ఇంతకీ రాజేంద్రుడు ఎలా గెలిచారు?

ఇంతకీ రాజేంద్రుడు ఎలా గెలిచారు?


'మా' అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ వర్గం గెలవడం కష్టమేనన్న మాట ముందు నుంచి వినిపించింది. అయితే మురళీమోహన్ వర్గం చేసుకున్న సొంత తప్పిదాలు రాజేంద్రుడి విజయానికి బాటలు పరిచాయి. ఆయనతో పాటు ఆయన ప్యానల్కు చెందిన నలుగురు కూడా విజయం సాధించారు. చిరంజీవి సోదరుడు, ప్రముఖ నటుడు నాగబాబు బహిరంగంగా ముందునుంచి రాజేంద్రప్రసాద్కు అండగా నిలబడటం కూడా ఆయనకు బాగా కలిసొచ్చింది. తొలుత రాజేంద్రప్రసాద్ను ఏకగ్రీవం చేయాలని కూడా సీనియర్ నటులు అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో అనూహ్యంగా జయసుధను మురళీమోహన్ రంగంలోకి దించారు. ఇక ప్రధానంగా రాజేంద్రప్రసాద్ వర్గం విజయానికి దారి తీసిన కారణాలు ఓసారి చూద్దాం..


  • ఆరుసార్లు మా అధ్యక్ష పదవిని చేపట్టిన మురళీమోహన్ సామాన్య నటులకు దూరం అయ్యారనే విమర్శ బాగా వినిపించింది. ప్రధానంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులను ఆయన దూరం పెట్టారని అంటారు. ఈ వర్గాన్ని ముందునుంచి రాజేంద్రప్రసాద్ దగ్గరకు చేర్చుకున్నారు.

  • 'మా'లో మొత్తం 702 మంది సభ్యులుండగా అందులో కేవలం 394 మంది మాత్రమే పోలింగుకు హాజరయ్యారు. జయసుధకు మద్దతు ఇచ్చినవాళ్లలో చాలామంది పెద్దనటులే. వాళ్లకు ఆరోజు షూటింగ్ ఉండటం, లేనివారు కూడా వేరే కార్యక్రమాలతో రాకపోవడం కూడా ఆ వర్గానికి ప్రతికూలంగా మారింది.

  • 'మా' కార్యాలయాన్ని మురళీమోహన్ ఒక పార్టీ కార్యాలయంగా మార్చేశారన్న విమర్శలు కూడా గట్టిగా వినిపించాయి. నటీనటులందరూ ఒక్క కుటుంబంగా ఉండాల్సింది పోయి కేవలం ఒక పార్టీకి సంబంధించినట్లే కార్యాలయాన్ని మార్చారని విజయచందర్ లాంటి సీనియర్ నటులు కూడా విమర్శించారు. దీంతోపాటు తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ పార్టీ సభ్యులు కూడా రాజేంద్రప్రసాద్కు మద్దతుగా నిలిచినట్లు చెబుతున్నారు.

  • రాజేంద్రప్రసాద్కు వచ్చిన మెజారిటీ కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఇంతకుముందు ఆయన మురళీమోహన్ మీద పోటీ చేసినప్పుడు కేవలం 7 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం జయసుధ మీద ఆయన 87 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top