స్వర్ణోత్సవ ‘రాముడు - భీముడు’కథ ఒకటి... బాక్సాఫీస్ హిట్లెన్నో!

స్వర్ణోత్సవ ‘రాముడు - భీముడు’కథ ఒకటి... బాక్సాఫీస్ హిట్లెన్నో!


 కొన్నేళ్ళ పాటు కథారూపంలోనే ఉండిపోయి, నిర్మాతలెవరూ చిత్రరూపమివ్వడానికి ముందుకు రాని ఓ స్క్రిప్టు ఆ తరువాతెప్పుడో తెరకెక్కడం విచిత్రమే. అన్నేళ్ళు ఆగిన ఆ కథతో వచ్చిన సినిమా సూపర్ హిట్టవడం విశేషమైతే, ఇక ఆ కథ ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా ఆరు భాషల్లో రీమేకై, హిట్టవడం మరో విశేషం. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు బిడ్డల్లో ఒకరు అమాయకులు, మరొకరు దేనినైనా ఎదిరించి నిలిచే ధైర్యవంతులైతే ఎలా ఉంటుందనే ఆ ఇతివృత్తం ఇప్పటికీ సగటు బాక్సాఫీస్ సినీ సూత్రం. దాన్ని వాటంగా వాడుకొంటూ శ్రీదేవి ‘చాల్ బాజ్’ (1989) లాంటి ఎన్నో సినిమాలు ‘ఫ్రీ మేక్’లుగా వచ్చాయి. చాలామటుకు విజయాన్ని చవిచూశాయి. మరి, ఈ సినిమాలన్నిటికీ మూలం మన తెలుగు సినిమా కావడం మనకు గొప్పే కదా! ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు - భీముడు’ విడుదలై, ఇవాళ్టికి యాభై వసంతాలు నిండుతున్నాయి. ఆకట్టుకొనే అభినయం, అలరించే సంగీత సాహిత్యాలతో ఇవాళ్టికీ తీపిజ్ఞాపకమైన ఈ స్వర్ణోత్సవ చిత్ర విశేషాల్లో కొన్ని...

 

 ఓ తల్లికి ఇద్దరు పిల్లలు. అనుకోకుండా పుష్కరాల్లో ఒకడు తప్పిపోతాడు. మిగిలిన ఒక్కడూ అపురూపంగా పెరిగి అమాయకుడైతే, ఎవరికో దొరికిన రెండో పిల్లాడు బీదరికంలో పెరిగినా, ధైర్యవంతుడవుతాడు. పెరిగి పెద్దయిన వీళ్ళిద్దరూ చిత్రమైన పరిస్థితుల్లో ఒకరి స్థానంలోకి మరొకరు వెళతారు. అప్పుడు జరిగిన నాటకీయ సంఘటనలేమిటి? వారిద్దరూ అన్నదమ్ము లుగా ఎలా కలిశారు? దుర్మార్గుల ఆటలు ఎలా కట్టాయి? ఇదీ ఎన్టీఆర్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన ‘రాముడు - భీముడు’ చిత్ర కథాంశం. ఇది సాంఘిక చిత్రమే కానీ, రచయిత డి.వి. నరసరాజు మొదట దీన్ని జానపద కథగా అల్లారు. ‘ప్రిజనర్ ఆఫ్ జెండా’, వేదం వెంకట రాయశాస్త్రి రచన ‘ప్రతాపరుద్రీయం’ లాంటి వాటి స్ఫూర్తితో ఆ కథ అల్లారు. ఆ తరువాత ఈ జానపదాన్ని సాంఘిక కథగా మార్చారు. నలుగురైదుగురు దర్శక, నిర్మాతల దగ్గర తిరిగినా కెమేరా ముందుకు రాని ఈ కథ తాపీ చాణక్య దర్శకత్వంలో, డి. రామానాయుడు చేతిలో పడ్డాక, బాక్సాఫీస్ ఫార్ములా అయి కూర్చుంది.

 

 రీమేక్‌లో ఇదో రికార్డు!: ఇవాళ దేశంలోని అనేక భాషల్లో సినిమాలు నిర్మించి, శతాధిక చిత్ర నిర్మాతగా ‘దాదాసాహెబ్ ఫాల్కే’ స్థాయికి ఎదిగిన డి. రామానాయుడు ‘సురేష్ ప్రొడక్షన్స్’ పతాకంపై నిర్మించిన తొలి సినిమా ఈ ‘రాముడు - భీముడు’. అంతకు ముందు ఇతరుల చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ‘అనురాగం’ అనే ఓ చిత్రానికి పెట్టుబడి పెట్టి డబ్బులు పోగొట్టుకున్న ఆయన ఈ సినిమాతోనే పూర్తిస్థాయి నిర్మాతగా కెరీర్‌ను ప్రారంభించారు. అప్పట్లో 6 లక్షల బడ్జెట్‌లో ఎన్టీఆర్, జమున, ఎల్. విజయలక్ష్మి, ఎస్వీ రంగారావు, శాంతకుమారి ప్రధాన తారాగణంగా తయారైన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఇన్ని ప్రింట్లు, ఇన్ని కేంద్రాల్లో రిలీజులు లేని ఆ రోజుల్లోనే 30 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం జరుపుకొన్న తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. దాంతో ఈ కథను తమిళం (ఎమ్జీఆర్‌తో ‘ఎంగ వీట్టు పిళ్ళై’), హిందీ (దిలీప్ కుమార్‌తో ‘రామ్ ఔర్ శ్యామ్’) భాషల్లో ‘విజయా’ నాగిరెడ్డి తీశారు.



అలాగే, కన్నడం, మలయాళం, ఒరియా, బెంగాలీ భాషల్లోకి ఈ చిత్రం రీమేకైంది. తెలుగు నుంచి అత్యధికంగా 6 భాషల్లోకి అధికారికంగా రీమేకైన సినిమా ఇవాళ్టికీ ఇదొక్కటే!  రిపీట్ రన్స్‌లోనూ బాగా ఆడిన ఈ చిత్రాన్ని లేడీ ఓరియెంటెడ్ కథగా మార్చి, హిందీలో ‘సీతా ఔర్ గీతా’, తెలుగులో ‘గంగ - మంగ’ లాంటివి వచ్చాయి. అనిల్ కపూర్ ‘కిషన్ కన్హయ్య’, శ్రీదేవి ‘చాల్‌బాజ్’ తరహాలో అనధికారిక ‘ఫ్రీ మేక్’లుగా వచ్చిన సినిమాలు కోకొల్లలు. ఆఖరుకు కొద్దిపాటి మార్పులు, చేర్పులతో సాక్షాత్తూ ఎన్టీఆర్ కుమారుడైన బాలకృష్ణతో ‘రాముడు - భీముడు’ అన్న టైటిల్‌తోనే తెరకెక్కింది. తెరపై ఓ హిస్టారికల్ డాక్యుమెంట్: ఈ సినిమాలో ఎన్టీఆర్, శాంతకుమారి అక్కాతమ్ముళ్లు. సినిమా కథలో భాగంగా వారి తల్లితండ్రులుగా కూడా ఆ ఇద్దరే తెరపై పెయింటింగ్‌ల రూపంలో వయసు పైబడ్డ రూపంలో కనిపించడం విశేషం. వారిద్దరూ అలా జోడీగా కనిపించే సినిమా ఇదొక్కటే.

 

 నటుడు కైకాల సత్యనారాయణ ఈ చిత్రంలో ప్రత్యేకించి పాత్ర పోషణ చేయలేదన్న మాటే కానీ, సినిమా అంతటా ఎన్టీఆర్‌కు డూప్‌గా నటించారు. ఇక, పెండ్యాల బాణీల్లో వచ్చే స్ఫూర్తిదాయక గీతం ‘ఉందిలే మంచికాలం ముందు ుుందునా...’ (రచన- శ్రీశ్రీ), యుగళ గీతాలు ‘తెలిసిందిలే తెలిసిందిలే...’, ‘అదే అదే...’ (సినారె), హాస్య గీతాలు ‘సరదా సరదా సిగరెట్టు...’, ‘తగునా ఇది మామ..’ (కొసరాజు) ఇవాళ్టికీ సూపర్‌హిట్లే. కృష్ణానదిపై నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మిస్తున్న సమయంలో శ్రమకోర్చి మరీ అక్కడ ‘దేశమ్ము మారిందోయ్.. కాలమ్ము మారిందోయ్...’ (కొసరాజు) పాటను చిత్రీకరించారు. ఎన్టీఆర్, ఎల్. విజయలక్ష్మి బృందంపై వచ్చే ఆ పాట ఆనాటి మన ‘ఆధునిక దేవాలయ’ నిర్మాణ దృశ్యాలకు ఇప్పుడు వెండితెరపై మిగిలిన ఓ హిస్టారికల్ డాక్యుమెంట్.

 

 త్వరలో... కలర్‌లో: నాలుగైదేళ్ళు రచయిత దగ్గరే మూలిగిన ఈ చిత్ర కథ తెరకెక్కిన వేళా విశేషమేమో కానీ, అటు ‘సురేష్ ప్రొడక్షన్స్’ అయిదు దశాబ్దాలుగా నిర్విరామంగా సినిమాలు తీస్తూ, 15 భారతీయ భాషల్లో 150 దాకా సినిమాలు తీసిన ప్రతిష్ఠాత్మక సంస్థగా ఎదిగింది. ఇటు ఈ కథాంశమూ దేశంలోని అనేక భాషల్లో పదే పదే తెరకెక్కుతూ వచ్చింది. అందుకే, రామానాయుడుకు ఈ సినిమా ఓ స్పెషల్. ‘‘నా సంస్థకు విత్తనమైన ఎన్టీఆర్ ‘రాముడు - భీముడు’నూ, ఆ తర్వాత కొన్నేళ్ళకు మళ్ళీ ఎన్నో కష్టాల్లో ఉండగా నా సంస్థను నిలబెట్టిన ఏయన్నార్ ‘ప్రేమనగర్’నూ మర్చిపోలేను’’ అని ప్రత్యేకించి పదే పదే ప్రస్తావిస్తుంటారు.     ఈ కథను ఎన్టీఆర్ మనుమడైన ఈ తరం హీరో ఎన్టీఆర్‌తో మళ్ళీ తీయాలని ఆయన కోరిక. ఆ సంగతి ఆయన ప్రకటించారు కూడా. ఆ ప్రయత్నం ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో, అయిదు పదుల ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్‌లోకి మారుస్తున్నారు. త్వరలోనే విడుదల చేసే పనిలో ఉన్నారు. ఓ కథకూ, సినిమాకూ అంతకన్నా అరుదైన గౌరవం ఇంకేముంటుంది!

 - రెంటాల జయదేవ

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top