యవనికకు ఎంత ధైర్యం?

యవనికకు ఎంత ధైర్యం? - Sakshi


‘‘పెద్ది రామారావుకు ఎంత ధైర్యం? అసలీయనకు లౌక్యమే లేదు, పెద్ద పెద్ద వాళ్ళని, వాళ్ళ సంస్థలని పట్టుకుని తిడతాడా? ఈయనకి ఇక నాటకరంగంలో నూకలు చెల్లినట్లే’’ అనిపిస్తాయి ‘యవనిక’ వ్యాసాలు చదివితే. అయితే, కుర్రాళ్లతో నాటకాలు వేయిస్తూ, నాటకరంగానికి కొత్త తరం ప్రేక్షకులని తయారుచేస్తున్న పెద్ది రామారావును చూశాకగానీ అర్థం కాలేదు; వ్యక్తులను, సంస్థలను అగౌరవ పరచడం ఆయన ఉద్దేశం కాక, ‘ఈనాటి నాటకం ఇంకా నిన్నటి నాటకంగానే ఉండి పోవడాన్ని’ సహించలేక రాసినవివని!



 గురజాడ అప్పారావు దగ్గరినుంచి పాటిబండ్ల ఆనందరావు దాక ఆధునిక తెలుగు నాటక రంగంలో వచ్చిన మార్పులను తెలియజేస్తూ, మరి మనమేంటి ఇంకా ఆంధ్ర నాటక కళా పరిషత్ రోజులలోనే ఆగిపోయామనే సందేహాన్ని చదువరిలో ఇవి కలుగ చేస్తాయి. అలాగే, చీమకుర్తి నాగేశ్వరరావు, డి.వి.సుబ్బారావు, సంపత్ నగర్ లక్ష్మణరావు, షణ్ముఖి ఆంజనేయ రాజు గురించి రాసినవి చదువుతుంటే, దృశ్యం కళ్లకు కట్టినట్లు కనపడుతూ, కళ్ళ నీళ్ళు పెట్టించడం చూశాక, నాటకాన్ని సాహిత్యం నుంచి దూరం చేశారని బాధపడటం మానేసి, మీరెందుకు ఆ పని చెయ్యలేక పోతున్నారని అడగాలనిపించేంత అద్భుతమైన వ్యాసాలున్నాయిందులో.

 

 పద్య నాటకం గురించి రాసినా, వీధి నాటకం గురించి రాసినా, సినిమా నాటకం గురించి రాసినా, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు చేస్తున్న ప్రయోగాత్మక నాటకాల గురించి రాసినా, ప్రస్తుత తెలుగు నాటక రంగానికి దిక్కు అయిన పరిషత్ నాటకాల గురించి రాసినా, కొందర్ని పొగిడినా, మరికొందర్ని విమర్శించినా ప్రతి వ్యాసం వెనుక వున్న పరమార్థం మాత్రం ‘నాటకం- దాని పురోభివృద్ధి’ అన్న విషయం కొట్టొచ్చినట్లు కనపడుతుంది.

 ఒక వ్యాసంలో ఆయన చెప్పినట్లు, మొన్న సినిమా వచ్చింది, నాటకం ఉంది, నిన్న ఇంట్లోకి టీవీ వచ్చింది, నాటకం ఉంది. జేబుల్లోకి ఇంటర్నెట్ వచ్చింది, ఇంకా నాటకం ఉంది. రేపు ఏమొచ్చినా నాటకం ఉండాలి అని గట్టిగా నమ్ముతూ, ‘నేను నాటక కళాకారుణ్ని’ అని గర్వంగా తల ఎత్తుకు తిరిగే రోజులు రావాలన్న నిండు ఆశతో, ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా యువతరానికి సరైన సూచనలిస్తూ ఈ పుస్తకం సాగుతుంది.

 యవనిక (నాటక వ్యాసాలు)

 రచన: డాక్టర్ పెద్ది రామారావు; పేజీలు: 200

 వెల: 200; ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు

 -  చంద్రశేఖర్ ఇండ్ల

 9912416123

Read latest Opinion News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top