
అందుకే సమంతను అంబాసిడర్ చేశాం: మంత్రి
సీఎం కేసీఆర్ చిన్నప్పటి నుంచి చేనేత కార్మికుల కష్టాలను కళ్లారా చూశారని అందుకే నేతన్నల ఇబ్బందులు తీర్చేందుకు భారీగా నిధులు కేటాయించారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
► చేనేతల కష్టాలు సీఎం కేసీఆర్ కు తెలుసు
► త్వరలో వరంగల్ లో మెగా టెక్స్‌టైల్ పార్క్: కేటీఆర్
పోచంపల్లి: సీఎం కేసీఆర్ చిన్నప్పటి నుంచి చేనేత కార్మికుల కష్టాలను కళ్లారా చూశారని అందుకే నేతన్నల ఇబ్బందులు తీర్చేందుకు భారీగా నిధులు కేటాయించారని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్యాషన్ డిజైన్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేనేతలో ఉత్సాహాన్ని నింపడానికి నటి సమంతను అంబాసిడర్ గా నియమించామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో శనివారం జరిగిన ‘నేతన్నకు చేయూత’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోచంపల్లి వస్త్రాలకు అంతర్జాతీయంగా పేరు ఉందన్నారు. జోలె పట్టి భిక్షాటన చేసి సీఎం కేసీఆర్ ఆనాటి ఉద్యమ నాయకుడిగా చేనేత కార్మికులను ఆదుకున్నారని చెప్పారు.
నేత వృత్తి కనుమరుగు అయ్యే పరిస్థితి దాపురించింది... అందుకే సీఎం రూ.1283 కోట్లను బడ్జెట్ లో కేటాయించారని వివరించారు. నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ త్వరలోనే అందించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారని, దీనిని త్వరలోనే ప్రకటిస్తారని చెప్పారు. ‘ప్రతి సోమవారం నా పిలుపు మేరకు అధికారులు విధిగా చేనేత వస్త్రాలు ధరిస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. చేనేత క్లస్టర్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి చేనేత కార్మికుడికి రూ. 15 వేలు కనీస వేతనం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని’ కేటీఆర్ వివరించారు.
నేత బజార్‌ను పోచంపల్లి లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చేనేత రంగంలో జీఎస్టీని అమలు చేయవద్డని కేంద్రాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. త్వరలోనే వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ఈటెల రాజేందర్, జోగు రామన్న, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ బాలూ నాయక్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.