నా కథా వ్యవసాయం

నా కథా వ్యవసాయం - Sakshi


జూలై 5 రావూరి భరద్వాజ జయంతి                  

ప్రతి శిఖరం వెనుకా ఒక కృషి ఉంటుంది....
.

 

 నా మొదటి కథ 1945లో అచ్చయింది. దాన్ని అచ్చువేసిన పత్రిక ‘ప్రజామిత్ర’. అప్పుడు దాని సంపాదకవర్గంలో ఏడిద కామేశ్వరరావు పని చేస్తుండేవారు. ఆ కథ పేరు ‘విమల’. ఆ కథ ఇలా ఉంటుంది. ఓ సనాతనపరుడైన తండ్రికి విమల అనే కూతురు ఉంటుంది. కథాసౌలభ్యం కోసం ఆవిడ విధవరాలయింది. చాలామంది ఆమెకు మళ్లీ పెళ్లి చెయ్యమని ఆ తండ్రితో చెబుతారు. ఆయన చస్తే విననంటాడు. ఓ రోజున ఆయనగారు రాత్రిపూట లేస్తాడు. పక్క ఇంటి ఇల్లాలు ఇంకెవరితోనో గుసగుసలాడుతూ ఉండటం కనిపిస్తుంది. ఆ సంఘటనను గురించే ఆయన ఒకటి రెండు రోజులాలోచిస్తాడు. ఇద్దరు బిడ్డల తల్లికే శరీర వాంఛల పట్ల అంత ఆసక్తి ఉన్నప్పుడు తన కూతురెలా ఆలోచిస్తూ ఉంటుందోననుకుంటాడు. ఆఖరుకు తెగించి పెళ్లి చేస్తాడు. అప్పట్లో ఆ కథ రాసి నేనేదో ఘనకార్యం చేశాననే అనుకున్నాను.

 

 ఆ రోజుల్లో పత్రికల్లో కథలు రాసేవాళ్లంతా నాకు చాలా గొప్పవాళ్లుగా కనిపించేవాళ్లు. ఇలా రాయడం వాళ్లకెలా చేతనయిందా అనుకునేవాణ్ణి. కలం పుచ్చుకుని కూచుంటే- కాదు- ఆ రోజుల్లో పెన్సిల్‌తోనే రాసేవాడ్ని- ఒక్క సంఘటన తట్టేది కాదు. ఒక్కవాక్యం కుదిరేది కాదు. చచ్చీ చెడీ నాలుగు లైన్లు రాస్తే అయిదో లైను రాయడానికి ఏమీ ఉండేది కాదు. ఆ అయిదోలైను రాసేందుకుగాను కొన్ని గంటల సేపు ప్రయత్నించిన విషయం నాకిప్పటికీ జ్ఞాపకం ఉంది. అయిదులైన్లు రాయడానికే నేనింత ఉట్టు గుడిచి పోతున్నానే మరి పదేసి పేజీలు పదిహేనేసి పేజీలు వాళ్లెలా రాస్తున్నారు? ఆ కీలకం ఏమిటి?

 

 ఆ సంగతి తెలుసుకోవడానికే చదవడం మొదలుపెట్టాను. పత్రికల్లో అడ్డమొచ్చిన ప్రతి కథా చదివాను. క్రమంగా నాకు కుటుంబరావు కథలు దొరికాయి. చదివాను. గోపీచంద్‌గారి కథలు దొరికాయి. చదివాను. చలంగారి యువప్రచురణలన్నీ చదివాను. చక్రపాణిగారి అనువాదాలు మునిమాణిక్యం, ధనికొండ పుస్తకాలూ అన్నీ చదివాను. వీటితో పోల్చి చూసినప్పుడు నేనిదివరకు చదివిన కథలన్నీ చాలా పిందెలనిపించింది. ఓ కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది. చలం పుస్తకాల తరువాత అంతగానూ నన్నాకర్షించిన గ్రంథాలు కవిరాజు రామస్వామి చౌదరిగారివి. ఆ తరువాత గోపరాజు రామచంద్రరావుగారివి. రామస్వామి పుస్తకాలు పురాణాలనూ భారత రామాయణాలనూ నిలువునా ఖండించి పారేస్తున్నాయి. చలంగారు పాతకాలపు నీతి విలువలను పటాపంచలు చేస్తున్నారు. గోరాగారు అసలు దేవుణ్ణే ఎత్తిపారేస్తున్నారు. ఉక్కిరిబిక్కిరయిపోతున్న దశ అది. అంత వరకూ నేనుంటున్న సమాజం ఎలాంటిదో వీరు విడమరిచి విప్పి చెప్పినట్లనిపించింది నాకు.

 

 ఆ తరువాతనే నేను విరివిగా కథలు రాయడం ప్రారంభించాను. కథారచనలో నన్నమితంగా ప్రోత్సహించినవారు ధనికొండ హనుమంతరావుగారు. ఆయన రచయితగానేగాక, సంపాదకుడుగా కూడా పేరు ప్రతిష్టలు సంపాదించారు. రచయిత ప్రకటించే ఆశయాలతో వారికెపుడూ పేచీ ఉండేదికాదు. ప్రకటించే విధానంలోని శిల్పం, నాజూకుతనం నైపుణ్యం మాత్రమే వారు పరిగణించేవారు. అచ్చుకు పంపని కథలూ అచ్చయికూడా నా దగ్గర లేని కథలూ మరీ ప్రారంభ దశలో పత్రికల్లో వచ్చిన కథలు మినహాయిస్తే దాదాపుగా నావి 300 వరకూ ఉంటాయి. వీటిల్లో చాలాభాగం హనుమంతరావుగారి సంపాదకత్వాన వెలువడిన పత్రికల్లోనే వచ్చాయి.

 

 దాదాపు 3, 4 సంవత్సరాల పాటు నేను అట్టడుగు ప్రజలతో కలసి మెలసి ఉన్నాను. వాళ్లలో సచ్ఛీలురు, సన్మార్గులు, భక్తులు, తాగుబోతులు, వ్యభిచారులు, కూలీలు, సోమరులు, అబద్ధాలకోర్లు, చిల్లర దొంగలు ఎన్నో రకాలవాళ్లు ఉన్నారు. పతితలైన స్త్రీలు కూడా వీరిలో ఉన్నారు. 1947- 53 వరకు చాలా కథలకు ఇతివృత్తాన్ని వీరి జీవితాల నుంచే తీసుకున్నాను. ఆ కథలు ఏ ఫలితాలు ఇచ్చాయన్నదానికి నా దగ్గర జవాబు సిద్ధంగా లేదు.

 

 అవి అవాస్తవికం అని సులభంగా తోసి పారేసేవారు అలానే జీవిస్తున్నవారిని సమాజం నుంచి తోసిపారేయలేకపోతున్నారు. ‘కథావస్తువు మంచిది లేదండి’ అనడం నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఆ లేకపోవటమన్నది చూసే శక్తిగాని ‘వస్తువు’ కాదనుకుంటాను. ఒకే విషయాన్ని ఒకే పద్ధతిలో చెప్పడం నాకు గిట్టదు. ఒక విషయాన్ని పది పద్ధతుల్లో చెప్పడాన్ని కూడా నేనట్టే మెచ్చుకోలేను. పది విషయాలను పది పద్ధతుల్లో చెప్పడం నాకిష్టం.

 ఒక్కవారంలో మూడు నాలుగు కథలు రాసిన సందర్భాలున్నాయి. 5, 6 నెలల పర్యంతం ఒక్క లైను గూడా రాయని సందర్భాలున్నాయి. ‘అపశ్రుతులు’, ‘ఉన్నది-ఊహించేది’, ‘త్రినేత్రుడు’, ‘జయంతి’ లాంటి కథలను ఒకే ఊపున పూర్తి చేశాను. 1954లో ప్రారంభించిన ‘అసతోమా సద్గమయ’ అన్న కథను ఈనాటికీ పూర్తి చేయలేకపోయాను.

 నా ఉద్దేశాలు, ఆశయాలు, కలలు, నా చుట్టూ ఉన్నవారితో కలసి పంచుకోవాలన్నదే నా కుతూహలం. ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలు కొత్త ప్రయోగాలు అని నేననుకొన్న వాటిని చేసి చూశాను. అవి ఫలించాయో లేదో చెప్పవలసిన వారు పాఠకులు.

 (శార్వరి సంకలనం చేసిన కథలెలా రాస్తారు పుస్తకం నుంచి)

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top