఎట్టకేలకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

పిల్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను హత్యచేయబోయేది ఎవరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హాలీవుడ్‌ హీరో జానీ డెప్‌ ఎట్టకేలకు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘పొరపాటున తప్పుగా మాట్లాడా.. క్షమించండి’ అని వేడుకున్నాడు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన చేశాడు. ఇంగ్లండ్‌లో జరిగిన గ్లాస్టోన్‌బరీ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో ట్రంప్‌ హత్యను ఉద్దేశించి హీరో చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారం చెలరేగిన నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గాల్సివచ్చింది.

‘ట్రంప్‌ను ఉద్దేశించి నేను వేసింది చాలా చెత్త జోక్‌. నిజానికి ఆయనపై నాకెలాంటి విద్వేషం లేదు. ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశమే తప్ప మరొకటికాదు. ఏదేమైనా తప్పు జరిగింది. క్షమించండి’ అని జానీడెప్‌ తన ప్రకటనలో పేర్కొన్నాడు. కాగా, హీరో వ్యాఖ్యలపై అటు వైట్‌హౌస్‌ సైతం ఘాటుగా స్పందించింది. ‘అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ ముమ్మాటికీ హింసను వ్యతిరేకిస్తారని, అయితే జానీ డెప్‌ లాంటి కొందరు ఆయన(ట్రంప్‌) ఉద్దేశాలను అర్థంచేసుకోవడంలో విఫలమవుతున్నారు’ అని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ మీడియాతో అన్నారు.

ట్రంప్‌ వస్తారా? చంపేదెవరు?
గురువారం గ్లాస్టోన్‌బరీ ఫెస్ట్‌లో జానీ డెప్‌ మాట్లాడుతూ.. ‘ఫ్రెండ్స్‌.. నేను మాట్లాడబోయేది వివాదాస్పదం అవుతుందని తెలుసు. అయినా సరే, ట్రంప్‌ ఇక్కడికొస్తారా? ఆయన్ని ఇక్కడికి తీసుకురావడానికి ఎవరైనా సహాయం చేస్తారా? అన్నట్లు.. చివరిసారిగా అధ్యక్షుణ్ని చంపిన నటుడు ఎవరో గుర్తుందా? మీకు స్పష్టం చేయాల్సిన ఇంకో విషయమేంటంటే.. నేను నటుణ్ని కాదు. ఏదో బతకడానికి అబద్ధాలు చెప్పేవాణ్ని మాత్రమే’ అని అన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement