డామిట్‌.. కథ అడ్డం తిరిగింది..! | Sakshi
Sakshi News home page

డామిట్‌.. కథ అడ్డం తిరిగింది..!

Published Sun, Aug 7 2016 9:57 AM

డామిట్‌.. కథ అడ్డం తిరిగింది..! - Sakshi

ఇన్‌చార్జి చైర్మన్‌ వర్గానికి హాండిచ్చిన పాలక పార్టీ కౌన్సిలర్లు
సమావేశానికి ఏడుగురు ఎడమొహం
టీడీపీలో కొత్త మలుపు తిరిగిన మున్సిపల్‌ రాజకీయం
 
టీడీపీ మున్సిపల్‌ రాజకీయాల్లో మరోసారి ఆధిపత్యపోరు కొనసాగుతోంది. రెండేళ్ల నుంచి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గోపవరపు శ్రీదేవి వర్గానికి వ్యతిరేకంగా పనిచేసిన ప్రస్తుత ఇన్‌చార్జి చైర్మన్‌ నెల్లూరి మంగమ్మ వర్గానికి చైర్మన్‌ వర్గీయులు మొదటి రోజే షాక్‌ ఇచ్చారు. 
 
మాచర్ల: మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీదేవి గురువారం రాజీనామా చేసిన కొన్ని గంటలకే కమిషనర్‌ ఎం.శ్రీనివాసులు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆమె రాజీనామా అంశాన్ని ఆమోదించారు. ఈ విషయం ప్రభుత్వానికి నివేదించేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయంపై అన్ని పార్టీల కౌన్సిలర్లకు సమాచారం అందించారు. అయితే టీడీపీకి చెందిన ఏడుగురు కౌన్సిలర్లు ఈ  సమావేశానికి దూరంగా ఉండడం కలకలం రేపింది. చైర్మన్‌ శ్రీదేవి పదవిలో ఉన్నంత కాలం ఇబ్బందులకు గురి చేసి తమ వర్గాన్ని నానాతిప్పలు పెట్టిన ప్రస్తుత ఇన్‌చార్జి చైర్మన్‌ అధ్యక్షతన జరిగే సమావేశానికి ఎందుకు హాజరు కావాలని వారంతా చర్చించుకొని పార్టీ నాయకులు ఫోన్‌లు చేసినా స్పందించలేదు. గురువారం రాత్రి వరకు సెల్‌ఫోన్‌లను ఆపి ఓ ప్రాంతంలో వారు సమావేశమై తమ భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రాజీ చేసిన నాయకులు డామిట్‌... మనం ఎంత చేసినా కథ అడ్డం తిరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఓ ముఖ్య నాయకుడు ప్రయత్నించినా..
నామినేటెడ్‌ పదవిలో ఉండి నియోజకవర్గంలో హల్‌చల్‌ చేస్తున్న ఓ నాయకుడు  శుక్రవారం ఉదయం అసమ్మతి కౌన్సిలర్లకు ఫోన్లు చేసి మీరు గురువారం మున్సిపాలిటీలో జరిగిన సమావేశానికి హాజరైనట్టు మున్సిపల్‌ కార్యాలయానికి వెళ్లి సంతకాలు పెట్టాలని ఫోన్‌లో ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. తాము సమావేశానికి వెళ్లలేదని అన్ని పత్రికలలో తాము గైర్హాజరైనట్లు ప్రచురణైతే ఏ విధంగా సంతకాలు పెట్టాలని ఆ నాయకుడిని అడిగినట్లు తెలిసింది. నేను చెబుతున్నా చేయండని ఆ నాయకుడు పదే పదే ఫోన్‌లు చేయగా మున్సిపల్‌ చైర్మన్‌కు నిన్నటి వరకు అనుకూలంగా ఉన్న ఐదుగురు కౌన్సిలర్‌లు, వారి భర్తలు రైల్వేస్టేషన్లలోని ఓ కార్యాలయంలో సమావేశమై తమను ఇప్పటివరకు ఇబ్బందులకు గురి చేసి నేడు పెత్తనం చేసే వర్గానికి తాము సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకున్నారు. 
 
సత్తా చాటేందుకు సన్నద్ధం..?
మున్సిపల్‌ చైర్మన్‌కు సంబంధించి రాబోయే రోజులలో ఎంపిక నోటిఫికేషన్‌ వచ్చిన సమయంలో (కౌన్సిలర్లుగా) తమ సత్తా చూపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. తాము రాజీ చేసిన తర్వాత మరో వర్గం వ్యతిరేక రాజకీయాలకు సిద్ధం కావడంతో నియోజకవర్గ నాయకులు మున్సిపాలిటీ రాజకీయాలను ఏ విధంగా చక్కదిద్దాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. 

Advertisement
Advertisement