ట్రంప్‌కు టిట్‌ ఫర్‌ టాట్‌: ఇరాన్‌ సంచలన నిర్ణయం | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు టిట్‌ ఫర్‌ టాట్‌: ఇరాన్‌ సంచలన నిర్ణయం

Published Sun, Jan 29 2017 9:10 AM

ట్రంప్‌కు టిట్‌ ఫర్‌ టాట్‌: ఇరాన్‌ సంచలన నిర్ణయం - Sakshi

టెహ్రాన్‌: ఇస్లామిక్‌ దేశం ఇరాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అమెరికన్ల రాకపై ప్రతిబంధకాలు విధించింది. ఏడు ఇస్లామిక్‌ దేశాల పౌరులను అమెరికాలోకి అడుగుపెట్టనీయకుండా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి ప్రతిచర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్‌ ప్రభుత్వం శనివారం ప్రకటించింది.

ట్రంప్‌ చర్యలు ఇరానీయులను అవమానించేలా ఉన్నాయని, ఇకపై ఇరాన్‌కు రావాలనుకునే అమెరికా పౌరులు కఠిన నిబంధనలు ఎదుర్కోక తప్పదని ప్రకటనలో పేర్కొంది. అమెరికాలోకి సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్‌ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్  పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్‌ శుక్రవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.

ముస్లిం దేశాలపై ట్రంప్‌ నిర్ణయం.. తీవ్రవాదం, హింసను మరింత ప్రేరేపించేలా ఉన్నదని ఇరాక్‌ విదేశాంగశాఖ మంత్రి జాదవ్‌ జరీఫ్‌ అన్నారు. ‘ఉగ్రవాదంపై ఉక్కుపాదం, అమెరికన్ల భద్రత అనే రెండు అంశాల ప్రాతిపదికన ఇస్లామిక్‌ దేశాలకు చెందిన పౌరులపై ట్రంప్‌ నిషేధం విధించారు. నిజం చెప్పాలంటే ఇది చరిత్రను వెనక్కి మళ్లించే చర్య. ఆయన నిర్ణయంతో ఉగ్రవాదం తగ్గకపోగా, గతంలో మాదిరి మరింత బలపడుతుంది’ అని జరీఫ్‌ వ్యాఖ్యానించారు. మున్ముందు ఇరు దేశాల సంబంధాలు ఎలా ఉంటాయనేది చెప్పలేమని మంత్రి అన్నారు. అమెరికా సహా ఆరు అగ్రరాజ్యాలు ఇరాన్‌తో చేసుకున్న అణుఒప్పందంపైనా ట్రంప్‌ గతంలో విమర్శలు చేసిన సంగతి విదితమే.

ఇరాకీల ఆగ్రహం: ట్రంప్‌పై తొలి కోర్టు దావా
అమెరికా అధ్యక్షడిగా ప్రమాణం చేసి పట్టుమని పదిరోజులైనా కాకముందే డొనాల్డ్‌ ట్రంప్‌పై కోర్టులో తొలి దావా దాఖలైంది. వీసా కలిగిఉన్నప్పటికీ తమను నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు ఇరాకీ పౌరులు శనివారం కోర్టును ఆశ్రయించారు. ట్రంప్‌తోపాటు అమెరికా ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొంటూ దావా వేశారు. నిబంధనల ప్రకారం వీసా పొంది, అమెరికా వచ్చిన తమ క్లైట్స్‌ను న్యూయార్క్‌ ఎయిర్‌పోర్టులో అధికారులు నిర్బంధించారని, ఇది చట్టవిరుద్ధమని ఇరాకీల తరఫు న్యాయవాదులు చెప్పారు. (శరణార్థులకు ట్రంప్‌ షాక్‌)

Advertisement
Advertisement