రెండు రాష్ట్రాల్లోనూ పోటీ చేస్తాం: పవన్
వచ్చే సంవత్సరం మార్చి నాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుతుందని, 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామని పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ తెలిపారు.
వచ్చే సంవత్సరం మార్చి నాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుతుందని, 2019లో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామని పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోర్టల్‌ను ఆవిష్కరించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది జూన్ నుంచి నాయకులను గుర్తించే కార్యక్రమాలు మొదలవుతాయని, యువతకు పెద్దపీట వేస్తామని.. యువ నాయకత్వం కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో పార్టీని నమోదు చేశామని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల నుంచి గుర్తింపు కూడా వచ్చిందని తెలిపారు. రెండు రాష్ట్రాలలో కూడా కార్యకర్తల స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలని అన్నారు.
పొత్తుల గురించి వివిధ పార్టీలకు స్పష్టత ఇచ్చేముందు తమ పార్టీ నిర్మాణం గురించి కూడా చూసుకోవాలని, కమ్యూనిస్టులు గానీ మరే పార్టీలైనా బలమైన నిర్మాణం కలిగిన పార్టీలని పవన్ చెప్పారు. వాళ్లతో పొత్తులు పెట్టుకోవాలంటే తమ పార్టీ నిర్మాణం జరగకుండా చేయడం సరికాదని తెలిపారు. అసలు పొత్తుల అవసరం ఉందో లేదో కూడా అప్పుడే నిర్ణయించుకుంటామన్నారు. రాజకీయంగా ఒక ప్రత్యామ్నాయంగా ఉండాలన్నది తమ అభిప్రాయమని చెప్పారు. అధికారంలోకి వస్తామా రామా అన్నది ముఖ్యం కాదని, ప్రజా సమస్యలను బలంగా ముందుకు తీసుకెళ్లాలన్నది లక్ష్యమని అన్నారు. ప్రజల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలే తమకు ముఖ్యం తప్ప అధికారం కాదని స్పష్టం చేశారు. సర్వేలు పరిస్థితులను బట్టి మారొచ్చని.. తాము వాటిమీద ఆధారపడి ఉండబోమని పవన్ అన్నారు. తమ పరిమితులు తమకున్నాయని, పూర్తిగా అనుకున్న స్థాయికి చేరలేకపోవచ్చు గానీ, స్ఫూర్తి అలాగే ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార పార్టీ కుటుంబ కలహాల ప్రభావం ఎన్నికల ఫలితాల మీద గట్టిగా కనిపించిందని అభిప్రాయపడ్డారు.


