జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్లు; భారీ కుట్ర

జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్లు; భారీ కుట్ర - Sakshi


- అసెంబ్లీలోకి వర్షపునీరు.. అభాసుపాలైన బాబు

- నిర్మాణ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు కొత్త నాటకం

- పైపులు కట్‌ చేయడం వల్లే నీరొచ్చిందన్న స్పీకర్‌ కోడెల

- సీఐడీ ఎంక్వైరీకి ఆదేశం.. సచివాలయం లీకేజీపై గప్‌చుప్‌




అమరావతి:
అంతర్జాతీయ రాజధాని అమరావతిలోని తాత్కాలిక భవనాలు ఒక్క వర్షానికే అతలాకుతలం కావడంతో చంద్రబాబు ప్రభుత్వం నవ్వులపాలైంది. అసెంబ్లీకి బీటలు, సచివాలయంలోకి నీళ్లు రావడంతో బాబు బండారం బట్టబయలైంది. చేసిన తప్పును సరిదిద్దుకోకపోగా.. తనను తాను కాపాడుకునేందుకు కుట్రల పర్వానికి తెరలేపింది బాబు సర్కార్‌. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్లురావడం వెనుక కుట్ర జరిగిందని సాక్షాత్తూ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడటం విడ్డూరం.



అధికారులతో కలిసి బుధవారం అసెంబ్లీని సందర్శించిన స్పీకర్‌ కోడెల.. లీకేజీ వ్యవహారంలో కుట్ర జరిగిందని, దీనిపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నానని చెప్పారు. స్పీకర్‌ రావడానికి ముందే.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.. మీడియాను అసెంబ్లీకి అనుమతించాలని ఆందోళన చేశారు. మంగళవారం వర్షం వెలిసిన కొద్దిసేపటికే అసెంబ్లీ నుంచి మీడియాను గెంటివేసినప్పుడే.. ప్రభుత్వం ఇలాంటి కుట్రకు తెరలేపుతుందనే అనుమానాలు వ్యక్తం కావడం గమనార్హం.



పైపులు కట్‌ చేశారు: స్పీకర్‌ కోడెల

అసెంబ్లీని పరిశీలించిన అనంతరం స్పీకర్‌ కోడెల కొన్ని ఫొటోలు చూపిస్తూ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఛాంబర్‌లోకి నీళ్లు వెళ్లేలా ఎవరో ఉద్దేశపూర్వకంగా పైపులు కట్‌ చేశారని ఆయన చెప్పారు. "ఇందులో కుట్ర జరిగిందని అనుమానిస్తున్నాం. ఆధారాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపుతున్నాం. కుట్రదారులు ఎవరనేది తేలాలి. వాళ్లను వదిలిపెట్టం"అని కోడెల వ్యాఖ్యానించారు.



మీడియాను ఎందుకు అనుమతించలేదు?

అసెంబ్లీలో లీకేజీలపై మాత్రమే సీఐడీ విచారణకు ఆదేశించానని, సచివాలయం లీకేజీలతో తనకు సంబంధం లేదని అన్నారు స్పీకర్‌ కోడెల. "అంత చిన్న పైపు నుంచి ఇంత పెద్ద వరద ఎలా వచ్చిఉంటుంది?", "ఇప్పుడు ఫొటోలు చూపిస్తున్న మీరు.. నిన్ననే మీడియాను లోనికి అనుమతించి ఉంటే అనుమానాలు ఉండేవి కాదుకదా?" అన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు కోడెల సమాధానాలు దాటవేశారు. "అన్నీ ఎంక్వైరీలో తేలతాయి.."అని చిత్తగించారు.



వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఆందోళన

చిన్న వర్షానికి అసెంబ్లీ భవనం చిల్లులుపడి కురుస్తుండటంపై ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు నిజనిర్ధారణకు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం మీడియాతో కలిసి అసెంబ్లీ భవనాన్ని పరిశీలించడానికి వారు ప్రయత్నించారు. అయితే, వారితోపాటు మీడియా ప్రతినిధులను అసెంబ్లీలోకి అనుమతించడానికి మార్షల్స్‌ నిరాకరించారు. దీంతో అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ భవనంలోని నిజానిజాలను తెలుసుకోవడానికి తమతోపాటు మీడియాను అనుమతించాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగారు.

(చదవండి: అసెంబ్లీకి బీటలు.. సచివాలయంలో నీళ్లు)

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top