విశాల్‌కు బెదిరింపు
దక్షిణ భారత నటుల సంఘం ఎన్నికల వ్యవహారం ఉద్రిక్తతను రేపుతోంది. విమర్శలు, ఆరోపణల పర్వం బెదిరింపులు, హెచ్చరికల దిశగా పయనిస్తున్నాయి.
సాక్షి, చెన్నై : దక్షిణ భారత నటుల సంఘం ఎన్నికల వ్యవహారం ఉద్రిక్తతను రేపుతోంది. విమర్శలు, ఆరోపణల పర్వం బెదిరింపులు, హెచ్చరికల దిశగా పయనిస్తున్నాయి. పాండవర్ జట్టు ప్రధాన కార్యదర్శి అభ్యర్థి, నటుడు విశాల్‌ను హతమారుస్తామని బెదిరింపులు రావడంతో ఆయన మేనేజర్ మురుగరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఇళ్లు, కార్యాలయాల పరిసరాల్లో భద్రతను పెంచారు. ఇక, నాటక కళాకారులకూ హెచ్చరికలు వస్తుండడంతో ఎన్నికల నాటి కి పరిస్థితి ఏ మేరకు ఉధృతం అవుతుందోనన్న ఉత్కంఠ నెలకొని ఉన్నది. దక్షిణ భారత నటీ నటుల సంఘం ఎన్నికలు ఈనెల 18న జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు , ఎమ్మెల్యే శరత్‌కుమార్ నేతృత్వంలో ఓ జట్టు, నటుడు నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శిగా పాండవర్ మరో జట్టు ఢీ కొడుతున్నాయి. ఓట్ల వేటలో ఇరు జట్లు తీవ్రంగానే ఉరకలు తీస్తున్నాయి. సర్వేలు నాజర్, విశాల్ నేతృత్వంలోని జట్టుకు అనుకూలంగా వస్తుండటంతో పాండవర్ జట్టులో గెలుపు ధీమా పెరిగి ఉన్నది. ఓట్ల వేటలో భాగంగా శరత్‌కుమార్ జట్టు, పాండవర్ జట్టు సభ్యులు తీవ్రంగానే విమర్శలు, ఆరోపణలు గుప్పించుకుంటూ వస్తున్నారు. ఈ వ్యవహారం తాజాగా బెదిరింపులు, హెచ్చరికల దిశగా పయనిస్తున్నట్టుంది. దీంతో ఎన్నికలు ప్రశాంతంగా సాగేనా, ఉద్రిక్తతలకు దారి తీసేనా, అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇందుకు అద్దం పట్టే విధంగా పాండవర్ జట్టు ప్రధాన కార్యదర్శి విశాల్‌కు హత్యా బెదిరింపులు రావడం, ఆయా ప్రాంతాల్లోని నాటక కళాకారుల సంఘాలకు హెచ్చరికలు పెరుగుతుండటం నిదర్శనం.
బెదిరింపు : నటుడు విశాల్ చెన్నై అన్నానగర్ డీ బ్లాక్ పన్నెండో వీధిలో నివాసం ఉంటున్నారు. అక్కడే ఆయన కార్యాలయం సైతం ఉన్నది. ఆయన మేనేజర్ మురుగరాజ్ విశాల్ తరపున అన్నానగర్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. విశాల్‌కు కొన్ని తెలియని నంబర్ల నుంచి పదే పదే ఫోన్లు వస్తున్నాయని, తీవ్రంగా బెదిరింపులు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హత్య చేస్తామన్న బెదిరింపు కూడా ఇస్తున్నారని, ఈ దృష్ట్యా విశాల్‌కు , ఆయన ఇళ్లు, కార్యాలయాలకు భద్రత కల్పించాలని విన్నవించారు. అలాగే, బెదిరింపుకాల్స్ వస్తున్న ఫోన్ నంబర్ల వివరాలను తన ఫిర్యాదు ద్వారా పోలీసులకు అందించారు. ఈ ఫిర్యాదును ఇన్‌స్పెక్టర్ జయ చంద్రన్ విచారణ వేగవంతం చేశారు. ఆ ఫోన్‌కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారో అన్న దిశగా విచారణ సాగుతున్నది. అలాగే, విశాల్ ఇళ్లు, కార్యాలయాల పరిసరాల్లో భద్రతను కల్పించి ఉన్నారు.
ఆ పరిసరాల్లో గస్తీ ముమ్మరం చేయడంతో పాటుగా, అటు వైపుగా అనుమానితులెవరైనా తచ్చాడుతున్నా, సరే వారిని అదుపులోకి తీసుకునే రీతిలో మఫ్టీ సిబ్బందిని రంగంలోకి దించే ప్రయత్నాల్లో ఇన్‌స్పెక్టర్ జయచంద్రన్ ృందం నిమగ్నం అయింది. ఇక, విశాల్‌కు ఓ వైపు బెదిరింపు వస్తుంటే, మరో వైపు పలు ప్రాంతాల్లోని నాటక కళాకారులకు సైతం హెచ్చరికలు పెరిగి ఉన్నాయి. విశాల్ జట్టుకు అనుకూలంగా అనేక నాటక సంఘాలు వ్యవహరిస్తున్నాయి. ఈ దృష్ట్యా, వారిని టార్గెట్ చేసి బెదిరింపులు పెరుగుతున్నట్టున్నాయి. తిరువణ్ణామలైలోని నాటక కళాకారులకు విశాల్ జట్టుకు ఓటు వేస్తే, బాంబులతో దాడి చేసి చంపుతామన్నంత బెదిరింపులు రావడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు భద్రత కల్పించాలని పోలీసులకు విన్నవిస్తున్నారు..


