
పెదవి దాటని తీపి కబురు!
సినీ ప్రముఖుల పెళ్లయినా, ప్రెగ్నెన్సీ అయినా అది మీడియాలో పెద్ద వార్తగా చలామణీ అవుతుంటుంది.
సినీ ప్రముఖుల పెళ్లయినా, ప్రెగ్నెన్సీ అయినా అది మీడియాలో పెద్ద వార్తగా చలామణీ అవుతుంటుంది. కానీ, గమ్మత్తేమిటంటే - ఆ రెండు విషయాలనూ మన సినీ స్టార్స్ వీలైనంత గుట్టుగా ఉంచేసుకుంటారు. మరీ.. ముఖ్యంగా సెలబ్రిటీల్లో చాలామంది తాము తల్లితండ్రులు కాబోతున్న విషయాన్ని బిడ్డ పుట్టేవరకు దాచి ఉంచుతారు.
ఉదాహరణకు ఐశ్వర్యారాయ్‌ని చెప్పుకోవాలి. గర్భవతినన్న విషయం బయటికి కనపడనివ్వకుండా వదులైన దుస్తులేసుకుని, చున్నీ కప్పుకునేవారామె. అసలు విషయం చెబితే ఏం పోతుంది? అది ఆనందించదగ్గ విషయమే కదా అని ఆమె అభిమానులు కూడా అనుకునేవాళ్లు. బిడ్డ పుట్టేవరకు అసలు ఐశ్వర్య గర్భవతా? కాదా? అనే సందేహం చాలామందికి ఉండేది. హాలీవుడ్ తారలైతే ఇందుకు పూర్తి భిన్నం. తల్లితండ్రులు కాబోతున్నామనే విషయాన్ని ఎంతో ఆనందంగా, గర్వంగా బయటపెడతారు అక్కడి తారలు. నెలలు నిండుతున్న కొద్దీ ఆ ఫొటోలను చాలా ఉత్సాహంగా బయటపెడతారు.
వాస్తవానికి గర్భవతి కావడం జీవితంలోని ఓ కీలకమైన ఘట్టం. ఆ విషయాన్ని పది మందితో పంచుకుంటే ఆనందం రెట్టింపవుతుంది. అంత కీలకమైన దశ అది. మన సెలబ్రిటీల్లో ఈ దశ తాలూకు ఆనందాన్ని నలుగురితో పంచుకునే సంప్రదాయానికి తెరతీసింది టాలీవుడ్‌లో విష్ణు అనే చెప్పాలి. ట్విట్టర్ ద్వారా తను తండ్రి కాబోతున్న విషయాన్ని షేర్ చేసుకోవడంతో పాటు తన భార్య విరానికా ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫొటోలను బయటపెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. అందుకు నిదర్శనం ఇక్కడున్న ఫొటో. ‘ఎక్స్‌పెక్టింగ్ ఎనీ టైమ్’ అంటూ తన ఫేస్‌బుక్‌లో ఈ ఫొటో పెట్టారు బన్నీ. తాము తల్లిదండ్రులం కాబోతున్నామనే ఆనందం బన్నీ, స్నేహల్లో స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో వారు తమ పిల్లలకు మురిపెంగా చూపించుకోవడానికి పనికొచ్చే ఫొటో అది. వచ్చే నెల బన్నీ బర్త్‌డే. సరిగ్గా ఆ సమయంలోనే వాళ్లింట్లోకి కొత్త మెంబర్ చేరతారని సన్నిహితుల సమాచారం.
తండ్రి కానున్న ఎన్టీఆర్?
అల్లు అర్జున్, ఎన్టీఆర్... ఈ ఇద్దరు హీరోల పెళ్ళిళ్ళు 2011లో రెండు నెలల గ్యాప్‌లో జరిగాయి. బన్నీ తండ్రి కాబోతున్న విషయం స్పష్టమైంది. ఎన్టీఆర్ కూడా తండ్రి కానున్నారని సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ వార్త పలు వెబ్‌సైట్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల బీవీయస్‌యన్ ప్రసాద్ కుమార్తె వివాహానికి సతీసమేతంగా హాజరయ్యారు ఎన్టీఆర్. ఆ వేడుకలో లక్ష్మీప్రణతిని చూసినవారు ప్రెగ్నెంటేమో అనే అభిప్రాయం వ్యక్తపరిచారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమె గర్భవతే అని తెలుస్తోంది. అయితే, ఎన్టీఆర్ వైపు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.