రైతుబిడ్డకు 75ఏళ్లు.. అభ్యుదయ శంఖారావం

రైతుబిడ్డకు 75ఏళ్లు.. అభ్యుదయ శంఖారావం


వివరం:  సమకాలీన రాజకీయాలపై వెండితెర వ్యాఖ్యానమైన తొలి చిత్రం...

బ్లాక్ అండ్ వైట్ యుగంలోనే రంగుల్లో చిత్రీకరణ ప్రయత్నాలు చేసిన మొదటి తెలుగు ఫిల్మ్...

తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గాన కోకిల టంగుటూరి

సూర్యకుమారికి తెలుగు తెరపై తొలి సినిమా...

జానపద సినీ కవి సౌర్వభౌమ కొసరాజు నటన, గీత రచనలకు తొలి చిత్రం

ప్రదర్శనలపై నిషేధం వేటు పడిన ప్రప్రథమ తెలుగు సినిమా...


 

ఒకే సినిమాకు ఇన్ని విశేషాలుండడం కూడా అచ్చంగా అరుదైన విశేషమే. ఇవన్నీ అభ్యుదయ చలనచిత్ర రథసారథి గూడవల్లి రామబ్రహ్మం  రూపొందించిన ‘రైతుబిడ్డ’ కీర్తిచంద్రికల్లోని కొన్ని కిరణాలు మాత్రమే. ఇవాళ సామాన్య ప్రేక్షకుడికి దూరంగా, పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్‌లో ప్రింట్ అందుబాటులో ఉన్న ఈ ఆణిముత్యం గురించి తెలుసుకోవాల్సినవి మరెన్నో!  1939లో విడుదలైన ‘రైతుబిడ్డ’కు ఆగస్టు 27తో 75 ఏళ్ళు పూర్తవుతున్న వేళ ఈ వెండితెర ‘ప్లాటినమ్’ వివరాలు... ఈ వారం ‘ఫన్‌డే’ ప్రత్యేకం...

 

‘రైతుబిడ్డ’లో టంగుటూరి సూర్యకుమారి,  (టోపీతో) తాసీల్దార్‌గా నెల్లూరు నగరాజారావు, (కుర్చీలో) ఖాసా సుబ్బన్నగా భీమవరపు నరసింహారావు; భార్య లక్ష్మిగా కొమ్మూరి పద్మావతి, భర్త నర్సిరెడ్డిగా బళ్ళారి రాఘవ, కుమార్తె సీతగా టంగుటూరి సూర్యకుమారి

 - డాక్టర్ రెంటాల జయదేవ  

 

 ఒక పెద్ద జమీ... దాన్ని పాలించే జమీందారు.... ఆయన తాబేదార్లుగా వ్యవహరించే మునసబు, కరణం... శిస్తు వసూలు లాంటి వ్యవహారాల్లో జమీలో జరుగుతున్న అన్యాయాలతో రైతులు విలవిలలాడడం... వయసులో, అనుభవంలో పెద్దవాడైన ఒక మధ్యతరగతి మంచి రైతు నర్సిరెడ్డి, అతని కుటుంబం అందరి పక్షాన గళం విప్పడం... ఊళ్ళో ఎన్నికల హంగామా... జమీందారు అభ్యర్థికీ, మరో యువ రైతు ఉద్యమనేత రామిరెడ్డికీ మధ్య ఎన్నికల పోటీ... ఎన్ని ప్రలోభాలు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా ప్రజా ఉద్యమానిదే విజయం... ఆఖరుకు జమీందారు అహంకారం తగ్గి, రైతుల పక్షాన నిలవడం...

 

 ...దేశానికి స్వాతంత్య్రం రాక ముందు కాలానికి సంబంధించిన ‘రైతుబిడ్డ’ కథ ఇది. ఈ కథ వింటే, ఇలాంటి పోలికలతో నిన్న మొన్నటి దాకా వచ్చిన గ్రామీణ నేపథ్య చిత్రాలు ఎన్నో గుర్తొస్తాయి. ఇటీవలి వరకు బాక్సాఫీస్ ఫార్ములా అయిన పల్లెటూరి రాజకీయాలు, అనుబంధాల కథకు తెలుగుతెరపై తొలి రూపం - ‘రైతుబిడ్డ’.

 

 కథా నేపథ్యం

 పౌరాణిక, జానపద కథలు, పద్యనాటకాలను స్క్రిప్టులుగా మార్చుకొని తెరకెక్కిస్తున్న రోజుల్లో సినిమాను అద్భుతమైన ఆయుధంగా భావించిన దర్శక - నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం ప్రవేశం తెలుగు సినిమాకు బ్రహ్మాండమైన కుదుపు. ఆ రోజుల్లో ఇలాంటి ఈ కథను ఎంచుకోవడం సాహసమే. అప్పటి సామాజిక వాతావరణాన్ని గమనిస్తే, 1935 ఇండియా యాక్ట్ ప్రకారం భారతీయుల్లో అక్షరజ్ఞానం ఉన్నవారికీ, పన్ను కట్టేవారికీ ఓటు హక్కు వచ్చింది.  అలా ‘విస్తృత ఓటింగ్’ సౌకర్యం వల్ల ’37 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అలా మద్రాస్ ప్రెసిడెన్సీకి రాజాజీ ముఖ్యమంత్రి, ప్రకాశం పంతులు రెవెన్యూ మంత్రి అయ్యారు.

 

 అప్పటికే, తెలుగునాట ‘జమీన్ రైతు’ ఉద్యమం నడుస్తోంది. కరవు కాటకాలు, తుపాన్లు వచ్చినా సరే ముక్కుపిండి మరీ బోలెడంత శిస్తు వసూలు చేస్తున్న జమీందార్ల దౌర్జన్యాలపై రైతాంగం పిడికిళ్ళు బిగించింది. ఆ పరిస్థితుల్లో ‘జమీందారీల రద్దు బిల్లు’ను శాసనం చేయించడానికి నెల్లూరులో ‘జమీన్‌రైతు’ పత్రిక వ్యవస్థాపకుడు నెల్లూరు వెంకట్రామానాయుడు (1891- 1959) సహా ఎంతోమంది కృషి చేస్తున్నారు. బిల్లు శాసనసభ ముందుకొచ్చింది. తిరుపతి ఎస్టేట్ తిరుత్తణి తాలూకాలో బొల్లిని మునిస్వామి నాయుడు (1885- 1935)లాంటివారు జమీన్‌రైతు ఉద్యమంతో ప్రజా విజయం సాధించారు. ఆ పరిస్థితులను నేపథ్యంగా తీసుకొని రామబ్రహ్మం ఈ ‘రైతుబిడ్డ’ కథను అల్లారు. 1939 జనవరిలో సెట్స్ మీదకొచ్చారు. మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా చేసిన ‘‘రైతుజన బాంధవుడు’’ స్వర్గీయ మునిస్వామి నాయుడికే సినిమాను అంకితమిచ్చారు.

 

 కదం తొక్కిన కలం వీరులు

 ఆ తరం గొప్ప రచయితలు, గేయకర్తలతో రామబ్రహ్మానిది ఆత్మీయతానుబంధం. సారథీ వారి తొలి చిత్రం ‘మాలపిల్ల’లో లాగే ఈ చిత్రానికీ ఒకరి కన్నా ఎక్కువ రచయితలను ఆయన వినియోగించుకున్నారు.  రచయిత గోపీచంద్ మాటలు రాసి, సహాయ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. అదనపు సంభాషణలేమో తాపీ ధర్మారావు, హాస్య సన్నివేశాలేమో మల్లాది విశ్వనాథ కవిరాజు రాసినవి. బసవరాజు అప్పారావు గీతాల హక్కులు కొని, ‘మాలపిల్ల’లో వాడినట్లే, ఈ ద్వితీయ చిత్రం ‘రైతుబిడ్డ’కు కూడా బసవరాజు గీతాలతో పాటు, ‘జమీన్‌రైతు’ వెంకట్రామానాయుడు గీతాలు, తుమ్మల సీతారామమూర్తి చౌదరి పద్యాలు తీసుకున్నారు.

 

 ఇక, అప్పటికే రైతు జన సంఘ ఉద్యమానికి ఆలంబనగా ‘కడగండ్లు’ పేరిట పాటలు రాసిన అనుభవం కొసరాజు రాఘవయ్య చౌదరికి ఉంది. జనసామాన్యంలోకి చొచ్చుకుపోయిన ఆ పుస్తకంలోని ‘నిద్ర మేలుకోర తమ్ముడా!’ పాటను రామబ్రహ్మం ఈ సినిమాలో వాడుకున్నారు. వ్యక్తిగతంగా సన్నిహితుడైన కొసరాజును పిలిపించి, మరికొన్ని పాటలు రాయించుకున్నారు. అలా ప్రారంభమైన కొసరాజు గీత రచనా జీవితం ఆ పైన జానపద గీతాలకు చిరునామా అయింది.

 

జనజాగృతికి సినీ సారథి

 సినిమాను జనజాగృతికి వినియోగించిన తొలి తరం తెలుగు దర్శ కుడు గూడవల్లి రామబ్రహ్మం. స్వాతంత్య్రానికి పూర్వమే అస్పృశ్యత అంశాన్ని తీసుకొని ‘మాలపిల్ల’ చిత్రాన్ని (రిలీజ్ 1938 సెప్టెంబర్ 25) రూపొందించిన చైతన్యశీలి ఆయన. తెలుగులో తొలి పూర్తి టాకీ (‘భక్త ప్రహ్లాద’ - 1932 ఫిబ్రవరి 6) వచ్చిన ఆరేళ్ళకే ఇలాంటి విప్లవాత్మక ఇతివృత్తాలను తెరకెక్కించడం ఆయన చేసిన సాహసం. కృష్ణాజిల్లా నందమూరుకి చెందిన రామబ్రహ్మం 1930ల తొలినాళ్ళలో మద్రాసు వెళ్ళి, ‘సమదర్శిని’, తరువాత ‘ప్రజామిత్ర’ పత్రికలకు సారథ్యం వహించినా, కొత్తదైన సినీ రంగంలోకొచ్చినా ఆయన జాతీయతావాదం, ప్రయోగశీలత, సామాజిక ప్రయోజన దృష్టే కారణాలు. మొదట వేల్ పిక్చర్స్, ఆ పైన బెజవాడ ‘సరస్వతీ టాకీసు’ సంస్థల సినీ నిర్మాణాల్లో పాలుపంచుకొన్నారు.

 

  సమాజాన్ని ప్రతిఫలించే సాంఘిక కథల వైపే మొగ్గుచూపి, కె. సుబ్రహ్మణ్యం తీసిన సాంఘికం ‘బాలయోగిని’(’37)కి దర్శకత్వ శాఖలో పనిచేశారు. అభ్యుదయ భావాలకు తెర రూపమిచ్చేందుకు రామబ్రహ్మం ‘సారథీ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. చల్లపల్లి రాజా శ్రీమంతు యార్లగడ్డ శివరామప్రసాద్‌ను డెరైక్టర్ల బోర్డు చైర్మన్‌గా పెట్టుకొన్నారు. 1937 సెప్టెంబర్‌లో మద్రాసులోని రాయపేటలో ‘సారథి’ సంస్థ ప్రారంభమైంది. (లాయిడ్‌‌స రోడ్ మొదట్లో ఆఫీసుండేది). ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ తదితర ఉత్తమ చిత్రాలు తీశారు. రామబ్రహ్మం కన్నుమూశాక కూడా చల్లపల్లి జమీందార్ల యాజమాన్యంలో ‘సారథీ’ సంస్థ ‘రోజులు మారాయి’ (55) లాంటి మంచి చిత్రాలందించింది. హైదరాబాద్ సారథీ స్టూడియోస్ సైతం 1956లో జమీందార్లు నెలకొల్పినదే!


కెమేరా ముందుకు... గీత, సంగీత కర్తలు

 మరోపక్క రామబ్రహ్మం మిత్రుడూ, ‘మాలపిల్ల’ ద్వారా తెలుగు వరుసలు, లలిత సంగీత ఫక్కీ బాణీలను పాపులర్ చేసిన సంగీత దర్శకుడూ భీమవరపు నరసింహారావు ‘రైతుబిడ్డ’లో మరోసారి తన ప్రత్యేకత చూపారు. ఆయన అందించిన దేశవాళీ బాణీలు, ఆర్కెస్ట్రయిజేషన్‌తో పాటలు జనం నోట మారుమోగాయి. గీత రచయిత, సంగీత దర్శకుడు - ఇద్దరూ సినిమాలో కీలక పాత్రలు నటించిన ఘనత ‘రైతుబిడ్డ’కు దక్కింది. పాటల రచయితగా సినీరంగ ప్రవేశం చేసిన కొసరాజు ‘రైతుబిడ్డ’లో రైతు సంఘం నేత రామిరెడ్డిగా తెరంగేట్రమూ చేశారు. ఇక, భీమవరపు నరసింహారావేమో జమీందార్‌కు ఆంతరంగిక (ఉర్దూలో ఖాసా) సేవకుడైన ‘ఖాసా’సుబ్బన్న పాత్ర ధరించారు.

 

 తెరపై తారా సందోహం

 ఈ సినిమాలో రైతు పెద్ద నర్సిరెడ్డిగా రంగస్థల దిగ్గజం ‘బళ్ళారి’ రాఘవాచార్యులు, ఆయన భార్యగా కొమ్మూరి పద్మావతి (ఆమె కుమారుడే ప్రముఖ డిటెక్టివ్ కథా రచయిత కొమ్మూరి సాంబశివరావు) నటించారు. టంగుటూరి ప్రకాశం తమ్ముడైన శ్రీరాములు 3వ కుమార్తె - గాయని అయిన 14 ఏళ్ళ సూర్యకుమారి అప్పటికే తమిళ ‘విప్రనారాయణ’ (’38) ద్వారా తెరంగేట్రం చేశారు. కమ్మని గొంతు, కనువిందైన రూపమున్న ఆమెను ‘రైతుబిడ్డ’తో తెలుగుతెరపైకి తెచ్చారు రామబ్రహ్మం. ఆమె పాడిన ‘రావోయీ వనమాలీ బిరబిర..’ లాంటి పాటలు అంతా పాడుకున్నారు. భాషా పండితుడైన గిడుగు రామ్మూర్తి పంతులు కుమారుడైన డాక్టర్ జి.వి. సీతాపతిరావుతో జమీందారు పాత్ర వేయించారు. విజయా వారి ‘మాయాబజార్’లో సిద్ధాంతుల జంట శాస్త్రి - శర్మల్లో శాస్త్రిగా ఇవాళ్టికీ జనానికి గుర్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంగర వెంకట సుబ్బయ్య ఇందులో కరణం పాత్ర వేశారు. రంగస్థలంపైన, ‘మాలపిల్ల’ లాంటి చిత్రాల్లో నట, గానంతో ఆకట్టుకొన్న పి. సూరిబాబు ఇందులో ైబైరాగి రామజోగిగా ‘నిద్ర మేలుకోర..’ లాంటి హిట్ గీతాలాలపించారు.

 

 సహజత్వం... సాంకేతిక నైపుణ్యం...

మద్రాసు మౌంట్‌రోడ్‌లో ‘మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ కంబైన్ లిమిటెడ్’ (ఎం.పి.పి.సి.) స్టూడియోలో (తరువాత జెమినీ స్టూడియోగా మారి, ఇప్పుడు జెమినీ-పార్సన్ కాంప్లెక్సైంది) 1939 సంక్రాంతికి ‘రైతుబిడ్డ’ షూటింగ్ ప్రారంభమైంది. ఏ సినిమా తీసినా సహజమైన తెలుగు వాతావరణాన్నీ, సంస్కృతినీ ప్రతిబింబించడం రామబ్రహ్మం శైలి. అందుకు తగ్గట్లే ఈ సినిమా కోసం ఆయన ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలు తిరిగి ప్రకృతి దృశ్యాలను కెమేరాలో బంధింపజేశారు. శైలేన్ బోస్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు కాగా, నృత్యంలోనూ తెలుగుదనాన్ని ప్రతిబింబించడం కోసం ప్రత్యేకించి, కూచిపూడి అగ్రహారానికి చెందిన నాట్యకోవిదుడు వేదాంతం రాఘవయ్యను నృతదర్శకుడిగా పెట్టుకొన్నారు.

 

జమీందారు ఆవరణలో రైతుల్ని బంధించే ఘట్టంలో కూచిపూడి భాగవతుల ‘దశావతార’ నృత్యాన్ని రాఘవయ్య అద్భుతంగా నర్తించారు. తరువాత కాలంలో రాఘవయ్య దర్శకుడై, ఏయన్నార్‌తో ‘దేవదాసు’ తీయడం మరో కథ. స్వతహాగా జర్నలిస్టయిన రామబ్రహ్మం 1938 తుపాను కృష్ణాజిల్లాలో కలిగించిన బీభత్సాన్ని ‘రైతుబిడ్డ’లో కథానుగుణంగా చూపారు. సినిమా చివరలో ‘ప్రజామిత్ర’ పత్రికలో జమీందార్ కుమారుడి అపహరణ వార్త చదువుతూ, రామబ్రహ్మం కూడా తెరపై క్షణకాలం కనిపిస్తారు. ఔట్‌డోర్‌లో సూర్యకుమారి దృశ్యాలు, పతాక సన్నివేశాలలో జమీందార్ హడావిడిగా విమానం వద్దకు రావడం, చక్కని రన్‌వేపై విమానం టేకాఫ్, ఆకాశంలో ప్రయాణం లాంటి దృశ్యాలను ఆ కాలానికి అద్భుతంగా తీశారని చెప్పాలి. అందుకే, సుప్రసిద్ధ సినీ, సంగీత, నృత్య విమర్శకుడు వి.ఏ.కె. రంగారావు ‘‘నేను బొబ్బిలి జమీందార్ల వంశీయుడినైనా, మా నాన్న గారి ‘చిక్కవరం’ జమీ కృష్ణాజిల్లాలో ఉండడంతో, ‘రైతుబిడ్డ’లో చూపిన జమీందారీ దురన్యాయాలపై నాకు అవగాహన లేదు. అదెలా ఉన్నా, సంగీతం, ఛాయాగ్రహణం, లైటింగ్, ఎడిటింగ్ - ఇలా అనేక విభాగాల్లో సినిమా అద్భుతంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు.  

 

 ఇవాళ్టికీ అవే ఓటు రాజకీయాలు

 ‘రైతుబిడ్డ’లో వాడిన ఉద్వేగభరితమైన ‘రైతుకే ఓటివ్వవలెనన్నా...’ లాంటి ఎన్నికల పాటలు, ప్రచార గీతాలు తరువాతి రోజుల్లో ప్రచార గీతాలకు ట్రెండ్ సెట్టర్లయ్యాయి. అలాగే, సినిమా తీయడానికి కొన్నాళ్ళ ముందు జరిగిన ఉద్యమ నేత చిన్నప్పరెడ్డి ఘటనను కూడా ‘సై సై చిన్నపరెడ్డి...’ అనే పాటగా సినిమాలో పెట్టడం విశేషం. ‘‘నా భూమిని తాకట్టు పెట్టమన్నారా! నా తల్లిని తాకట్టు పెట్టమన్నారా!’’ (షావుకారుతో నర్సిరెడ్డి పాత్రధారి బళ్ళారి రాఘవ) లాంటి డైలాగ్‌‌స రోమాల్ని నిక్కబొడుచుకొనేలా చేస్తాయి. అలాగే, ఎన్నికలలో ఓట్ల కోసం ప్రలోభాలు, ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల ప్రత్యేక నృత్య గానాలు- ఇవన్నీ ‘రైతు బిడ్డ’లో కనిపిస్తాయి. రూపం, పరిమాణం మారినా, ఈ ఓటింగ్ రాజకీయాలు, రైతు సమస్యలు ఇవాళ్టికీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నవే. ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ రాజకీయ పరిస్థితిని తెలుగు తెరపై చూపి, జన సామాన్యానికి రాజకీయ, సాంఘిక, ఆర్థిక చైతన్యాన్ని అందించిన   తొలి తరం సినిమా... ‘రైతుబిడ్డ’.

 

 ఆర్థిక నష్టం! ఆర్కైవ్స్‌లో భద్రం!

 ఆ రోజుల్లోనే లక్ష రూపాయలకు పైగా వ్యయంతో నిర్మాణమైందీ సినిమా. 1939 జూలై 29న సెన్సారైన (నంబర్- ‘ఎం 2103’) ఈ 178 నిమిషాల చిత్రం ఆగస్టు 27న 11 కేంద్రాల్లో ఒకేసారి రిలీజైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ ఉన్నా, పట్టణాల్లో అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. జమీందారు స్వతహాగా మంచివాడనీ, పక్కనున్నవారే దుష్టులన్నట్లు కథ నడిచిందనీ విమర్శలూ వచ్చాయి.

 

 విమర్శలెలా ఉన్నా, కొన్ని నెలల వరకు ‘రైతుబిడ్డ’ నిషేధానికి గురి కాలేదు. దాదాపు 90 కేంద్రాల్లో శాంతి భద్రతలకు భంగమేమీ లేకుండా సినిమా ప్రదర్శితమయ్యాక, అప్పుడు జమీందార్ల ఒత్తిడితో నిషేధం డిమాండ్ ఊపందుకోవడం విచిత్రం. (‘నిషేధపు వేటు’ బాక్స్ చూడండి). దేశానికి స్వాతంత్య్రం, జమీందారీ ‘ఎస్టేట్ల రద్దు చట్టం’ (1948) వచ్చి, జమీలన్నీ పోయాక, తరువాతెప్పటికో ఈ సినిమాపై నిషేధం నీడ తొలగింది. అప్పటికే నిర్మాతలను ఆర్థికంగా నష్టపరచిన ఈ చిత్రం క్రమంగా అందుబాటులో లేకుండా పోయింది. అయితే, ఈ సంచలనాత్మక చిత్రం, దీని కన్నా ముందు వివాదాస్పదమైన ‘మాలపిల్ల’ ప్రింట్లు పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్‌లో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి.

 

విజయవాడలో చరిత్రకు విగ్రహ సాక్షి

 సినీ జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, సినీ పంపిణీ, ప్రచార యుగ ప్రముఖుడు ఈడ్పుగంటి లక్ష్మణరావు తదితరుల పూనికతో 1983 మార్చి 4న విజయవాడలో అలంకార్ థియేటర్ వద్ద నిలువెత్తు రామబ్రహ్మం విగ్రహం ప్రత్యేకంగా ప్రతిష్ఠితమైంది. అప్పటి కొత్త ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రత్యేకంగా వచ్చి, విగ్రహావిష్కరణ చేశారు. ‘రైతుబిడ్డ’ రిలీజై 50 ఏళ్ళయినప్పుడు విజయవాడ అప్సర థియేటర్‌లో ‘రైతుబిడ్డ’ను ప్రత్యేకంగా ప్రదర్శించడం, సినీ పెద్దలు రావడం... ఆ తరం వారికి ఇవాళ్టికీ ఓ తీపి గుర్తు. వెరసి, అటు రైతు ఉద్యమస్ఫూర్తి, ఇటు సామాజిక చైతన్య కళాదీప్తితో ఏడున్నర దశాబ్దాలుగా వెండితెరపై వెలుగులీనుతున్న ‘రైతుబిడ్డ’ తెలుగు సినీ ప్రస్థానంలో ఎప్పటికీ ప్రత్యేకమే!

 

తెలుగు తెరపై తొలి నిషేధపు వేటు  

 అభ్యంతరాలేమీ లేవని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చినా, ‘రైతుబిడ్డ’ రిలీజయ్యాక గొడవ మొదలైంది. ఈ చిత్రంపై వివాదం వెనుక రాజకీయ కారణాలు చాలానే ఉన్నట్లనిపిస్తుంది. అప్పట్లో చల్లపల్లి జమీందార్, మీర్జాపురం జమీందార్ల మధ్య వైరం ఉంది. మొదట్లో ఇద్దరూ ‘జస్టిస్ పార్టీ’లోనే ఉన్నా, వైరుద్ధ్యాలతో చల్లపల్లి రాజా బయటకొచ్చి, ‘ప్రజామిత్ర పక్షము’ అనే పార్టీ పెట్టుకున్నారు. ‘ప్రజామిత్ర’ పత్రికకూ అండ అయ్యారు. మీర్జాపురం జమీందారును దృష్టిలో ఉంచుకొనే ‘రైతుబిడ్డ’లోని జమీందారు పాత్రను అల్లుకున్నారంటారు. అప్పట్లో వెంకటగిరి, బొబ్బిలి, పిఠాపురం జమీందార్లు జరీ టోపీలు పెట్టుకొనేవారు. కుక్కల్ని పెంచుకుంటూ, ముద్దు చేసేవారు. సరిగ్గా, ఈ సినిమాలో జమీందారు పాత్ర అలాగే ఉంటుంది.

 

నిషేధానికి ముందు ఘర్షణలు: సినిమా రిలీజ్ సందర్భంలో బొబ్బిలి, వెంకటగిరి జమీందార్లు వకీళ్ళతో ‘సారథీ’ వారికి నోటీసులిచ్చారు. దాంతో, ఆ వకీళ్ళకు సినిమా చూపెట్టారు. అభ్యంతరపెట్టదగినవేమీ లేవని వారు అభిప్రాయపడ్డారు. మద్రాస్ ప్రెసిడెన్సీలోని కాంగ్రెస్ సర్కార్ సినిమాపై జోక్యం చేసుకోలేదు. ఈలోగా 1939 సెప్టెంబర్‌లో 2వ ప్రపంచ యుద్ధమొచ్చింది. రాజాజీ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ రాజీనామా చేసింది. అదే అదనుగా జమీందార్లు మళ్ళీ రెచ్చిపోయారు. రిలీజైన కొన్ని నెలలకి ‘చక్కోసన్‌‌స టూరింగ్ టాకీస్’ వారు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ‘రైతుబిడ్డ’ను ప్రదర్శించబోయినప్పుడు జమీందార్ మనుషులు ఫిలిమ్ పెట్టెను ఎత్తుకుపోబోయారు. కుదరకపోయేసరికి లంచమిచ్చి, ప్రదర్శన మాన్పించాలని చూశారు. అదీ ఫలించక టూరింగ్ టాకీస్ డేరాకు నిప్పెట్టారు.  

 

ఎక్కడెక్కడ నిషేధం?: జమీందార్ల ఒత్తిడి పుణ్యమా అని నెల్లూరు జిల్లా మేజిస్ట్రేట్ వెంకటగిరి జమీందారీ ఏరియాలో ‘రైతుబిడ్డ’ ప్రదర్శనపై నిషేధం విధించారు. తరువాత బొబ్బిలి, మందసా, తర్ల జమీందారీలలో కూడా ‘చూపరాని చిత్రం’ అంటూ మద్రాసు ప్రెసిడెన్సీ సర్కార్ నిర్ణయించింది. వెరసి, విశాఖపట్నం జిల్లాలో, రామ్‌నాడ్ జిల్లాలోని సాతూర్ తాలూకా లోనూ 1940, ’41ల్లో నిషేధపుటుత్తర్వులు వచ్చాయి. సాక్షాత్తూ, ‘రైతు బిడ్డ’ను నిర్మించిన చల్లపల్లి రాజా వారి సొంత జిల్లా (కృష్ణాజిల్లా)లో సైతం నిషేధం వేటు పడింది. ప్రభుత్వం ఆనాటి మద్రాస్ ప్రావిన్స్ మొత్తంలో నిషేధించినట్లు చాలామంది పొరబడుతుంటారు. కానీ, నిషేధం పెట్టింది పై జిల్లాల్లో మాత్రమేనని ఈ రచయిత పరిశోధనలో తేలింది.

 

 స్వాతంత్య్రం రాక ముందు 1947లో మళ్ళీ ‘రైతుబిడ్డ’ వార్తల్లోకొ చ్చింది. చిత్రంపై నిషేధం ఎత్తివేయాలని సారథీ సంస్థ, సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్‌లు అభ్యర్థన పంపాయి. అప్పటి నుంచి 1951 ప్రథమార్ధం వరకు ప్రభుత్వశాఖలు నిషేధం ఎత్తివేతపై పదే పదే చర్చిస్తూ వచ్చాయి. జమీందారీ వ్యవస్థ పూర్తిగా లిక్విడేట్ అయ్యేదాకా నిషేధం ఎత్తివేయరాదని మద్రాస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు అన్వేషణలో తేలింది. తరువాత ఎప్పటికో  నిషేధాన్ని స్వతంత్ర భారత సర్కార్ ఎత్తివేసింది. నిషేధంతో వచ్చిన నష్టం, ఎదుర్కొన్న పరిణామాలతో తరువాత రామబ్రహ్మం తన దూకుడు కొంత తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇతర దర్శక, నిర్మాతలు కూడా కొన్నేళ్ళు ఇలాంటి ఇతివృత్తాలను పక్కనబెట్టి, నాటకీయ కుటుంబ, ప్రేమకథలనే ఎంచుకోవాల్సొచ్చింది. ఏమైనా, నిషేధానికి గురైన తొలి తెలుగు సినిమాగా ‘రైతుబిడ్డ’ చరిత్రలో నిలిచింది.

 

 కలర్‌లో తొలి చిత్రీకరణ?

నలుపు - తెలుపు సినిమాలే తప్ప, రంగుల చిత్రమన్న మాటే తెలియని ఆ రోజుల్లోనే కలర్‌లో కొన్ని దృశ్యాల చిత్రీకరణ, ప్రాసెసింగ్  ప్రయత్నం జరిగిన తొలి తెలుగు సినిమా కూడా ‘రైతుబిడ్డే’! సారథీ సంస్థ డెరైక్టర్లలో ఒకరూ, బొంబాయిలో ఫేమస్ సినీ లేబొరేటరీ యజమానీ అయిన సేట్ షిరాజ్ అలీ హకీమ్ దీనికి సలహా, సహాయాలందించారు. డాక్యుమెంటరీ చిత్రాల రూపకల్పనలో ఆ రోజుల్లో విఖ్యాతి గడించిన తెలుగుబిడ్డ పి.వి. పతిని అందుకు పంపించారు. బొంబాయి నుంచి వచ్చిన పి.వి. పతి ఆ ప్రకృతి దృశ్యాలనూ, సూర్యకుమారి పాల్గొన్న ఘట్టాలనూ రంగుల్లో చిత్రీకరించారు.

 

‘డూఫే కలర్’లో ఆ దృశ్యాలను తీశారు (గేవా, టెక్నీ, ఆర్వో కలర్‌ల లానే డూఫే కూడా ఒకటి). బొంబాయిలోని ‘డూఫే కలర్ లేబొరేటరీ’ లో ఆ దృశ్యాల ప్రాసెసింగ్ కూడా జరిగింది. నిశితంగా గమనిస్తే, చిత్రీకరణ జరుగుతున్నప్పటి వార్తలు, పత్రికా ప్రకటనలు ఆ సంగతి స్పష్టంగా పేర్కొన్నాయి. ఇప్పుడున్న ‘రైతుబిడ్డ’ ప్రింట్లలోనూ టైటిల్స్‌లో కూడా ఈ ‘డూఫే కలర్ ప్రాసెసింగ్’ వివరాలున్నాయి. అయితే ఎందుకనో కానీ, ఇప్పుడున్న ప్రింట్లలో కలర్ దృశ్యాలు కనిపించవు. తొలి రిలీజ్‌లో కూడా కలర్ దృశ్యాలు ప్రదర్శితమైనట్లు సమీక్షల్లో ఎక్కడా కనిపించలేదు. పోస్ట్ ప్రొడక్షనంతా పూర్తయ్యాక సిద్ధమయ్యే టైటిల్స్‌లో డూఫే కలర్ వివరమున్నా, తెర మీద దృశ్యాల్లో ఎందుకు కనిపించలేదనేది ఇప్పటికీ అంతుచిక్కని విషయమే. చిత్రీకరణ జరిగినా తొలి రిలీజ్‌కే ఏవైనా కారణాల వల్ల కలర్ దృశ్యాలు తీసేశారా, లేక బ్లాక్ అండ్ వైట్‌లోకి మార్చారా, లేక కలర్ సరిగ్గా రాక ముందుజాగ్రత్తగా కలర్‌తో పాటు తీసిన బ్లాక్ అండ్ వైట్ భాగాన్ని వాడారా అన్నది పరిశోధించాల్సి ఉంది.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top