‘శత వసంతాల’ డాక్యుమెంటరీలో తెలుగు గళాలు

‘శత వసంతాల’ డాక్యుమెంటరీలో తెలుగు గళాలు


భారతీయ సినిమాకు శత వసంతాలు పూర్తయి, అప్పుడే ఏడాది అయిపోయింది. అయితే, ప్రపంచంలోని అతి పెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటైన మన సినీ రంగానికి సంబంధించి హంగామా మాత్రం తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల వాళ్ళు కూడా శత వసంత భారతీయ సినిమా గురించి మరింతగా తెలుసుకొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు తగ్గట్లే బ్రిటన్‌లో పుట్టి, అక్కడే పెరిగిన ప్రముఖ హాస్యనటుడు, సమాచార ప్రసార నిపుణుడు సంజీవ్ భాస్కర్ మన దేశానికి వచ్చి, ఓ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా భారతీయ సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తున్నారు.

 

 తాజాగా ఆయన మన తెలుగు సినిమాకు సంబంధించి కూడా ఇంటర్వ్యూలు చేశారు. ‘మగధీర’, ‘ఈగ’, తాజాగా సెట్స్‌పై ఉన్న ‘బాహుబలి’ ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన సంచలన దర్శకుడు రాజమౌళి కూడా అలా ఇంటర్వ్యూ ఇచ్చిన వారిలో ఒకరు. రాజమౌళితో పాటు హీరో దగ్గుబాటి రానా, ఇంకా ‘బాహుబలి’ టీమ్‌లోని పలువురు నటులు, సాంకేతిక సిబ్బంది ఈ డాక్యుమెంటరీ కోసం తమ భావాలను పంచుకున్నారు. ‘‘గతంలో బి.బి.సి.లో వచ్చిన ‘ది కుమార్స్ ఎట్ నంబర్ 42’, ‘గుడ్‌నెస్ గ్రేషియస్ మి’ కామెడీ సిరీస్‌ల ఫేమ్ సంజీవ్ భాస్కర్ చిత్రీకరిస్తున్న నూరేళ్ళ భారతీయ సినిమా డాక్యుమెంటరీ కోసం ఆయనతో మాట్లాడాను. అది ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అని రాజమౌళి తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

 

 గతంలో భారతదేశమంతటా తిరిగి, మన దేశం గురించి ‘ఇండియా విత్ సంజీవ్ భాస్కర్’ పేరిట డాక్యుమెంటరీ సిరీస్‌ను సమర్పించి, నటించిన అనుభవం యాభయ్యేళ్ళ సంజీవ్‌ది. అలా ఇప్పటి పాకిస్తాన్‌లోని తన తాతల నాటి ఇంటిని కూడా ఆయన చూసి వచ్చారు. బి.బి.సి.లో సమర్పించిన కామెడీ సిరీస్‌లతో పాటు ఈ డాక్యుమెంటరీ ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. కాబట్టి, ఆయన తీస్తున్న ఈ తాజా నూరేళ్ళ భారతీయ సినిమా డాక్యుమెంటరీ కూడా చరిత్రలో నిలిచిపోతుందని ఆశించవచ్చు. మరి, ఇన్నేళ్ళ మన సినిమా గురించి, అందులోనూ తెలుగు సినిమా గురించి నవతరం దర్శకుడు రాజమౌళి, ఇతర తెలుగు ప్రముఖులు తమ భావాలు పంచుకోవడం ఆనందించదగ్గ విషయమేగా!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top