కేసీఆర్ సీరియస్!


ఎంసెట్ కౌన్సెలింగ్‌పై ఏకపక్ష నిర్ణయమంటూ ఆగ్రహం

 

 సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 7 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఉన్నత విద్యా మండలి తీసుకున్న నిర్ణయంపై రాష్ర్ట ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సీరియస్ అయినట్లు తెలిసింది. సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై రాష్ర్ట విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం రాత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. తాజా పరిణామాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతకంటే ముందుగా విద్యా శాఖ ఉన్నతాధికారులతోనూ మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించారు. కౌనె ్సలింగ్ వ్యవహారంలో విద్యా మండలి తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో రాష్ర్ట ప్రభుత్వానికి తెలుసునని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెత్తనం ఏంటన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం.

 

 తెలంగాణ విద్యార్థుల సంక్షేమానికి ఏం చేయాలో అదే చేద్దామని మంత్రి అన్నారు. ఎంసెట్ ప్రవేశాల కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయొద్దనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగదని పేర్కొన్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లోనే(వచ్చే నెల 4న) సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండగా, హడావుడిగా అదికూడా తెలంగాణ అధికారులు లేకుండానే ఉన్నత విద్యా మండలి ఎలా నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు చెప్పినట్లు నడుచుకుంటామని, తెలంగాణ విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులతో అన్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top