భూ కుంభకోణాలపై చర్చ జరపాలి | Sakshi
Sakshi News home page

భూ కుంభకోణాలపై చర్చ జరపాలి

Published Mon, Jun 19 2017 1:34 AM

భూ కుంభకోణాలపై చర్చ జరపాలి

చంద్రబాబుకు బీజేపీ ఎమ్మెల్సీ సోము లేఖ  
 
సాక్షి, రాజమహేంద్రవరం: విశాఖపట్నంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న భూ కుంభకోణాలపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబుకు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విజ్ఞప్తి చేశారు. విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపి ప్రజలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగించాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆదివారం సీఎంకు రాసిన లేఖలోని వివరాలను రాజమహేంద్రవరంలో విలేకర్లకు వెల్లడించారు. తల్లిగా కొలిచే భూమిని సేకరించి కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అల్లుడు ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి రూ.వేల కోట్ల విలువైన భూములు ఆక్రమించుకోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. విశాఖ భూ కుంభకోణంలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా సీబీఐ విచారణ కోరినప్పుడు ఇక ఇబ్బందేముందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో విశాఖలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిస్తే, ఆ పార్టీ వారు ఇక్కడ మకాం వేస్తారని, ఇక్కడి భూములు ఆక్రమించుకుంటారని చేసిన ప్రచారమే తమ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు ప్రధాన కారణమని సోము వీర్రాజు అన్నారు. అప్పుడు ఎన్నికల్లో అలా ప్రచారం చేసినవారే ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా భూములు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు.

Advertisement
Advertisement