అమ్మ కోసం మళ్లీ తెరపైకి హుస్సేని
అమ్మ కోసం శిలువ వేసుకున్న వీరాభిమాని షిహాన్ హుస్సేని గుర్తున్నాడా.. కర్టాటక హైకోర్టు తీజా తీర్పుతో హుస్సేన్ మళ్లీ తెరపైకి వచ్చాడు
చెన్నై : అమ్మ కోసం శిలువ వేసుకున్న వీరాభిమాని షిహాన్ హుస్సేని గుర్తున్నాడా.. కర్టాటక హైకోర్టు తాజా తీర్పుతో హుస్సేని మళ్లీ తెరపైకి వచ్చాడు. అమ్మను మళ్లీ సీఎంను చేసిన దేవుడికి మొక్కుతూ మళ్లీ శిలువెక్కుతానని ప్రకటించి సంచలనం సృష్టించాడు. అక్రమ ఆస్తుల కోసులో ట్రయిల్ కోర్టు తీర్పును రద్దు చేస్తూ కర్నాటక హైకోర్టు సోమవారం తీర్పు చెప్పడంతో షిహాన్ హుస్సేని సంతోషంలో మునిగి తేలుతున్నాడు. తాను ఆ రోజు శిలువ వేసుకోవడం వల్లనే అమ్మ నిర్దోషిగా బైటపడిందని..దేవుడు తన మొర ఆలకించాడంటూ సంబరాలు చేసుకుంటున్నాడు ఈ పురుచ్చిత్తలైవి వీరాభిమాని. కరాటే మాస్టర్ ఏఐడీఎంకే పార్టీకి చెందిన 46 ఏళ్ల హుస్సేని జయలలితకు వీరాభిమాని. అంతేకాదు మార్టల్ ఆర్ట్స్‌లో ఇతనికి మంచి ప్రవేశం ఉంది.
తాను కోరుకున్నట్టుగా అమ్మ మళ్లీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్న నేపథ్యంలో దేవుడికి ధన్యవాదాలు తెలుపడానికి నిశ్చయించుకున్నట్టు హుస్సేని తెలిపాడు. అప్పటి గాయాలు కొన్ని ఇంకా మానకున్నా..తొందరలోనే మరోసారి శిలువ వేసుకుంటానని ఆయన తెలిపాడు. కోర్టు తీర్పుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాననీ, ఆదివారం రాత్రి నుండి అమ్మ ఇంటి ముందే తిరుగుతూ ప్రార్థనలు చేశానని చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరిలో శిలువ వేసుకున్నపుడు..గోళ్లపై మేకులు కొట్టించుకోవడం చాలా బాధగా అనిపించిందనీ, అదొక భయంకరమైన అనుభవమని పేర్కొన్నాడు. కానీ ఈసారి నొప్పిని భరించడంలో శిక్షణ తీసుకున్నానంటున్నాడు హుస్సేన్.
అక్రమాస్తుల కేసులో హైకోర్టులో దోషిగా తేలి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలవ్వడంతో.. సీఎం పదవిని ఒదులుకోవాల్సి వచ్చింది. దీంతో అమ్మ మళ్ళీ సీఎం కావాలని కోరుతూ జయలలిత 67వ పుట్టిన రోజు నాడు హుస్సేని శిలువేసుకున్నారు. శిలువపై ఆరు అంగుళాల మేకులని అరచేతులు , పాదాలకు కొట్టుకొని వేలాడదీసుకున్నాడు. దీనిపై చలించిపోయిన జయలలిత అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూనే..మరోసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడొద్దని హెచ్చరించిన సంగతి తెలిసిందే.


