‘డి.టి.ఎస్’ మధుసూదనరెడ్డి హఠాన్మరణం

‘డి.టి.ఎస్’ మధుసూదనరెడ్డి హఠాన్మరణం - Sakshi


 ప్రముఖ శబ్దగ్రాహకుడు, డి.టి.ఎస్. మిక్సింగ్‌లో సుప్రసిద్ధుడూ అయిన సౌండ్ ఇంజనీర్ పి. మధుసూదనరెడ్డి ఇక లేరు. తీవ్రమైన గుండెపోటు రావడంతో, సోమవారం ఉదయం ఆయన హఠాత్తుగా కన్నుమూశారు. ఆదివారం రాత్రి పొద్దుపోయేదాకా ‘దోచేయ్’ చిత్రం మిక్సింగ్ పనిలో తీరిక లేకుండా ఉండి, ఆ వ్యవహారం పూర్తి చేసుకొని ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. సోమవారం ఉదయం నిద్ర లేచి, పిల్లల స్కూలు పని మీద వెళ్ళి ఇంటికి తిరిగొస్తూ, మెట్ల మీదే ఆయనే కుప్పకూలిపోయినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కొద్ది గంటల క్రితం దాకా తమ మధ్యే సినిమా పనిలో గడిపిన మధుసూదనరెడ్డి హఠాన్మరణం తెలుగు సినీ పరిశ్రమ వర్గీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

 

 నిండా యాభయ్యేళ్ళు కూడా లేని మధుసూదనరెడ్డి సినీ శబ్దగ్రహణ విభాగంలో పేరున్న సాంకేతిక నిపుణుడు. ఆయనకు భార్య శశి, ఇద్దరు కుమారులు ఉన్నారు. చెన్నైలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్న ఆయన ప్రముఖ ఆడియోగ్రాఫర్ స్వామినాథన్ వద్ద శిష్యరికం చేశారు. మధుసూదనరెడ్డి స్వతంత్రంగా ఆడియోగ్రాఫర్‌గా చేసిన చిత్రాల్లో ‘గులాబి’, ‘సిసింద్రీ’ మొదలు మహేశ్ ’ఒక్కడు’, అనుష్క ‘అరుంధతి’, గత ఏడాది రిలీజైన అక్కినేని కుటుంబ చిత్రం ‘మనం’ మొదలైనవి అనేకం ఉన్నాయి. ఇంజనీర్‌గా మొదలుపెట్టి సౌండ్ రికార్డిస్టుగా, డిజైనర్‌గా ఎదిన ఆయన గడచిన రెండు దశాబ్దాల పైచిలుకు కెరీర్‌లో దాదాపు 125 చిత్రాలకు పైగా శబ్ద గ్రహణం చేశారు. అందరూ ‘డి.టి.ఎస్. మధు’ అని ముద్దుగా పిలుచుకొనే ఆయన పని విషయంలో నాణ్యతకూ, నిర్దుష్టతకూ మారుపేరు. సినిమా విడుదలైన తరువాత కూడా సౌండ్ సరిగా లేదని తనకు అసంతృప్తి కలిగితే, ఔట్‌పుట్‌ను మార్చి, కొత్త ప్రింట్లు పంపేవారు.

 

 శబ్ద విభాగంలో ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాల్ని ఆకళింపు చేసుకొని, వాటిని నిత్యం పనిలో వాడే మధుసూదనరెడ్డికి ‘ఒక్కడు’, ‘అరుంధతి’ తదితర చిత్రాలు నంది పురస్కారాలు తెచ్చాయి. శబ్దగ్రహణ శాఖలో 9 సార్లు నంది అవార్డులు అందుకున్న ఘనుడాయన. ఎంతో పేరొచ్చినా, అందరితో స్నేహంగా ఉంటూ మంచిమనిషిగా పేరు తెచ్చుకున్నారు. చాలాకాలం ఆయన రామానాయుడు స్టూడియోలో పనిచేశారు. కొంతకాలం క్రితం స్టూడియో నుంచి బయటకొచ్చేసి, హైదరాబాద్‌లోని మణికొండలో ఆఫీసు పెట్టుకొని, శబ్దగ్రహణంలో కృషి చేస్తున్నారు. సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌తో సహా చాలామంది మిక్సింగ్‌కు మధుసూదనరెడ్డినే ఆశ్రయించేవారంటే, ఆయన పని మీద ఎంత నమ్మకమో అర్థం చేసుకోవచ్చు. ఒక మంచి టెక్నీషియన్‌ను కోల్పోయామంటూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top