బీజేపీ వైపు పరిటాల సునీత చూపు
ఈ నెల 23న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి బుధవారం ప్రకటించగానే పరిటాల సునీత వర్గం ఉలిక్కిపడింది.
వెంకయ్యనాయుడితో మంతనాలు
సాక్షి, అనంతపురం : ఈ నెల 23న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి బుధవారం ప్రకటించగానే పరిటాల సునీత వర్గం ఉలిక్కిపడింది. జేసీ సోదరుల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆమె త్వరలో బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. పరిటాల హత్య కేసులో జేసీ సోదరుల ప్రమేయం ఉందని పరిటాల వర్గం చాలా కాలంగా ఆరోపణలు చేస్తోంది. జేసీ సోదరులు పార్టీలోకి రాకముందే వర్గాలను తయారు చేస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్నారని, ఇక పార్టీలో చేరితే వారి ఫ్యూడల్ పోకడలతో పార్టీలో ఎవరూ మనుగడ సాగించలేరని వాపోతోంది. గతంలోనే జేసీ సోదరులను పార్టీలో చేర్చుకోవద్దని నిర్మొహమాటంగా సునీత తన అభిప్రాయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.
అయినా ఆయన పట్టించుకోకపోవడంతో జేసీ పేరును తాను ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడనని ఆమె ఇటీవల తిరుమలలో మీడియా ముందు చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీలో చేరుతున్నట్లు జేసీ దివాకర్‌రెడ్డి ప్రకటించడంతో సునీత బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడితో సమాలోచనలు జరిపినట్లు సమాచారం. జేసీ సోదరులు టీడీపీలో చేరాక సునీత తన నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిసింది.


