ఆంధ్రా కరెంటు అక్కర్లేదు! | kce says do not taken ap power | Sakshi
Sakshi News home page

ఆంధ్రా కరెంటు అక్కర్లేదు!

Mar 11 2015 3:22 AM | Updated on Aug 15 2018 9:27 PM

ఆంధ్రా కరెంటు అక్కర్లేదు! - Sakshi

ఆంధ్రా కరెంటు అక్కర్లేదు!

ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు కరెంటు ఇస్తానన్నా తీసుకోబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు కరెంటు

చంద్రబాబు ఇచ్చినా  తీసుకోబోమన్న సీఎం కేసీఆర్    
2018 కల్లా రాష్ట్రంలో   24,575 మెగావాట్ల విద్యుత్
ఐదేళ్లలో రూ. 6 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడి
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్

 
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు కరెంటు ఇస్తానన్నా తీసుకోబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ కష్టాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు కరెంటు ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి మేలే జరిగిందని వ్యాఖ్యానించారు. ‘తెలంగాణ విద్యుత్ సమస్యను ఎదుర్కొన్నప్పుడు కరెంటు ఇవ్వని చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పాలి. ఆయన విద్యుత్ ఇవ్వనందునే మనం అప్రమత్తమయ్యాం. రూ.1500 కోట్లతో విద్యుత్ కొన్నాం. 500 మెగావాట్లు కేరళ నుంచి, 800 మెగావాట్లు ఓపెన్ మార్కెట్‌లో కొన్నాం. ఒక్క ఎకరా పంట కూడా ఎండనివ్వలే. చంద్రబాబు ఇప్పుడు కరెంటు ఇస్తానన్నా తీసుకోం. ఇప్పు డు తీసుకుంటే మనది కూడా ఇవ్వాలి.

ఆయన మనకు రూ. 7.20కి యూనిట్ చొప్పున ఇస్తే, మనం రూ. 3.50కే ఇవ్వాల్సి వస్తుంది. అట్లా 25 ఏళ్లు కట్టాలే. ఆయన మంచి పని చేసిండు. హైదరాబాద్‌లో ఆయనను, ఏపీ మంత్రులు, అధికారులు, ఉద్యోగులను గౌరవంగా చూసుకుందాం. వాళ్లు మనకు టూరిస్టులు. మనం మంచిగ చూసుకుంటే టాక్స్‌లు కట్టుకుంటూ ఇక్కడే ఉంటరు. ఎప్పటికీ టూరిస్టులుగానే ఉంటరు’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ మంగళవారం సాయంత్రం శాసనసభలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించా రు. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్‌ను కళ్లకు కట్టించారు.

ఈ సందర్భంగా విద్యుత్ విషయంలో ఏపీ సీఎం వ్యవహరిం చిన తీరుపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ‘పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే... పొడుగోని నెత్తి పోచమ్మ కొట్టిందట. చంద్రబాబును చూస్తే అదే అనిపిస్తుంది. ప్రస్తుతం తెలంగాణకు 4,320 మెగావాట్ల థర్మల్, 2100 మెగావాట్ల హైడల్ పవర్ ఉంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు సీలేరు, కృష్ణపట్నం, హిందూజాల నుంచి కరెంటు ఇవ్వమంటే చంద్రబాబు ఇవ్వలేదు. కేంద్రం కమిటీ తప్పుబట్టినా ఖాతరు చేయలే. అప్పుడే మన అధికారులు స్పందించి అవసరమైన కరెంటు కొని రైతులకిచ్చారు. ఈ మార్చి, ఏప్రిల్‌లోనే కొంత కరెంటు కష్టముం టది. అయినా కోతలు విధించం. వచ్చే ఏడాది మార్చి తర్వాత రైతులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా 9 గంటల కరెంటిస్తం. పరిశ్రమలకు గంట కూడా కరెంటు కోత విధించలే. 2018 నాటికి రాష్ట్రంలో 24,575 మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉండబోతుంది’ అని కేసీఆర్  వివరించారు. 2015 చివరి నాటికి 7779 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, 2016లో 10,509 మెగావాట్లు, 2017లో 11,345 మెగావాట్లు, 2018 నాటికి 20,633 మెగావాట్లకు చేరుతుందన్నారు.  

సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

రూ. 200 కోట్లతో ఏడాదిన ్నర లోపే కొత్త సచివాలయం నిర్మించుకుంటాం. అక్కడే మంత్రులు, హెచ్‌వోడీల కార్యాలయాలు ఉంటాయి. ఉద్యోగుల క్వార్టర్లను 50 ఏళ్ల కిందట కట్టారు. కొత్తవి కట్టుకుంటాం. పరిపాలనను కేంద్రీకృతం చేసుకుంటాం. అది తప్పా? జూబ్లీహాల్‌ను రాష్ర్ట శాసనమండలిగా ఉపయోగించుకుంటున్నందుకు... కలెక్టర్లు సమావేశాలు నిర్వహించుకునేందుకు హాల్ కూడా అందుబాటులో లేదు. హైటెక్‌లు కట్టామని చెప్పుకునేటోళ్లకు ఇవి తెలియవా? రవీంద్రభారతి, లలిత కళాతోరణం తప్ప ఆడిటోరియాలు లేవు. అందుకే తెలంగాణ కళాభారతిని అద్భుతంగా నిర్మించుకుంటాం.

ఐసీడీఎస్ పథకం కింద అంగన్‌వాడీ కార్యకర్తలు రాష్ట్రంలో తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు. గత బడ్జెట్‌లో అంగన్‌వాడీలకు ఇచ్చిన రూ. 15,800 కోట్ల బడ్జెట్‌ను రూ. 8 వేల కోట్లకు కేంద్రం కుదించింది. అయినా వారి జీతాలను పెంచ బోతున్నం. ప్రతి సెంటర్‌కు వెయ్యి రూపాయలు విడుదల చేసి వంటపాత్రలు కొనిస్తాం. గ్రాముల లెక్కన కాకుండా కడుపు నిండా భోజనం పెట్టమని చెప్పా.

ఎస్సీలకు మూడెకరాల భూ పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. భూములు అందుబాటులో లేకుంటే కొనివ్వాలంటూ కలెక్టర్లకు రూ. 185 కోట్లు విడుదల చేశాం. మెదక్ జిల్లాలో తప్ప ఏ జిల్లాలో కూడా 50 శాతం నిధులు ఖర్చు కాలే.  
 ్హ కేజీ టు పీజీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పకడ్బందీగా అమలు చేస్తాం. ఎన్నేళ్ల పిల్లలను తీసుకోవాలి. వాళ్ల సంరక్షణ ఎలా? ప్రైవేటు స్కూళ్ల పరిస్థితి ఏంటి? 12వ తరగతి తర్వాత వాళ్లేం చదవాలి? ప్రణాళిక తయారు చేస్తున్నాం. నియోజకవర్గానికి తొలుత ఓ స్కూల్‌ను ప్రారంభించి పెంచుకుంటూ పోతాం.

రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివిన పిల్లలు హోంగార్డు ఇంటర్వ్యూలకు పోతున్నరు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్నరు. పౌల్ట్రీఫారాలు ఇంజనీరింగ్ కాలేజీలయ్యాయి. కళాశాలల్లో ప్రమాణాలు పడిపోయాయి. ఒకే ఫ్యాకల్టీని 9 కాలేజీలకు చూపిస్తున్నారు. అందుకే కఠినంగా ఉన్నం. మంత్రి మహేందర్‌రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే కాలేజీలను కూడా మూసివేయించినం. ఫేక్ సర్టిఫికెట్లు వస్తున్నాయి. దేశంలో వంద నకిలీ సర్టిఫికెట్లు దొరికితే అందులో 75 హైదరాబాద్‌వే.

వచ్చే రెండేళ్లలో రాష్ట్ర యువతకు లక్ష ఉద్యోగాలు వస్తాయి. కమలనాథన్ కమిటీతో రాష్ర్టంలో కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య తేలాక  భర్తీ ఉంటుంది. స్కూళ్లలో విద్యార్థులు తగ్గిపోతున్నారు. వారి సంఖ్య కన్నా టీచర్లు ఎక్కువున్నారు. అన్నింటినీ క్రమబద్ధీకరిస్తాం.

ఈ నెల 12న వరంగల్‌లో మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈసారి భూగర్భ జలమట్టం చాలావరకు తగ్గింది. వేసవి కార్యాచరణ ప్రణాళిక తయారవుతోంది. నీటి సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తాం.

రూ. 40 వేల కోట్లతో వాటర్‌గ్రిడ్ ఏర్పాటుచేస్తున్నాం. ప్రపంచ ప్రమాణాల ప్రకారం ఒక వ్యక్తికి రోజుకు గ్రామంలో 100 లీటర్లు, పట్టణంలో 130 లీటర్ల నీరు కావాలి. అందుకే ప్రతి ఇంటికి కృష్ణా, గోదావరి జలాలను అందించాలని నిర్ణయించాం. వాటర్‌గ్రిడ్‌కు హడ్కో రూ. 10 వేల కోట్లు, నాబార్డ్ రూ. 3 వేల కోట్ల రుణాలిచ్చేందుకు ముందుకొచ్చాయి.

తెలంగాణేతరులకు స్కాలర్‌షిప్పులిస్తే రేపు ఉద్యోగాల కోసం కూడా లైన్‌లో నిలబడతారు. అయినా గత ప్రభుత్వాల నాలుగేళ్ల బకాయిలను తీర్చేశాం. ఈసారి కూడా 371డి నిబంధన కిందే రీయింబర్స్‌మెంటు ఇవ్వనున్నాం. అయితే కాలేజీల ఫీజుకు ఓ స్లాబ్ పెట్టాం. అలాగే విద్యార్థులు తెలంగాణకు చెందినట్టుగా అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. 2014-15 ఫీజులను త్వరలోనే విడుదల చేస్తాం.

ఈ ఏడాది చివరికల్లా జిల్లాకు రూ. 25 కోట ్లతో ఓ సూపర్  స్పెషాలిటీ హాస్పిటల్‌ను, రూ. 100 కోట్ల చొప్పున నిలోఫర్, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం.

తమిళనాడు తరహాలో రాష్ట్రంలో రిజర్వేషన్లను అమలు చేస్తాం. 50 శాతం మించితే కోర్టులు అడ్డుకుంటాయి కాబట్టి ముస్లింలకు మతపరంగా కాకుండా వెనుకబడిన వర్గాల కింద పరిగణిస్తాం.

రహదారుల అభివృద్ధికి రూ. 20 వేల కోట్ల వరకు వెచ్చిస్తాం. బ్రిడ్జీల నిర్మాణానికి రూ. 2 వేల కోట్లు ఇస్తాం. నిజాం సుగర్ ఫ్యాక్టరీని రైతులకు అప్పగిస్తాం.

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ లోపభూయిష్టంగా ఉంది. దాని నుంచి 160 టీఎంసీల నీటిని ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఇంజనీర్ల బృందం బుధవారం హెలికాప్టర్‌లో సర్వే చేస్తుంది. నివేదిక వచ్చిన తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటాం. అలాగే పాలమూరు ఎత్తిపోతల పథకం, నక్కలగుట్ట, ఎస్‌ఎల్‌బీసీ, భీమా, నెట్టంపాడు వంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం.

తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు విషయంలో 15 రోజుల్లో మంచి మాట చెబుతా. విడాకులు తీసుకున్న మహిళలకు పింఛను ఇవ్వడం సాధ్యం కాదు. అర్హులందరికీ వెయ్యి, వికలాంగులకు రూ. 1500 చొప్పున ఇస్తున్నాం.

మైనారిటీల్లో 76 వేల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నామని ఎంఐఎం అంటోంది. అది తప్పు. 2,40,613 మందికి అంటే 8 శాతం పెన్షన్లు మైనారిటీలకు ఇస్తున్నాం. పెన్షన్ల కోసం ఏటా రూ. 4 వేల కోట్లు వెచ్చిస్తున్నాం. మరో రూ. 2 వేల కోట్లు ఎక్కువైనా ఫర్వాలేదు. సిద్ధంగా ఉన్నాం.
 
గుజరాత్ తర్వాత మనమే!
 
14వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం దేశంలో గుజరాత్ తర్వాత ధనిక రాష్ర్టం మనదేనని సీఎం పేర్కొన్నారు.  తెలంగాణ వనరులు ఆంధ్రాకు తరలిపోయాయని 1969 నుంచి ఉద్యమకారులు చెప్పిన మాట నిజమైందన్నా రు. తెలంగాణలో తలసారి ఆదాయం రూ. 1,03,899 కాగా.. దేశ సగటు రూ. 74,920 గా ఉందన్నారు. ‘‘గత బడ్జెట్‌ను రూ. 1,00,600 కోట్లుగా చూపిస్తే మనకు రూ. 60 వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. కేం ద్రం అన్ని పథకాల మీద 14 శాతం కోత విధించడంతో రూ. 29,950 కోట్లు రాలేదు. భూముల అమ్మకాల ద్వారా రూ. 10 వేల కోట్లు వస్తాయనుకున్నాం. అయితే బూమ్ లేనప్పుడు భూములను అమ్మకూడదని ఒక్క ఎకరా కూడా అమ్మలేదు. ఇవన్నీ కలిపితే బడ్జెట్ అంచనాలు సరిగా ఉన్నట్టే. ఇప్పుడు బూమ్ మళ్లీ వస్తోంది. భూముల అమ్మకం ద్వారా రూ. 30 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరుతుంది.

వచ్చే ఐదేళ్లలో స్థూలంగా 6 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఇందులో ప్రణాళికేతర వ్యయం రూ. 3,75,000 కోట్లు కాగా, ప్రణాళికా వ్యయం రూ. 2,25,000 కోట్లు. సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రణాళికేతర వ్యయం కిందికే వస్తాయి. 125 గజాల్లోపు ప్రభుత్వ స్థలాల్లో ఉండే పేదలకు ఉచితంగా, అంతకు మించిన స్థలాల్లోని వారికి నామమాత్రపు రుసుముతో క్రమబద్ధీకరణ చేయబోతున్నాం. 125గజాల కింద 3.36లక్షల దరఖాస్తులు వచ్చాయి (జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు వెల్లడిం చా రు). రుసుముతో కూడిన క్రమబద్ధీకరణకు 1,33,201 దరఖాస్తులు వచ్చాయి. అడ్వాన్స్ కిందనే రూ. 133.5కోట్ల ఆదాయం వచ్చిం ది. క్రమబద్ధీకరణ పూర్తయితే వెయ్యి కోట్ల ఆదాయం రానుంది’’ అని కేసీఆర్  చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement