రూ.73 కోట్లు ‘చెత్త’లో..

మండూరు చెత్త డంప్‌ వద్ద అధికారుల పర్యటన (ఫైల్‌)


మండూరు చెత్త ప్లాంట్‌లో భారీ స్కాం

ప్రైవేటు సంస్థతో అధికారుల కుమ్మక్కు

తేల్చిచెప్పిన శాసనసభ స్థాయీ సమితి  

ఏసీబీ దర్యాప్తునకు సిఫార్సు




సాక్షి, బెంగళూరు:  నగరంలోని మండూరు పాలికె చెత్త సేకరణ కేంద్రం నుంచి విద్యుత్, ఇంధన ఉత్పత్తి పథకంలో భారీఎత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే ఏ.బీ మాలకరెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన శాసనసభ స్థాయీ సమితి స్పష్టం చేసింది. రూ. 73 కోట్లు ప్రజాధనం ఖర్చుపెట్టినా ఒక్క మెగావాట్‌ కూడా విద్యుత్‌ తయారు చేయలేదని తెలిపింది. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిపింది. మరింత లోతుగా శోధించడానికి ఏసీబీతో దర్యాప్తు చేయించాని సిఫార్సు చేసింది.



ఇదీ పథకం.. ఇలా వైఫల్యం

అందులో ఉన్న వివరాల ప్రకారం మండూరులో రోజుకు వెయ్యి టన్నుల చెత్త ద్వారా 8 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం కోసం 2002లో గ్లోబల్‌ టెండర్లు పిలిచారు. 2007 ఏప్రిల్‌లో శ్రీనివాస గాయత్రీ రిసోర్స్‌ రికవరి లిమిటెడ్‌ బీబీఎంపీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం కుదిరి విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన భూమిని బీబీఎంపీ సదరు సంస్థకు అప్పగించిన తర్వాత 20 నెలల్లోపు ప్రాజెక్టు కార్యరూపం దాల్చాలి. ఈ క్రమంలో బీబీఎంపీ జులై నుంచి ప్రతి రోజూ 300 నుంచి 400 టన్నుల చెత్తను సదరు సంస్థకు అందించింది. అయితే ఒప్పందం ప్రకారం రోజుకు వెయ్యి టన్నుల చెత్తను సరఫరా చేయాల్సిందేనని శ్రీనివాసగాయిత్రీ పేర్కొంది. అయితే ఇది సాధ్యం కాకపోవడంతో చెత్తను ఎరువుగా మార్చడానికి వీలుగా 50 ఎకరాల స్థలాలన్ని పాలికె అందజేసింది. అయినా ఎరువు తయారు కాకపోవడంతో మండూరు ప్రాంతం విషతుల్యంగా మరిపోయింది. మా ప్రాంతాన్ని నాశనం చేయొద్దని స్థానికులు భారీ ఆందోళనలు చేపట్టారు. మొత్తంగా ఈ పథకం కోసం బీబీఎంపీ 2014 ఫిబ్రవరి వరకూ 73.34 కోట్ల ఖర్చు చేసింది. అవన్నీ వృథా అయిపోయాయి. ఇంత జరిగిన ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ కూడా ఉత్పత్తి కాలేదు. అంతేకాకుండా గాయత్రి సంస్థకు సర్కారు ఇచ్చిన భూముల్లో ఆరు ఎకరాలను అక్రమంగా బ్యాంకుల్లో కుదువ పెట్టి రుణాలు పొందినట్లు తెలుస్తోంది. ఇవేవీ తమకు తెలియవని పాలికె అధికారులు తప్పించుకుంటున్నారు. ఈ కుంభకోణంలో మరిన్ని నిజాలు బయటకి రావాలంటే ఏసీబీతో దర్యాప్తు చేయించాలని సమితి సిఫార్సు చేసింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top