దేశ విభజనలో చీకటి కోణాలు - తమస్... | Sakshi
Sakshi News home page

దేశ విభజనలో చీకటి కోణాలు - తమస్...

Published Sat, Jan 25 2014 2:42 AM

దేశ విభజనలో చీకటి కోణాలు - తమస్... - Sakshi

అప్పటికే బ్రిటిష్ వారు చేయవలసిన కుట్ర అంతా చేసేశారు. కాంగ్రెస్ హిందువుల పార్టీ అని ప్రచారం చేశారు. ముస్లింల కోసం ముస్లిం లీగ్ తప్పదనే పరిస్థితి సృష్టించారు. అంతెందుకు ముస్లింల కోసం పాకిస్తాన్ అనే దేశం వస్తే తప్ప వాళ్లకు రక్షణ లేదనే విష బీజాలను నాటేశారు.
 
 మసీదు ఎదుట ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చచ్చిన పందిని పడేసి పోయారు. గగ్గోలు రేగింది. మరి కాసేపటికి ప్రతీకారంగా ఇంకెవరో గోవును వధించి గుడి ముందు విసిరేశారు. ద్వేషం ప్రజ్వరిల్లింది. హిందు, ముస్లిం, సిక్కులు... నవ్వుతూ తుళ్లుతూ స్నేహంగా ఉండవలసిన వాళ్లందరూ విద్వేషంతో పడగ విప్పిన పాముల్లా బుసలు కొడుతున్నారు. కాని ఒక పిచ్చివాడు మాత్రం చౌరస్తాలో నిలబడి- ఇదంతా తెల్లవాళ్ల కుట్ర... దీనికి బలి కాకండి అని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాడు. ఆ ఆర్తనాదాలను పట్టించుకునేవాడే లేడు. ఆ నగరాన్ని కాపు కాయాల్సిన పోలీస్ కమిషనర్ కూడా నేనేం చేయలేను అని చేతులెత్తేశాడు. కాని అది నిజం కాదు. అనుభవించండ్రా అని అతడి కోపం. మమ్మల్ని- బ్రిటిష్ ప్రభువులని- క్విట్ ఇండియా అంటారా. మాదేం లేదు అంతా నెహ్రూ చేతుల్లోనే ఉందన్నట్టు మాట్లాడతారా... చూస్తాను ఇవాళ  మిమ్మల్ని ఎవరు కాపాడుతాడో అని అతడిలోని నీలి రక్తం అదను కోసం కాచుకొని ఉంది. అప్పటికే బ్రిటిష్ వారు చేయవలసిన కుట్ర అంతా చేసేశారు. కాంగ్రెస్ హిందువుల పార్టీ అని ప్రచారం చేశారు. ముస్లింల కోసం ముస్లిం లీగ్ తప్పదనే పరిస్థితి సృష్టించారు. అంతెందుకు ముస్లింల కోసం పాకిస్తాన్ అనే దేశం వస్తే తప్ప వాళ్లకు రక్షణ లేదనే విష బీజాలను నాటేశారు. పోతూ పోతూ భరతఖండం అనే ఈ పాలకుండను పగుల కొట్టేసి పోవాలి. చిందర వందర చేసి పోవాలి.
 
 అదీ లక్ష్యం. పిచ్చివాడు అరుస్తున్నాడు- మోసపోకండి... మోసపోకండి... కాని ఎవరు వింటారు? అర్ధరాత్రి గలాటాలు మొదలయ్యాయి. గృహ దహనాలు.. ఆస్తి దహనాలు.... స్త్రీల, పిల్లల ప్రాణ హననాలు... మనిషిలో ఎంత విషం దాగి ఉంటుందో మనిషిలోని వేయి వికృతాలు ఎప్పుడు బయట పడతాయో చూపించిన క్షణాలవి. జవాబుదారీతనం లేనప్పుడు, ఏమైనా చేసుకోవచ్చు అనే పరిస్థితి వచ్చినప్పుడు ప్రతి మనీషీ ఒక పిశాచం. కాని దీని పర్యవసానం ఏమిటి? దేశం ఏం కానుంది? భవిష్యత్తు ఏం కానుంది.? ఇది ఎవరి తప్పిదం.... 1975లో ప్రఖ్యాత హిందీ రచయిత భీష్మ్ సహానీ రాసిన గొప్ప నవల- దేశ విభజన మీద ఒక రహస్య డాక్యుమెంట్ - తమస్ (చీకటి). ఆయనకు సాహిత్య అకాడెమీ అవార్డును సాధించి పెట్టిన ఈ నవలను దర్శకుడు గోవింద్ నిహ్‌లానీ చదివినప్పుడు ఉద్వేగంతో ఊగిపోయాడు. అతడి ప్రాణానికి అది- చిన్నప్పటి పీడకల మళ్లీ రావడంలాంటిది. దేశ విభజన సమయంలో నిహ్‌లానీ పసివాడు.
 
  కరాచీ నుంచి వాళ్ల కుటుంబం ఏడుస్తూ గగ్గోలు పెడుతూ రాజస్తాన్ వచ్చి స్థిరపడటం అతడికి గుర్తుంది. కాని ఎవర్నో మెప్పించడానికి నిజాలను అబద్ధాలుగా అబద్ధాలను నిజాలుగా కాకుండా దేనికీ వెరవకుండా సత్యం వైపు నిలబడి భీష్మ్ సహానీ రాసిన ఈ నవలను తెరకెక్కించడం సాధ్యమా? ఎలాగైనా సరే సాధ్యం చేయాలని నిశ్చయించుకున్నాడు నిహ్‌లానీ. గతంలో శ్యాం బెనగళ్ సినిమాలను ప్రొడ్యూస్ చేసిన బ్లేజ్ సంస్థను కలిశాడు. దూరదర్శన్ కూడా నేనున్నానంది. ఫీచర్ ఫిల్మ్‌లా కాకుండా ఐదు గంటల టెలి ఫిల్మ్‌గా తీయాలి. అంత గొప్ప నవలకు అంతమంది పాత్రలు- అదృష్టం కొద్దీ దొరికారు. ఓం పురి, దీపా సాహీ, అమ్రిష్ పురి, ఏ.కె. హంగల్, సయీద్ జాఫ్రీ, పంకజ్ కపూర్... దానికి తోడు ఒక ఊరంత వేసిన ఔట్ డోర్ సెట్. దూరదర్శన్‌లో మినీ సీరియల్‌గా 1987లో ప్రసారమైన తమస్ సంచలనం రేపింది. ఆ తర్వాత నాలుగు గంటల ఫీచర్ ఫిల్మ్‌గా విడుదలయ్యింది.
 
 ఇంతవరకూ ఇది యూ ట్యూబ్‌లో చాలా పూర్ క్వాలిటీ ఉన్న ఎపిసోడ్లుగా అందుబాటులో ఉండేది. అయితే ఇటీవలే దీని డివిడిలు విడుదల కావడం వల్ల దాదాపు కొత్త సినిమా అంత మంచి క్వాలిటీలో నాలుగు భాగాలుగా సిద్ధంగా ఉంది. మతం వల్ల చిమ్మిన రక్తంతో మెట్లు కడగకుండా అందలం ఎక్కలేని పరిస్థితులు ఈ దేశంలో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడూ ఉంటాయి. కొండకచో ప్రజల ఆ బలహీనతను వాడుకోవాలనే శక్తులు ఇప్పుడు ఇంకా పెరిగాయి. సాహిత్యం చేయవలసిన పని దీనిని నిరోధించడమే, ఈ చీకటి మీద వెలుతురు వేయడమే. ఒకరోజు సెలవైనా పెట్టి నాలుగు గంటల ఈ సినిమాను చూసెయ్యండి. మొదలైన క్షణం నుంచీ రేగే ఉత్కంఠ, భయం, ఆశ్చర్యం, ఆందోళన... మిమ్మల్ని వదలవు. అంతిమంగా మీరు శుభ్రపడటం కూడా తప్పదు. అది ఈ నవల గొప్పదనం. ఏమో... దర్శకుడి గొప్పదనం కూడానేమో.

Advertisement

తప్పక చదవండి

Advertisement