ధోని, గేల్, వార్నర్.. బ్యాట్లు మార్చాల్సిందే! | Sakshi
Sakshi News home page

ధోని, గేల్, వార్నర్.. బ్యాట్లు మార్చాల్సిందే!

Published Thu, Jul 20 2017 10:12 AM

ధోని, గేల్, వార్నర్.. బ్యాట్లు మార్చాల్సిందే!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనికి కొత్త చిక్కొచ్చి పడింది. ధోనితో పాటు క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, కీరన్ పోలార్డ్ లాంటి హార్డ్ హిట్టర్లకు వాళ్లు ప్రస్తుతం వాడుతున్న తరహా బ్యాట్లను భవిష్యత్తులో ఉపయోగించకూడదు. ప్రస్తుతం ధోని వాడే తరహా బ్యాట్లను అక్టోబరు 1 నుంచి ఉపయోగించడానికి అవకాశం లేదు. మరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎమ్‌సీసీ) బ్యాటు కొలతలు, బరువుపై జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం బ్యాటు అంచు (ఎడ్జ్) మందం 40 మిల్లీమీటర్లు మించకుండా ఉండాలి. ఈ అక్టోబరు నుంచి ఈ నియమాలు అంతర్జాతీయ క్రికెట్లో అమల్లోకి రానున్నాయి. లంక పర్యటన ముగిసేవరకు పాత బ్యాట్లతోనే ఆడవవచ్చు.

ఎమ్‌సీసీ రూల్స్ ప్రకారం బ్యాట్ ఎడ్జ్ మందం 40 మిల్లీమీటర్లు, వెడల్పు 108 మి.మీ ఉండాలి. కానీ ధోని వాడే బ్యాట్ల ఎడ్జ్ 45మి.మీ ఉంటుంది. దీంతో ధోని కచ్చితంగా తన బ్యాటు కొలతలు మార్చుకుని తీరాల్సిందే. మరోవైపు సచిన్ తర్వాత అత్యంత బరువైన బ్యాటు వాడిన భారత క్రికెటర్ ధోనినే. టెన్నిస్ ఎల్బో కారణంగా సచిన్ ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిసిందే. ధోని బ్యాటు బరువు దాదాపు 1300 గ్రాముల ఉంటుంది. విరాట్ కోహ్లీ, రహానే, యువరాజ్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ బ్యాట్ల బరువు 1200 గ్రాములలోపే ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి అమలుకానున్న రూల్స్ ప్రకారమే వారి బ్యాట్ల అంచు మందం 40 మిల్లీమీటర్ల లోపు ఉండటంతో వారికి పెద్దగా ఇబ్బంది లేదు.

కేవలం లంక పర్యటన వరకే ధోని ప్రస్తుత తరహా బ్యాట్లను వాడేందుకు వీలుంది. ఆపై వాడే బ్యాట్ కొలతల్లో ధోని మార్పులు చేసుకోవాల్సిందే. ధోనితో పాటు క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, కీరన్ పోలార్డ్ లాంటి హార్డ్ హిట్టర్లకు ఎమ్‌సీసీ కొత్త నిబంధనలు అడ్డంకిగా మారనున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ లు వాడే బ్యాట్లు కొత్త నిబంధనలకు అనుగుణంగానే ఉండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు లేవు.

Advertisement
Advertisement